తెలుగు360 రేటింగ్: 3/5
శేఖర్ కమ్ముల సినిమాలంటే ఓ నమ్మకం. `మంచి సినిమానే తీస్తాడ్లే` అనే భరోసా. అదో ట్రేడ్ మార్క్‌లా. తన ట్రాక్ రికార్డ్ అలాంటిది. తన సినిమాలు కొన్ని ఫ్లాప్ కావొచ్చు. కానీ.. ఓ దర్శకుడిగా తనెప్పుడూ ఫెయిల్ కాలేదు. చాలా చిన్న విషయాలే అయినా వాటిని హృదయానికి హత్తుకునేలా చెప్పగలిగే సమర్థుడు. కుటుంబం అంతా తన సినిమాలకు ఫిదా అయ్యేది అక్కడే. ఇక లవ్ స్టోరీలంటారా? వాటిని అత్యంత సహజంగా ఆవిష్కరించగలడు. మధ్యతరగతి మనస్తత్వాలు, యువతరం మనోభావాలూ – ఇవన్నీ తన కథల్లో, తన పాత్రల్లో ప్రతిబింబిస్తుంటాయి. ఈసారి కూడా ఓ `లవ్ స్టోరి`నే ఎంచుకున్నాడు. అయితే… ఈ దఫా ప్రేమొక్కటే కాదు. చాలా విషయాల్ని ఇందులో చెప్పాలనుకున్నాడు. సాయి పల్లవికి తోడు, సారంగ దరియా పాట కూడా ఉండడంతో – లవ్ స్టోరి ఎలా ఉందో చూడాలన్న ఉత్సుకత ఏర్పడింది. మరి… శేఖర్ తన మార్క్ ని చూపించాడా? లవ్ స్టోరిలో ఉన్న ఆ ఎక్స్ ట్రా ఎలిమెంట్స్ ఏమిటి?
రేవంత్ (నాగచైతన్య) `జీరో` నుంచి ఎదగాలనుకునే అబ్బాయి. చిన్నప్పటి నుంచీ వివక్షతను ఎదుర్కొనే పెరిగాడు. డాన్సంటే ఇష్టం. హైదరాబాద్ వచ్చి జుంబా కోచింగ్ సెంటర్ పెడతాడు. అలా డబ్బులు సంపాదించి ఎదగాలన్నదే ప్లాన్. అందుకోసం బ్యాంకులోను కోసం ప్రయత్నిస్తుంటాడు. అదే ఊరికి, మౌనిక (సాయి పల్లవి) వస్తుంది. తనది ఉన్నతమైన కుటుంబమే. ఊర్లో 20 ఎకరాల భూమి కూడా ఉంది. కానీ బాబాయ్ (రాజీవ్ కనకాల) అంటే భయం. ఆ భయంతోనే హైదరాబాద్ వచ్చేస్తుంది. తన కాళ్లపై తాను నిలబడాలనుకుంటుంది. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తే… ఎక్కడా దొరకదు. చివరికి రేవంత్ దగ్గరే… సహాయకురాలిగా చేరుతుంది. ఇద్దరి మధ్యా ప్రేమ చిగురిస్తుంది. అయితే ఇద్దరి మధ్య చాలా అంతరాలు ఉన్నాయి. పైగా బాబాయ్ బతకనివ్వడు. మరి ఈ అవరోధాల్ని దాటుకుని ఈ ప్రేమ జంట ఎలా గెలిచింది? అన్నదే కథ.
శేఖర్ కమ్ముల ఎప్పుడూ బలమైన కథల్ని రాసుకోడు. కానీ అందులో బలమైన ఎమోషన్లు ఉండేలా జాగ్రత్త పడతాడు. తన కథలు దాదాపుగా సింగిల్ లేయర్ లోనే సాగుతాయి. కానీ తొలిసారి… ఈ కథలో చాలా అంశాల్ని పొందుపరచాలని చూశాడు. ముఖ్యంగా బాలికలపై లైంగిక హింస, లింగ వివక్షత, కుల వివక్షత… ఇలా మూడు బలమైన పాయింట్లని చెప్పాలనుకున్నాడు. అందులోనూ ఓ ప్రేమకథలో. ఇరవై ఏళ్లొచ్చిన అమ్మాయి. ఏ అబ్బాయితో ప్రేమలో పడుతుందో అని కంగారు పడతారు గానీ, పదేళ్ల అమ్మాయి బాధని, తనని ఇబ్బంది పెడుతున్నవాళ్ల గురించీ తల్లిదండ్రులు పెద్దగా పట్టించుకోరు. వాళ్లకు తమ బాధ చెప్పుకునే అవకాశం ఇవ్వరు. ఇదే విషయాన్ని శేఖర్ ఈ కథతో చెప్పాలనుకున్నాడు. క్లైమాక్స్ లో తాను ఎత్తిన పాయింట్ కూడా అదే. దానికి తోడు కుల వివక్షత కూడా బలమైన అంశం.
