Love Me Movie Telugu Review
తెలుగు360 రేటింగ్ 1.5/5
-అన్వర్
హారర్ సినిమాకు ఎందుకు వెళ్తాం?
తనివితీరా భయపడడానికి!
ఆన్సర్ చాలా సింపుల్. కానీ సినిమావాళ్లే దీన్ని మరీ కాంప్లికేటెడ్ చేసేసుకొంటుంటారు. హారర్‌లో కామెడీ మిక్స్ చేసి కొంత, అందులో గ్రాఫిక్సు కలగలిపి ఇంకొంత, థ్రిల్లర్, సస్పెన్స్, ట్విస్టులూ జత కలిపి మరింత ఈ జోనర్‌కి కలగాపులగం చేసి పడేశారు. దాంతో హారర్ సినిమా అంటే – ఆడియన్స్ ముందే రిలాక్సపోయి, థియేటర్లో కూర్చుని, భయపడడం మానేసి, తీరిగ్గా పాప్ కార్న్ డబ్బా పై ఫోకస్ చేస్తున్నారు. ఈమధ్య అలాంటి కథలే వచ్చాయి. ఇప్పుడు వస్తున్నాయి. ఈరోజు ఒకటి.. అలానే వచ్చింది. ‘లవ్ మి’ పేరుతో.
కటౌట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డ్యూడ్ అంటాడు ప్రభాస్. సినిమా పోస్టర్‌కీ ఆ క్యాలిబర్ ఉంది.
దిల్ రాజు – పి.సి.శ్రీరామ్ – కీరవాణి…
ఇలాంటి హేమాహేమీల పేర్లు కనిపిస్తే, వీళ్లంతా కలిసి తొలిసారి హారర్ సినిమా తీస్తే… హారర్ సినిమాల ట్రాక్ రికార్డ్ ఎంతలా ‘భయపెడుతున్నా’.. ఈసారి ‘నిఝంగా భయపెడతారేమో’ అనే ఆశతో, నమ్మకంతో భయపెడుతూనే థియేటర్లలోకి అడుగు పెడతాం. ‘లవ్ మి’ విషయంలోనూ అదే జరిగింది. ‘ఆర్య’ సినిమా కథ విన్నప్పుడు నేనెంత ఎగ్జయిట్ అయ్యానో, ‘లవ్ మి’ స్టోరీ చెప్పినప్పుడు కూడా అలానే ఉబ్బితబ్బుబ్బి అయ్యాను అని స్వయంగా దిల్ రాజునే చెప్పిన పదిప ‘ఈసారి రెండొందలు పోతేపోయాయ్..’ అని ధైర్యం చేసి థియేటర్లలోకి అడుగు పెడతాం. అడుగుపెట్టాక అదే వ్యధ.. అదే సొద!
కథ చెప్పుకోవడం రివ్యూ ధర్మం కాబట్టి, ఒక్కసారి అదేంటో క్లుప్తంగా ప్రస్తావించక తప్పడం లేదు.
రామచంద్రపురం అనే ఊరు. అక్కడ ఓ భయంకరమైన ఇల్లు. ఆ ఇంట్లోంచి ప్రతీరోజూ రాత్రి సరిగ్గా ఎనిమిది గంటలకు అలారం మోగుతుంది (సీరియల్ టైమింగ్ అనుకొంటా). తొమ్మిదింటి వరకూ ఓ ఆడ ఏడుపు దిక్కులు పిక్కటిల్లేలా వినిపిస్తుంటుంది. ఆవిడే.. ఊరంతా చూస్తుండగా సజీవ దహనం అయిపోతుంది. కట్ చేస్తే కొన్నాళ్లకు మరో చోట… ఓ పాడుపడ్డ భవంతి. అక్కడ దివ్య వతి అనే ఓ దెయ్యం సంచరిస్తుంటుంది. తనని ఎవరైనా ఒక్కసారే చూస్తారు. రెండోసారి ఛస్తారు అనేది ఆ ఊరి జనాల నమ్మకం. అసలు దెయ్యాలంటే నమ్మకం లేని అర్జున్ (ఆశిష్) ఆ ఇంట్లో దెయ్యం ఉందో, లేదో కనుక్కొంటా, ఉంటే.. తనని తనివితీరా ప్రేమిస్తా అని శపథం బూని వెళ్తాడు. మరి అర్జున్‌కి దివ్యవతి కనిపించిందా లేదా? ఆ ప్రయాణంలో ఆ ఇంటి గురించీ, దివ్యవతి గురించి తనకు తెలిసిన నిజాలేంటి? ఇంతకీ దివ్యవతి దెయ్యమేనా? ఇదీ.. స్టోరీ.
