కరోనా సెకండ్ వేవ్ ఉధృతి చాలా తీవ్రంగా ఉంది. దాంతో జనాలు థియేటర్లకు వస్తారా, రారా అనే భయాలు ఎక్కువయ్యాయి. అందుకే చాలా సినిమాలు వాయిదా బాట పడుతున్నాయి. ఈనెల 16న రావల్సిన.. `లవ్ స్టోరీ` నిరవధికంగా వాయిదా పడింది. ఇప్పుడు పాన్ ఇండియా సినిమా `తలైవి` విడుదల కూడా ఆగిపోయింది. జయలలిత జీవితం ఆధారంగా తెరకెక్కిన బయోపిక్ ఇది. కంగనారనౌత్ నటించింది. విజయ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈనెల 23న విడుదల కావాలి. పాన్ ఇండియా సబ్జెక్ట్ కాబట్టి.. అన్ని భాషల్లోనూ ఇదే డేట్ ఫిక్స్ చేశారు. అయితే ఇప్పుడు ఈ సినిమానీ వాయిదా వేసేశారు. కరోనా కారణంగా… ఈ సినిమా ఇప్పట్లో విడుదల చేయడం లేదని, కొత్త డేట్ త్వరలో ప్రకటిస్తామని నిర్మాతలు ప్రకటించారు. టక్ జగదీష్ కూడా ఈనెలలోనే విడుదల కావాల్సి ఉంది. మొన్నటి వరకూ ఆ సినిమా ప్రమోషన్లు బాగానే జరిగాయి. సడన్ గా వాటికీ బ్రేక్ పడింది. చూస్తుంటే నాని సినిమా కూడా వెనక్కి వేళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.