హైదరాబాద్ లో ఏదో సాధించాలని ఆరాట పడే అబ్బాయి, ఉద్యోగంలో చేరి తనని తాను నిరూపించుకోవాలనుకున్న అమ్మాయి, వాళ్ల పరిచయాలు, గొడవలు, కలలు, కష్టాలు… ఇవన్నీ తొలి సన్నివేశాల్లో ఇమిడ్చి.. ఈ కథకు సాఫీ గా ఓ దారి వేశాడు శేఖర్ కమ్ముల. తొలి సగంలో చాలా చోట్ల శేఖర్ మార్క్ కనిపిస్తుంది. ముఖ్యంగా.. రేవంత్ కోపంగా ఉన్నప్పుడు… మౌనిక ముద్దు పెట్టి వెళ్లిపోయిన సీన్. మెట్రోలో… మరో ముద్దు. ఈ రెండు చోట్ల రేవంత్ లోని భావోద్వేగాలన్ని చాలా బాగా ఆవిష్కరించాడు. నిజానికి ఓ అమ్మాయి ముద్దు పెడితే అబ్బాయి ఎందుకు ఏడుస్తాడు? `ముద్దు పెడితే ఎవరైనా ఏడుస్తారా` అని మౌనిక పాత్రతోనూ చెప్పించాడు. నిజానికి అది ముద్దు కాదు. కుల వివక్షతను దాటుకుని వచ్చిన తొలి పలకరింపు. అందుకే ఆయా సన్నివేశాలు అంత బాగా పండాయి. కదిలించాయి.
ద్వితీయార్థంలో దర్శకుడు చెప్పాలనుకున్న పాయింట్లు ఎక్కువైపోయాయి. కుల వివక్షతకి సంబంధించిన సన్నివేశాల్ని దర్శకుడు బాగానే రాసుకున్నాడు. కాకపోతే… ఇన్ని పాయింట్లు ఒకే కథలో చెప్పాలనుకోవడం మాత్రం కథని కాస్త కంగాళీ చేసింది. ప్రతీ పాయింటుతోనూ ఓ కథ నడిపించేంత విషయం ఉంది. అవన్నీ ఒకే సినిమాలో ఇరికించడం వల్ల, దేనిపైన ఎక్కువ ఫోకస్ పెట్టాలన్న విషయాన్ని దర్శకుడిగా శేఖర్ కమ్ముల తేల్చుకోలేకపోయాడు. పతాక సన్నివేశాలు సైతం కాస్త అసంపూర్ణంగా అనిపిస్తాయి.
నాగచైతన్య లోని నటుడు పూర్తి స్థాయిలో ఓపెన్ అవ్వడానికి రేవంత్ పాత్ర ఉపయోగపడుతుంది. తను ఇలాంటి కథల్ని, ఇలాంటి ఎమోషన్లనీ బాగా హ్యాండిల్ చేయగలడు. శేఖర్ స్కూల్లో చేరాడు కాబట్టి, ఇంకాస్త ఎక్కువగా రాణించాడు.స్మశానం సీన్ లో.. తన ఎమోషన్ ని బాగా పలికించాడు. సాయి పల్లవి గురించి చెప్పేదేముంది? ఇప్పటికే తనకు ఫిదా అయిపోయారంతా. చైతూ ఎంట్రీ కంటే, సాయి పల్లవి ఎంట్రీకే గోల ఎక్కువ. దాన్ని బట్టే తన క్రేజ్ అర్థం చేసుకోవొచ్చు. సారంగ దిరియాలో అయితే స్టెప్పులు ఇరగదీసింది. స్పింగులేసుకున్న జింక పిల్లలా కనిపించింది. తెలంగాణ యాస ఇద్దరికీ బాగా యాప్ట్ అయ్యింది. ఆ భాష, పదాలు చాలా అథెంటిక్ గా ఉన్నాయి. ఉత్తేజ్ కి చాలా రోజుల తరవాత మంచి పాత్ర పడింది. రాజీవ్ కనకాల కనిపించప్పుడల్లా… ప్రేక్షకుల్లోనూ ఏహ్య భావం మొదలైపోతుంది. అలా ఉంది ఆ పాత్ర. ఈశ్వరీ రావు, దేవయాని ఇద్దరూ తల్లి పాత్రల్ని సమర్థవంతంగా పోషించారు.
సంగీతం, ఛాయాగ్రహణం.. ఈ రెండు విషయాల్లోనూ శేఖర్ కమ్ముల రాజీ పడడు. అవే ఈ సినిమాకి మూల స్థంభాలు. సారంగ దరియా బీజియమ్ ఎప్పుడొచ్చినా – ప్రేక్షకుల్లో జోష్ కనిపించేది. ఆ పాట ఇచ్చిన మహత్తు అలాంటిది. దర్శకుడిగా శేఖర్ కొన్ని ఎమోషన్లని చక్కగా చూపించాడు. కాకపోతే.. లేయర్స్ ఎక్కువ. చాలా సున్నితమైన అంశాల్ని ఒకే కథలో ఇమడ్చాలని చూశాడు. అదే ఇబ్బంది పెట్టింది. కాకపోతే.. సెకండ్ వేవ్ తరవాత థియేటర్లకు రావాలన్న ఉత్సుకత ప్రేక్షకుల్లో పెద్దగా కనిపించలేదు. కుటుంబ ప్రేక్షకులు సైతం.. థియేటర్లకు దూరమయ్యారు. వాళ్లని మళ్లీ థియేటర్లవైపు అడుగులు వేయించి, చిత్రసీమకు కొత్త ఊపిరి పోసేందుకు ఈ సినిమా తన వంతు సాయం చేస్తుంది. ఈ జోష్ ఎన్ని రోజులు అనేదానిపైనే కమర్షియల్ గా ఈ సినిమా విజయం ఆధారపడి ఉంది.
తెలుగు360 రేటింగ్: 3/5