Love Mouli Movie Telugu Review
తెలుగు360 రేటింగ్ 2.25/5
-అన్వర్
నవదీప్ హీరోగా ఓ సినిమా… అనగానే ఎవరూ పెద్దగా ఆసక్తి చూపించకపోవొచ్చు. ఎందుకంటే నవదీప్ హీరోగా హిట్ కొట్టి చాలా ఏళ్లయ్యింది. తను క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారిపోయాడు. అలాంటి నవదీప్ హీరోగా మళ్లీ నిలదొక్కుకోవడంపై ఎవరికీ నమ్మకాల్లేవు. కాకపోతే ‘లవ్ మౌళి’ టైటిల్, పోస్టర్, టీజర్, ట్రైలర్… అన్నీ ఆకట్టుకొన్నాయి. ముఖ్యంగా ‘నవదీప్ 2.ఓ’ అంటూ తనలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేశాడు. లుక్ పరంగా క్రేజీగా అనిపించింది. ‘నవదీప్ ఈసారి కొత్తగా ఏదో ట్రై చేస్తున్నాడ’న్న నమ్మకం కలిగింది. మరి ఆ నమ్మకాలు నిజమయ్యాయా? ‘2.ఓ’ అనుకొనేంత స్టఫ్ నవదీప్‌లో ఉందా..?
మౌళి (నవదీప్) ఓ అనాథ. చిన్నప్పటి నుంచీ బయటి ప్రపంచానికి దూరంగా బతుకుతాడు. ఒంటరి జీవితానికి స్వాంతన పెయింటింగ్. ఈ దేశంలోని అత్యన్నత ఆర్టిస్టుల్లో తను ఒకడు. కాకపోతే… తన జీవితం తనదే. లైఫ్ పై తనకంటూ ఓ ఫిలాసఫీ ఉంది. ప్రేమపై అస్సలు నమ్మకం లేదు. అసలు ఈ సృష్టిలో నిజమైన ప్రేమ ఉందా? అని ప్రశ్నిస్తుంటాడు. అలాంటి మోళికి ఓ అఘోరా (రానా) ప్రేమ గురించి ఓ ఉపదేశం ఇస్తాడు. అంతేకాదు… ఓ బ్రష్ కూడా బహుమతిగా అందిస్తాడు. ఆ బ్రష్ వల్ల… మౌళి జీవితం అనూహ్యంగా మారిపోతుంది. తనకు ఎలాంటి అమ్మాయి కావాలనుకొంటున్నాడో అలాంటి అమ్మాయే చిత్ర ( ఫంఖూరి గిద్వానీ) వస్తుంది. మరి ఆ చిత్ర రాకతో అయినా మౌళికి ప్రేమపై నమ్మకం కలిగిందా? అసలు చిత్ర ఎవరు? అఘోరా ఇచ్చిన బ్రష్కీ ఈ చిత్రకీ ఉన్న సంబంధం ఏమిటి? ఇవన్నీ తెరపై చూసి తెలుసుకోవాల్సిన విషయాలు.
రొటీన్ ప్రేమకథ(ల)కు ఫాంటసీ జోడించిన సినిమా ఇది. ప్రేమపై నమ్మకం లేని మౌళి – ఈ ఫాంటసీ ప్రపంచంలోకి ఎలా వెళ్లాడు? అనేదే ఈ కథలో ఆసక్తిని రేకెత్తించిన అంశం. మౌళిగా నవదీప్ గెటప్ వల్ల, ఆ లొకేషన్ల వల్ల – కథలోకి త్వరగానే వెళ్లిపోతారు ప్రేక్షకులు. అఘోరా రాకతో మరింత ఆసక్తి కలుగుతుంది. ఫాంటసీ ప్రపంచం నుంచి చిత్ర రంగ ప్రవేశం చేయడం షాక్ ఇచ్చే అంశం. అక్కడి నుంచి కథ మరింత రసవత్తరంగా సాగాలి. కాకపోతే ఆ నవ్యత కేవలం పాయింట్ దగ్గరే ఆగిపోయింది. చిత్ర వచ్చిన తరవాత.. ప్రేమకథ రొటీన్ గానే సాగింది. ప్రతీ ప్రేమ కథలో వచ్చే రెగ్యులర్ కాన్‌ఫ్లిక్టే ఈ కథలోనూ కనిపిస్తుంది. తన ఇష్టాయిష్టాల్నీ, మనసునీ అర్థం చేసుకొనే అమ్మాయి కోసం మౌళి పరితపించడం, అలాంటి అమ్మాయే మౌళి జీవితంలోకి రావడం, అయినా సరే ప్రేమ విషయంలో