గోదావరిపై బ్యారేజీలు రిజర్వాయర్ల నిర్మాణానికి సంబంధించిమహారాష్ట్రతో కుదుర్చుకున్న ఒప్పందం చారిత్రాత్మకమైందని టిఆర్ఎస్ ప్రభుత్వం భారీ హంగామా చేసింది.ఇరుగు పొరుగు రాష్ట్రాల మధ్య సుహృద్భావ పూర్వక వాతావరణం ఎప్పుడూ మంచిదే. అయితే మేడిగడ్డకు సంబందించి 2012లో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాన్ని కూడా ప్రస్తావించివుంటే వాస్తవికంగా వుండేది. ఆ ఒప్పందంలో మేడిగడ్డ ఎత్తు కన్నా తగ్గించి ఇప్పుడు సంతకాలు చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా ఆయన గాక మరెవరైనా ఇలా చేసి వుంటే పెద్ద దుమారమే రేగేది. అయితే ఇప్పుడు కూడా కాంగ్రెస్ తెలుగుదేశం సిపిఎం దీని వల్ల కలిగే నష్టాన్ని గట్టిగానే ఎత్తిచూపాయి. పైగా ఇంత కీలకమైన విషయమై మరో రాష్ట్రంతో ఒప్పందానికి వచ్చే ముందు రాష్ట్రంలోని ఇతర పార్టీలకు మాట మాత్రంగా చెప్పవలసింది. ఏకపక్షంగా వెళ్లడం కంటే నూతనరాష్ట్రంలో ఏకాభిప్రాయ సాధన శ్రేయస్కరమైంది. బిజెపితో కొంత అవగాహనకు రావడం కనిపిస్తూనే వుంది గాని మహారాష్ట్రలో పాలక పక్షంగా వున్న వారి ఒత్తిడికి కొంత తలొగ్గారనే ఆరోపణ కూడా వినిపిస్తున్నది. ఈ ఒప్పందం స్థూలమైన ఎంవోయు మాత్రమే గనక రేపు ఏ ప్రాజెక్టు చేపట్టాలన్నా మళ్లీ ఆమూలాగ్రం అంగీకారానికి రావలసి వుంటుంది. ఎత్తు తగ్గింపు వల్ల నిల్వ సామర్థ్యం తగ్గుదలపైన, రీడిజైన్ వల్ల పెరిగే వ్యయంపైనా చాలా ఆందోళనలున్నాయి. పదేళ్లకు ఇవి పూర్తవొచ్చని ప్రభుత్వ వర్గాల కథనం. అలాటప్పుడు ఇంత హడావుడి ఎందుకనేది మరో ప్రశ్న. అసలు టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టుల కాంట్రాక్టులను త్వరితంగా మొదలుపెట్టాలని చూస్తున్నదని ప్రతిపక్షాల, వ్యాపార వర్గాల ఆరోపణ. సందేహాలు తొలగించి సహకారం తీసుకోవలసింది సర్కారు వారే!