కరోనా నుంచి చిత్రబృందాన్ని కాపాడుకోవడం నిర్మాతల కనీస బాధ్యతగా మారింది. `సెట్ కి వెళ్లినా ఏం కాదు..` అనే ధైర్యాన్ని 24 క్రాఫ్ట్స్‌కి కల్పించడం ఈరోజుల్లో పెద్ద పనే. సెట్లో చిత్రబృందానికి కావల్సిన వసతులు అన్నీ చూసుకుంటూనే, కరోనా రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడం ఇప్పుడు పెద్ద సవాల్. ఈ పనిని సక్రమంగా నిర్వహించింది `లవ్ స్టోరీ` టీమ్. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయ్యింది. అయితే షూటింగ్ సమయంలో ఏ ఒక్కరూ కరోనా బారీన పడలేదని, అందరూ ఆరోగ్యకరంగానే ఉన్నారని చిత్రబృందం ప్రకటించింది.
కోవిడ్ నిబంధనల దృష్ట్యా కేవలం 100మందితోనే షూటింగ్ జరిపారు. సెట్లో ఉన్న అందరికీ… రోజూ పౌష్టికాహారాన్ని అందజేశార్ట. గుడ్లు, పాలు, పళ్లు, మల్టీవిటమిన్ టాబ్లెట్లూ… ఇవన్నీ క్రమం తప్పకుండా అందించామని, అవసరమైన వాళ్లకు కోవిడ్ టెస్టులు చేయించామని, దాదాపు వందమందికి ఒకొక్కరికీ 3 లక్షల ఇన్సురెన్స్ పాలసీ చేయించామని చిత్రబృందం ప్రకటించింది. ఈ రూపేణా అదనంగా 50 లక్షల వరకూ ఖర్చయ్యిందట. అందుకే చిత్రబృందంలో ఏ ఒక్కరూ కరోనా బారీన పడలేదని లవ్ స్టోరీ నిర్మాతలు తెలిపారు. నిజంగా ఇది మంచి ఆలోచనే. కరోనా సమయంలోనూ జోరుగా చిత్రీకరణలు జరుపుకుంటున్న మిగిలిన వాళ్లంతా… ఈ విషయంలో లవ్ స్టోరీ ఫార్ములాని పాటిస్తే మంచిది. ఇక మీదట బడ్జెట్లో కరోనా ఇన్సురెన్స్ పాలసీకీ చోటిస్తే.. 24 విభాగాలకూ కాస్త ధైర్యంగా ఉంటుంది.