హలో సినిమా కూడా నిరుత్సాహపరచడంతో అఖిల్ కన్ఫ్యూజ్లో పడిపోయాడు. ఈసారి ఎలాంటి కథతో వెళ్లాలి, ఏ దర్శకుడని నమ్మాలి అనేది ఎటూ తేల్చుకోలేకపోతున్నాడు. అయితే అఖిల్ దగ్గర ఆప్షన్లకు కొదవ లేదు. కొరటాల శివతో ఇప్పటికీ టచ్‌లో ఉన్నాడు అఖిల్. పూరి జగన్నాథ్ కూడా అఖిల్ తో పనిచేయడానికి ఉత్సాహం చూపిస్తున్నట్టు తెలుస్తోంది. ఈమధ్య నాగార్జున సుకుమార్ ని పిలిపించి, అఖిల్‌తో సినిమా చేయమని అడిగినట్టు సమాచారం. రాంగోపాల్ వర్మ శిష్యుడొకడు… అఖిల్‌కి కథ చెప్పాడట. ఇలా… అఖిల్ దగ్గర బోలెడన్ని దారులున్నాయి. కాకపోతే ఏవైపు వెళ్లాలో తనకే అర్థం కావడం లేదు. కనీసం ఒకట్రెండు నెలల పాటు ఎలాంటి కథలూ వినకుండా రిలాక్స్ అవ్వాలన్నది అఖిల్ ఆలోచన. ఈ ఒత్తిడిలో మరోసారి తప్పులో కాలేస్తే…. పరిస్థితులు మరింత దారుణంగా తయారవుతాయని అఖిల్ భయపడుతున్నాడు. ఈసారి కూడా సొంత బ్యానర్లో చేయాలా, లేదంటే… బయటి నిర్మాతలతో పనిచేయాలా అనేది కూడా అఖిల్ ముందున్న ప్రశ్న. ముందు అఖిల్ `హలో` జ్ఞాపకాల నుంచి బయటపడాలి. దానికి కొంత సమయం పడుతుంది మరి.