తెలంగాణ బీజేపీలో ఎంపీ టిక్కెట్ల కోసం పోటీ తీవ్రంగా ఉంది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో 10 ఎంపీ సీట్లు గెలవాలని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా దిశానిర్దేశం చే ఎంపీ టికెట్ల కోసం నాయకులు పెద్దఎత్తున పోటీ పడుతున్నారు. ఒక్క సికింద్రాబాద్ సీటుకు మాత్రమే పోటీ లేదు. మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో నేతలు పోటీ పడుతున్నారు. మెదక్ నుంచి పోటీకి రఘునందన్‌రావు ఇప్పటికే ప్రకటించారు. కానీ ఆయనకు చాన్సివ్వకూడదన్న పట్టుదలతో మరో వర్గం ఉంది.
చేవెళ్ల నుంచి పోటీకి మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పోటీకి రెడీగా ఉన్నారు. కానీ.. మాజీ మంత్రి దేవేందర్ గౌడ్ కుమారుడు వీరేందర్ గౌడ్ ప్రయత్నిస్తున్నారు. ఆయన గతంలో చేవెళ్ల నుంచి టీడీపీ తరపున పోటీ చేశారు. మహబూబ్‌నగర్ సీటు కోసం బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, మాజీ ఎంపీ ఏపీ జితేందర్‌రెడ్డి, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు టి.ఆచారి ప్రయత్నాల్లో ఉన్నారు. మహబూబ్ నగర్ సీటు పరిస్థితి హైకమాండ్‌కు తీర్చలేని పంచాయతీగా మారే అవకాశం కనిపిస్తోంది. డీకే అరుణకు సీటిస్తే జితేందర్ రెడ్డి పార్టీ మారిపోయే సూచనలు కనిపిస్తున్నాయి.
మల్కాజ్గిరి లోక్‌సభ సెగ్మెంట్ నుంచి బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటల రాజేందర్ పోటీ చేస్తానంటున్నారు. అయితే మల్కాజిగిరి నుంచి పోటీ తీవ్రంగా ఉంది. పి.మురళీధర్‌రావు, పేరాల శేఖర్‌రావు, ఎన్.రామచందర్‌రావు, కూన శ్రీశైలంగౌడ్, డా.ఎస్.మల్లారెడ్డి, టి.వీరేందర్‌గౌడ్, సామ రంగారెడ్డి, మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు హరీశ్‌రెడ్డి తదితరులు ఇక్కడి నుంచి ప్రయత్నాలు చేస్తున్నారు. వరంగల్ ఎంపీ టికెట్ ఇస్తే.. బీజేపీలో చేరి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ చెబుతున్నారని సమాచారం.
చాలా నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులు ఉన్నప్పటికీ.. వర్గ పోరాటం పెద్ద సమస్యగా మారింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత అంతర్గత సమావేశానికి అమిత్ షా ఒక్క సారి మాత్రమే వచ్చారు. ఇక హైకమాండ్ ఎలాంటి దృష్టి పెట్టలేదు. లోక్ సభ ఎన్నికల కోసం దేశమంతా దృష్టి పెట్టాల్సి రావడంతో తెలంగాణపై ఎక్కువ సమయం కేటాయించలేకపోతున్నారు.