కాకినాడ పోర్టును బెదిరించి తమ పేరుపై రాయించుకున్న ఘటనలో విదేశాలకు పారిపోకుండా నిందితులు అయిన విజయసాయిరెడ్డి, విక్రాంత్ రెడ్డి, శరత్ చంద్రారెడ్డిలపై లుకౌట్ నోటీసులను ఏపీ సీఐడీ అధికారులు జారీ చేశారు. పోర్టు యజమాని అయిన కెవీ రావు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయన వాంగ్మూలం తీసుకుని కేసు నమోదు చేశారు. పాయింట్ బ్లాంక్ లో గన్ పెట్టి బెదిరించి పోర్టులో వాటలాను చాలా తక్కువకు రాయించుకున్నారని కెవీరావు వాంగ్మూలం ఇచ్చారు.
దీంతో విజయసాయిరెడ్డితో పాటు విక్రాంత్ రెడ్డి, శరత్ చంద్రారెడ్డిలపై తీవ్రమైన అభియోగాలతో కేసు నమోదు అయింది. ఈ క్రమంలో వారు విదేశాలకు పారిపోయేందుకు ప్రయత్నించే అవకాశం ఉంది. విజయసాయిరెడ్డి పారిపోవడానికి చాన్స్ లేదు. ఆయన గతంలో చేసిన నిర్వాకాలకు ఆయన పాస్ పోర్టు ఇంకా కోర్టు అధీనంలోనే ఉంటుంది. కానీ విక్రాంత్ రెడ్డి, శరత్ చంద్రారెడ్డి పారిపోయేందుకు చాన్స్ ఉంది. అందుకే వారితో పాటు విజయసాయిరెడ్డిపైనా లుకౌట్ నోటీసులు జారీ చేశారు.
ఇటీవల విజయసాయిరెడ్డి తాను ఐక్యరాజ్య సమితికి సమావేశానికి పోతున్నానని హడావుడిచేస్తున్నారు. వెళ్లారో లేదో తెలియదు. ఆ సమయం వచ్చిందో లేదో తెలియదు. ఆర్కే చేసిన సవాల్‌కు కూడా ఐక్యరాజ్య సమితి సమావేసానికి వెళ్లొచ్చిన తర్వాత స్పందిస్తానని చెప్పుకొచ్చారు. నాన్ అఫీషియల్ కేటగరి కింద సమావేశాలు చూడటానికి కొంత మంది ఎంపీలకు కేంద్రం చాన్స్ ఇస్తుంది. ఈ సారి ఆ అవకాశాన్ని ఆయన దక్కించుకున్నారు. అది కూడా గొప్పగా ప్రకటించుకుంటూ నవ్వుల పాలవుతున్నారు. ఇప్పుడు అక్కడికీ వెళ్లకుండా లుకవుట్ నోటీసులు జారీ అయ్యాయి.