మౌళి సంతృప్తికరంగా లేకపోవడం.. ఇలా చివరి వరకూ కథ సాగుతుంటుంది. చివరికి మౌళి ఏం తెలుసుకొన్నాడు? నిజమైన ప్రేమ ఎలా సాధించుకొన్నాడు? అనే విషయాలు ప్రేక్షకుల ఊహకు ముందే అందేస్తుంటాయి. తొలి ప్రేమకథ కాస్త ఆసక్తిగా ఉన్నప్పటికీ, రెండో ప్రేమకథ ఇరిటేషన్ తెప్పిస్తుంటుంది. మౌళిని చిత్ర ఎన్ని చిత్రహింసలకు గురి చేసిందో, సరిగ్గా అంతే హింస ప్రేక్షకుడూ అనుభవిస్తాడు. చివరి ప్రేమకథ త్వరగా ముగిసిపోవడం కాస్త ఉపశమనం కలిగిస్తుంది. ఈ మూడు కథల ద్వారా దర్శకుడు చెప్పిందేమిటంటే – ప్రేమంటే స్వేచ్ఛ గా ఉండడం అని. అయితే ఈ పాయింట్ చెప్పడానికి ఇంత సుదీర్ఘమైన ప్రయాణం అవసరమా? అనే ఫీలింగ్ ప్రేక్షకులకు కలుగుతుంది.
తొలి సన్నివేశాలు చూస్తున్నప్పుడు మౌళి పాత్ర నుంచి ఏదో ఫిలాసఫీ చెప్పే ప్రయత్నం చేస్తున్నాడనిపిస్తుంది. కానీ వెంటనే అఘోరా రాకతో ఫాంటసీ టర్న్ తీసుకొంటుంది. ఆ తరవాత ప్రేమకథలా మారుతుంది. ఓ కొత్త పాయింట్ పట్టుకొన్న దర్శకుడు దాన్ని రొటీన్ దారిలో నడిపించడమే పెద్ద పొరపాటు. ఈ సినిమాలో బోలెడు ముద్దులున్నాయి. బోల్డ్ సీన్లూ కనిపిస్తాయి. అయితే.. అవేం పెద్ద ఇంపాక్ట్ అనిపించవు. అలాగని రోత పుట్టించవు.
చిరపుంజి, మేఘాలయా ప్రాంతాల్లో షూటింగ్ చేశారు. ఆ లొకేషన్లు అబ్బుర పరుస్తాయి. ఓ చిన్న సినిమా కోసం ఇన్ని అందమైన లొకేషన్లు వెదికి పట్టుకొన్నారంటే గ్రేటే. ఆర్ట్ వర్క్ కూడా నచ్చుతుంది. కెమెరా పనితనం, నేపథ్య సంగీతం బాగున్నాయి. కరోనా సమయంలో, లాక్ డౌన్ వేళ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఆ ప్రయత్నాన్ని అభినందించాలి. ‘నవదీప్ 2.ఓ’ అనుకొనేలానే ఈ పాత్రని డిజైన్ చేశాడు దర్శకుడు. నవదీప్ లుక్, మేకొవర్ ఆశ్చర్యపరుస్తాయి. కథానాయిక పాత్ర ఈ కథలో చాలా కీలకం. మూడు విభిన్న పార్శ్వాల్ని ఆ పాత్ర ద్వారా చూపించే అవకాశం దక్కింది. గిద్వానీ తన నటనతో ఓకే అనిపించింది కానీ, ఇంకాస్త పాపులర్ నటిని తీసుకొంటే ఆ పాత్ర మరింత రిజిస్టర్ అయ్యేది. రానా అఘెరాగా కనిపించి షాక్ ఇచ్చాడు. అంత చిన్న పాత్రలో రానా కనిపించడం షాకే. అయితే… రానాని గుర్తు పట్టేలోగానే ఆ పాత్ర మాయమైపోతుంది.
నవదీప్ వచ్చిన కొత్తలో ప్రేమకథలు ఒకలా ఉండేవి. ఇప్పుడు లవ్ స్టోరీలు మరోలా మారిపోయాయి. ఈ జనరేషన్‌కు తగిన ప్రేమకథ చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనతో ‘లవ్ మౌళి’ చేశాడు నవదీప్. ఆ ప్రయత్నం బాగున్నా, ఆచరణలోని లోపాల వల్ల అనుకొన్న గమ్యాన్ని సాధించలేకపోయాడు.
తెలుగు360 రేటింగ్ 2.25/5
-అన్వర్