లైంగిక వేధింపులకి పాల్పడినందుకు సౌదీ యువరాజు మజేడ్ అబ్దుల్ అజీజ్-అల్-సౌద్ అమెరికాలో లాస్ ఏంజిలెస్ పోలీసులు బెవర్లీ హిల్స్ లో అతని భవనం నుండి బుదవారంనాడు అరెస్ట్ చేసారు. అతను ఒక మహిళపై అత్యాచారం చేయబోతుంటే ఆమె తప్పించుకొని పోలీసులకు పిర్యాదు చేసింది. ఆ ప్రయత్నంలో ఆమె భవనం చుట్టూ ఉన్న 8 అడుగుల ఎత్తయిన గోడ మీద నుండి దూకి బయటపడింది. సౌదీ యువరాజు గత కొన్ని రోజులుగా ఆ భవనానికి 37 మిలియన్ డాలర్లు అద్దె చెల్లించి ఉంటున్నారు. అతనికి దౌత్యపరమయిన రక్షణ ఏదీ లేదని దృవీకరించుకొన్న తరువాత పోలీసులు బుదవారం సాయంత్రం అరెస్ట్ చేసారు. కానీ 300, 000 డాలర్లు చెల్లించి బెయిల్ పై విడుదలయ్యారని లాస్ ఏంజిలెస్ పోలీస్ అధికారి డ్రేక్ మెడిసన్ తెలిపారు. ఆ భవనంలో పనిచేస్తున్న 20 మంది సిబ్బందిని అదుపులో తీసుకొని పోలీసులు ప్రశ్నిస్తున్నారు.
సువిశాలమయిన ఆ భవనాన్ని విదేశాలకు చెందిన నేతలు, ప్రముఖులు ముఖ్యంగా గల్ఫ్ దేశాలకి చెందిన యువరాజులు అద్దెకు తీసుకొని ఉంటుంటారు. కొన్ని నెలల క్రితమే ఖతార్ దేశ యువరాజు ఖలీద్ బిన్ హమాద్-అల్-తానీ ఖాళీ చేసి వెళ్ళిపోయారు. తరువాత సౌదీ యువరాజు మజేడ్ అబ్దుల్ అజీజ్-అల్-సౌద్ అందులో అద్దెకు దిగారు. ఇంతకు ముందు దిగిన ఉన్న ఖత్తర్ యువరాజు ఎంతో రద్దీగా ఉండే బెవర్లీ హిల్స్ లో తన విలాసవంతమయిన ఫెరారీ కారుని గంటకు వంద కి.మీ. వేగంతో నడిపిస్తూ సిగ్నల్స్ బ్రేక్ చేసినందుకు పోలీసులు అతనిపై కూడా కేసు పెట్టారు. అతనికి కూడా ఎటువంటి దౌత్యపరమయిన రక్షణ కవచం లేదని దృవీకరించుకొన్న తరువాత పోలీసులు అతనిని అరెస్ట్ చేయదానికి వెళితే అప్పటికే అతను స్వదేశానికి పారిపోయాడు. తాను ఏ నేరానికి పాల్పడలేదని అతను వాదిస్తున్నాడు.
ఖతార్ యువరాజు తరువాత ఇప్పుడు సౌదీ యువరాజు వంతు వచ్చినట్లుంది. ఒక దేశానికి యువరాజయిన అతను ఆ దేశ ప్రతిష్టను ఇనుమడింపజేయాలి. కానీ ఇంత హేయమయిన నేరానికి పాల్పడి, విదేశంలో అరెస్ట్ కావడం సౌదీ అరేబియా దేశానికి, అతని రాజవంశానికి కూడా ఎంతో అప్రతిష్ట తెచ్చేదే. మరి ఈ కేసుపై సౌదీ ప్రభుత్వం ఏవిధంగా స్పందిస్తుందో తెలియదు కానీ ఇరు దేశాల మధ్య సంబంధాలను దెబ్బతీసే ప్రమాదం ఉంది. డిల్లీలో సౌదీ దౌత్యవేత్త ఒకరు ఇంతకంటే చాలా హేయమయిన నేరానికి పాల్పడ్డాడు. కానీ అతను తన దౌత్యపరమయిన రక్షణను అడ్డుపెట్టుకొని సౌదీకి పారిపోతుంటే భారత ప్రభుత్వం అతనిని ఏమీ చేయలేకపోయింది. కానీ అమెరికా పోలీసులు మాత్రం ఏకంగా సౌదీ యువరాజునే అరెస్ట్ చేసి అగ్రరాజ్యం సత్తా చూపించారు.