ఇది హారర్ సినిమా అంటూ… ముందే ప్రకటించేసి దర్శక నిర్మాతలు పెద్ద తప్పు చేశారు. ఎందుకంటే ఈ సినిమాలో ఏ కోశాన భయం అనేది కనిపించదు. కీరవాణి తన ఆర్.ఆర్తో, పి.సి.శ్రీరామ్ తన కెమెరా మ్యాజిక్కులతో ఏదో హారర్ ఎఫెక్ట్‌ని సృష్టించాలని తాపత్రయ పడినా – థియేటర్లో కూర్చున్న ప్రేక్షకుడికి ఇది హారర్ సినిమా అని ఏ షాట్ లోనూ అనిపించదు. ఇదే ఈ సినిమాలోని మ్యాజిక్కు. దెయ్యంతో హీరో రొమాన్స్ చేయాలనుకొన్నప్పుడే – ఈ సినిమా సగం చచ్చిపోయింది. దెయ్యంతో ప్రేమలో పడడం, హీరో సిగ్గు పడుతూ దెయ్యాన్ని చూడడం, హీరోని చూసి దెయ్యం భయపడి పారిపోవడం, హీరోయిన్ని పిలిచినట్టు దెయ్యాన్ని డేట్‌కి పిలవడం, కాఫీ కలిపి ఇవ్వడం ఇవన్నీ చూస్తుంటే – రెగ్యులర్ లవ్ స్టోరీని హారర్ సౌండ్ ఎఫెక్ట్స్ లో చూసిన ‘అనుభూతి’ కలుగుతుంది. పైగా ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో జరిగాయా అన్నట్టు దెయ్యం నడుము, బొడ్డు చూపించారు. వెరైటీ కోసం. అవన్నీ చూస్తుంటే ‘అక్కడ ఏముందో చూడండి… దెయ్యం సినిమాలు చూడాలన్న మూడూ, ఉత్సాహం అన్నీ.. మటాష్ అయిపోయాయి కదండీ’ అంటూ ఫస్ట్రేటెడ్ టీవీ న్యూస్ రీడర్ రియాక్షన్ ఇస్తాడు ప్రేక్షకుడు.
భయంతోనే దెయ్యాన్ని ఇష్టపడ్డా అని హీరో ఓ లాజిక్ లెస్ లాజిక్ చెబుతాడు. హీరో క్యారెక్టరైజేషనే కాస్త టిపికల్ గా ఉంటుంది. హీరో చెప్పులు వేసుకోడు. ఎందుకు వేసుకోడో.. చివర్లో ఓ షాట్ లో చూపించారు. అది చూసి ముక్కుతో పాటు నోరు కూడా మూసుకొంటారు. ఆ లాజిక్ ఆ స్థాయిలో ఉంది. ఈ సినిమాలో హీరో ఏం చేస్తాడ్రా అంటే.. సమాధులు తవ్వి, పుర్రెలు బయటకు తీస్తాడు. వాటికి మేకప్ వేసే బాధ్యత ఇంకొకరు తీసుకొంటారు. ప్రియ (వైష్ణవి చైతన్య) అప్పటి వరకూ క్యారెక్టర్ ఆర్టిస్టుని లవ్ చేసి, సడన్‌గా ప్లేటు పిరాయించిన దృశ్యం చూస్తే ‘వైష్ణవి ఇంకా బేబీ మూడ్‌లోనే ఉందా’ అనిపిస్తుంది. సెకండాఫ్‌లో ఈ హారర్ (అని తీసినవాళ్లు అనుకొన్నారు) కథ కాస్త ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ వైపు నడుస్తుంది. అసలు ఆ ఇన్వెస్టిగేషన్ అంతా అయోమయంగా ఉంటుంది. ఎవరు