నిన్నా మొన్నటి వరకూ రాజ్ తరుణ్ కెరీర్ ఆగమ్య గోచరంగా ఉండేది. చేతిలో సినిమా లేక, ఉన్నా వాటికి క్రేజ్ లేక, సినిమా తయారైనా విడుదల చేయలేక ఇలా నానా ఇబ్బంది పడ్డాడు. అయితే… అనూహ్యంగా రాజ్ తరుణ్ పుంజుకొన్నాడు. వరుసగా 5 ప్రాజెక్టులు సెట్ చేసుకొన్నాడు. అందులో ఒకటి విడుదలకు సిద్ధమైంది. మరో రెండు సెట్స్‌పై ఉన్నాయి. మరో రెండు స్క్రిప్టు దశలో ఉన్నాయి. ఇందులో ఒక్క హిట్ పడినా, మరో రెండేళ్లు రాజ్ తరుణ్ వెనక్కి చూసుకొనే పని లేదు. అయితే.. ఇంతలోనే ఏ దిష్టి తగిలిందో – కేసులు, గొడవల్లో పడ్డాడు. లావణ్య అనే అమ్మాయి రాజ్ తరుణ్‌పై మోపిన అభియోగాలు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచాయి. రాజ్ తరుణ్ తనని పెళ్లి చేసుకొని మోసం చేశాడని, మరో హీరోయిన్‌తో ఎఫైర్ పెట్టుకొని తనని నిర్లక్ష్యం చేశాడని తనకు న్యాయం చేయాలని లావణ్య పోలీస్‌స్టేషన్ మెట్లు ఎక్కిన సంగతి తెలిసిందే. రాజ్ తరుణ్ కూడా తనని డిఫైన్ చేసుకొనే పనిలో పడ్డాడు. ఈ విషయంలో తన తప్పేమీ లేదని, లావణ్యని భరించలేకే దూరంగా ఉంటున్నానని మీడియా సముఖంగా చెప్పాడు.
ఇది పోలీసులు, కోర్టుల గొడవ. ఇలాంటి సున్నితమైన విషయాల్లో వీళ్లది తప్పు, వీళ్లది ఒప్పూ అంటూ సులభంగా స్టేట్మెంట్లు పాస్ చేయలేం. అది నిర్ణయించే బాధ్యత కోర్టులదే. కాకపోతే, ఇలాంటి వ్యవహారాల వల్ల కెరీర్లు నాశనం అయిపోతాయి. రాజ్ తరుణ్‌కి అలాంటి భయం పట్టుకొంది. ఇప్పటికే రాజ్ తరుణ్ కు అడ్వాన్సులు ఇచ్చిన ఇద్దరు నిర్మాతలు తమ ప్రాజెక్టులు పూర్తిగా పక్కన పెట్టాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. రాజ్ తరుణ్ చేతిలో ఉన్న ‘తిరగబడరా స్వామి’, ‘భలే ఉన్నాడే’ లాంటి చిత్రాలు విడుదలైనా, ఇప్పుడు ఉన్న నెగిటీవ్ వైబ్స్ ప్రభావం వాటిపైనా పడే ప్రమాదం ఉంది. ఇక ముందు రాజ్ తరుణ్‌తో సినిమా అంటే..’ఎందుకొచ్చిన రిస్క్’ అంటూ నిర్మాతలు ధైర్యం చేయకపోవొచ్చు. ఇప్పుడిప్పుడే మళ్లీ తన కెరీర్ గాడిలో పడుతున్న ఆనందంలో ఉన్న రాజ్ తరుణ్‌కు ఇది వీడని తలనొప్పే. యువ హీరోలు, ముఖ్యంగా ప్రేమ మోజులో ఉన్నవాళ్లు.. రాజ్ తరుణ్‌ని చూసైనా కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే.. సెలబ్రెటీల జీవితాలు గాజు మేడల్లో జీవితాలు. ఎప్పుడూ ఎవరో ఒకరు, ఏదో ఓ నెపంతో రాయి విసరడానికి ఎదురు చూస్తుంటారు. ఆ అవకాశం వాళ్లే ఇవ్వకూడదు. ఇస్తే.. ఇదిగో.. రాజ్ తరుణ్ వ్యవహారం లానే ఉంటుంది.