తిరుమల శ్రీవేంకటేశ్వరుని నగలపై.. నిన్నామొన్నటిదాకా… శ్రీవారి ప్రధాన అర్చకులుగా వ్యవహరించిన… రమణదీక్షితులు చేసిన ఆరోపణలు.. కలకలం సృష్టించాయి. నగలు పక్కదారి పట్టాయని.. కొన్ని కనిపించడం లేదని రమణదీక్షితులు వెనక్కి తగ్గకుండా ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. ఆయన రాజకీయ ఎజెండాతో ఆరోపణలు చేస్తున్నారన్న విమర్శలు జోరుగా వచ్చాయి. రమణదీక్షితుల ఆరోపణలను అందిపుచ్చుకున్న ప్రధాన ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ …రాజకీయంగా..టీడీపీని ఇరుకున పెట్టేందుకు వాటిని ఉపయోగించుకుంది. ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి.. అయితే ఓ అడుగు ముందుకేశారు. శ్రీవారి నగలు.. చంద్రబాబు ఇంట్లో ఉన్నాయని… తవ్వకాలు జరిపితే బయటపడతాయని ఆరోపించారు. తవ్వకాలు చేపట్టాలని కూడా సవాల్ చేశారు.
ఇదంతా కావాలని చేస్తున్న ఆరోపణల్లా ఉన్నప్పటికీ… ప్రభుత్వం మాత్రం సీరియస్‌గా తీసుకుంది. శ్రీవారి నగల విషయంలో భక్తుల్లో ఏ చిన్న అనుమానం ఉండకూడదన్న నిర్ణయానికి వచ్చింది. మూడు రోజుల కిందట ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతి రెండేళ్లకోసారి… హైకోర్టు సిట్టింగ్ జడ్జితో నగల పరిశీలన జరిపించాలని నిర్ణయించారు. దాని కోసం ఇప్పుడు కార్యాచరణ ప్రారంభించారు. హైకోర్టు చీఫ్ జస్టిస్‌కు లేఖ రాశారు. సిట్టింగ్ న్యాయమూర్తితో.. శ్రీవారి నగలన్నింటినీ పరిశీలించి నిజాలు నిగ్గు తేల్చాలని కోరారు. ఇది భక్తులు, ప్రజల భావోద్వేగాలతో ముడిపడిన సున్నితమైన విషయమని చంద్రబాబు గుర్తు చేశారు. అందుకే ప్రజల్లో ఏ అనుమానం లేకుండా…సిట్టింగ్ జడ్జితో పరిశీలన చేయించాలని కోరారు.
గతంలో శ్రీవారి నగల విషయంలో ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు… జస్టిస్ జగన్నాథం, జస్టిస్ వాధ్వా కమిటీలు శ్రీవారి నగల పరిశీలన జరిపాయి. అప్పట్లో వచ్చిన ప్రతి ఆరోపణపై ఈ కమిటీలు విచారణ జరిపాయి. శ్రీవారి నగలు అన్నీ ఉన్నాయని లెక్క తేల్చారు. రమణదీక్షితులు ఆరోపిస్తున్న పింక్ డైమండ్ వ్యవహారంపైనా…జస్టిస్ వాద్వా కమిటీ విచారణ జరిపింది. అప్పట్లో ప్రధాన అర్చకులుగా ఉన్న రమణదీక్షితులు.. దీని గురించి ఎలాంటి అనుమానాలు వాద్వా కమిటీ ముందు వ్యక్తం చేయలేదు. ఈవో హోదాలో ఐవైఆర్ కృష్ణారావు.. ఎలాంటి వజ్రం లేదని.. అది కెంపు మాత్రమేనని స్పష్టం చేశారు. దానికి రమణదీక్షితులు ఆమోదం తెలిపారు కూడా.
కానీ ఇప్పుడు వీరిద్దరే… అది డైమండ్ అని.. బయటకు పోయిందని.. జెనీవాలో వేలం వేశారని.. ప్రభుత్వంపై నిందలేసేలా మాట్లాడుతున్నారు. నిజానికిపింక్ డైమండ్ మాయం అయినట్లు వాళ్లు చెబుతున్న సమయంలో టీడీపీ అధికారంలో లేదు. టీటీడీలో ఐవైఆర్, రమణదీక్షితులే రాజ్యం చేస్తున్నారు. అయినా ఇప్పటి ప్రభుత్వం నిందలేసేలా…వ్యవహరిస్తున్నారు. దీంతో కేంద్రం.. అన్నింటికీ ముగింపు పలకడానికి… హైకోర్టు సిట్టింగ్ జడ్జితో పరిశీలనకు నిర్ణయించింది. దీంతో వివాదాలకు ఓ ముగింపు పలికినట్లయ్యే అవకాశం ఉంది.