ఎప్పుడు మిస్ అయ్యారో, ఎవరు ఎప్పుడు చచ్చారో తెలీక ప్రేక్షకుడు తలలు పట్టుకోవాల్సిన పరిస్థితి. చివరి ట్విస్ట్ కచ్చితంగా ప్రేక్షకుడు మధ్యలోనే ఉహిస్తాడు. ఆ విషయం తెలీక దాన్ని ట్విస్ట్ అనుకొని, రాసిన వాళ్లు తీసిన వాళ్లూ భుజాలు తడిమేసుకొని ఉంటారు. అలా అనుకోకపోతే.. ఇలాంటి సినిమాలు ఎలా బయటకు వస్తాయి లెండి! ఇంతా సరిపోక, చివర్లో మరో పది సినిమాని లాగ్ చేసి, అక్కడ ఇంకో ట్విస్టు ఇచ్చారు. అయితే ఆ ట్విస్ట్ వచ్చేంత వరకూ థియేటర్లో ప్రేక్షకుడు ఉండడన్నదే పెద్ద ట్విస్టు.
ఆశిష్‌కి ఇది రెండో సినిమా. తొలి సినిమా నుంచి తనేం పాఠాలు నేర్చుకోలేదని చెప్పడానికి ఈ సినిమా కచ్చితంగా ఉపయోగపడుతుంది. సినిమా అంతా సింగిల్ ఎక్స్ప్రెషన్ తో నడిపించేశాడు. వైష్ణవిని తొలి సన్నివేశాల్లో చూస్తున్నప్పుడు ‘బేబీ’ తరవాత ఈ సినిమా ఎందుకు ఒప్పుకొంది అనిపిస్తుంది. కానీ సెకండాఫ్‌కి వచ్చేసరికి ‘బేబీ’ పాత్రనే కంటిన్యూ చేస్తోందిలే.. అనే నిజం తెలుస్తుంది. నటిగా తనకు ఏరకంగానూ ఛాలెంజ్ ఇవ్వలేని పాత్ర ఇది. సంయుక్త ఒకే ఒక్క షాట్ లో కనిపించింది. ఆమె సంయుక్తనా, లేదంటే ఏఐలో ఆమెని చూపించారా అనే డౌటు వెంటాడుతుంటుంది. ఆ షాట్ అయిపోయిన తరవాత.
ఎం.ఎం.కీరవాణి నేపధ్య సంగీతం కొంచెం కొత్తగానే ఉంది. పాటలు బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌లో కలిసిపోయాయి. ఈ షాట్ తీస్తే పి.సి.శ్రీరామ్ నే తీయాల్రా అనిపించుకొనేలా ఆయన వర్క్ ఏమీ ఈ సినిమాలో కనిపించలేదు. ఇలాంటి కథని చెప్పి నిర్మాతల్నీ, హీరోని ఒప్పించిన దర్శకుడు.. చెప్పిన కథని అర్థమయ్యేలా తీయడంలో మాత్రం పూర్తిగా తడబడిపోయాడు.
చివరాఖరికి హారర్ సినిమాగా మొదలై, లవ్ స్టోరీగా మారి, మర్డర్ మిస్టరీలా టర్న్ తీసుకొని.. ఎండ్ కార్డ్ పడేసరికి ఎటూకాకుండా మిగిలిపోయిన కామెడీ సినిమాగా ‘లవ్‌మి’ మిగిలిపోతుంది. ఇంత తీసినా దర్శకుడికి ప్రేక్షకులపై కనికరం లేకుండా పోయింది. రెండో పార్ట్ ఉంది. ‘ధైర్యముంటే మళ్లీ రండి..’ అంటూ ఎండ్ కార్డ్ వేశారు.
ఫినిషింగ్ టచ్: వాచ్ మి – ఇఫ్ యు డేర్
తెలుగు360 రేటింగ్ 1.5/5
-అన్వర్