స్టాప్…! ఇప్పుడు జూమ్ చేసి చూడండి..! ఏముందక్కడ..!?. ప్రభుత్వం ఇళ్లు ఉచితం. గత ప్రభుత్వం ఇళ్లు ఇచ్చినా ఇరవై ఏళ్లు ఈఎంఐ కట్టాల్సిన అవసరం లేదని ఉంది సార్..!. ఎన్నికల ప్రచారంలో ఏం చెప్పాను..? ఎన్నికల ప్రచారంలోనూ అదే చెప్పారు సార్..!. మీరంతా అక్కడి వరకే చూస్తున్నారు. కానీ దానికి ముందు నేను చెప్పిన మాటను పట్టించుకోవడం లేదు. .అది కూడా కరెక్ట్‌గా వినండి..! 300 చదరపు అడుగుల ఇంటికి చంద్రబాబు డబ్బులు వసూలు చేస్తున్నారు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రూపాయి కూడా వసూలు చేయం.. కట్టాల్సిన అవసరమే లేదని ఉంది. అదీ పాయింట్.. అర్థం కాలేదా..? 300 చదరపు అడుగల ఇంటికి మాత్రమే ఇస్తానన్నా..! అన్ని ఇళ్లకు కాదు. ఇప్పుడర్థమయిందా..?
సేమ్ టు సేమ్ కాకపోయినా.. ఇంచుమించుగా అసెంబ్లీలో ఇదే జరిగింది. టిడ్కో ఇళ్లన్నింటినీ.. లబ్దిదారులకు ఉచితంగా ఇస్తామన్నారు కదా అన్న విపక్ష నేతల ప్రశ్నలకు జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి భగ్గుమన్నారు. తాను ఉచితంగా ఇళ్లు ఇస్తానని చెప్పలేదన్నారు. అలా అనడమే కాదు.. మేనిఫెస్టోను ప్రదర్శించారు. అసెంబ్లీలో ఓ మూల ఉన్న పెద్ద టీవీల్లో మేనిఫెస్టోను ప్రదర్శించి.. అందులో ఉన్న ఇళ్ల అంశాన్ని జూమ్ చేయించారు. అందులో 300 చదరపు అడుగుల ఇళ్ల గురించి ఉంది. మిగతా ఇళ్లకు డబ్బులు వసూలు చేస్తానని లేదు. అయినా సరే తాను 300చదరపు అడుగుల ఇళ్లను మాత్రమే ఉచితంగా ఇస్తానని అంతకన్నా పది చదరపు అడుగులు ఎక్కువైనా డబ్బులు కట్టాల్సిందేనని అంటున్నారు.
మేనిఫెస్టోను జూమ్ చేసిమరీ.. జగన్ చెప్పిన లాజిక్ విని.. టీడీపీ సభ్యులకు మూర్ఛ వచ్చినంత పని అయింది. అసలు ఓ పది లేదా వంద చదరపు అడుగులు ఎక్కువ తీసుకున్నంత మాత్రాన.. అవేమీ ప్యాలెస్‌లు అవ్వవు. అయినా వారికి ఉచితంగా ఇచ్చేందుకు జగన్మోహన్ రెడ్డి సిద్ధపడటంలేదు. 300 చదరపుఅడుగుల్లో ఇల్లు అంటే… ఒక్క రూమ్ .. చిన్న వరండా కూడా రావడం కష్టం. పేదలకు అలాంటివే కావాలంటున్నారు జగన్మోహన్ రెడ్డి. అవే ఇస్తానంటున్నారు. గతంలో సన్నబియ్యం సహాఅనేక అంశాల్లో మేనిఫెస్టోను చూపించి.. తాను చెప్పలేదన్నారు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఇళ్ల విషయంలో మాట మార్పు.. మరో ఎపిక్ గా మిగిలిపోవడం మాత్రం ఖాయం.