అనుకున్నదే అయ్యింది. `లవ్ స్టోరీ` వాయిదా పడింది. ఈనెల 16న విడుదల కావాల్సిన సినిమా ఇది. అయితే కరోనా కేసులు పెరుగుతున్న రోజులు కావడంతో… ఈ సినిమాని నిరవధికంగా వాయిదా వేశారు. కొత్త రిలీజ్ డేట్ అయితే ఇంకా ఏమీ అనుకోలేదు. రానున్న రోజుల్లో పరిస్థితులు చూసి, కొత్త రిలీజ్ డేట్ ప్రకటించే అవకాశం ఉంది. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన చిత్రమిది. నాగచైతన్య – సాయి పల్లవి జంటగా నటించారు. షూటింగ్ ఎప్పుడో పూర్తయింది. అయితే రకరకాల కారణాల వల్ల సినిమా రిలీజ్ డేట్ వాయిదా పడుతూ వచ్చింది. చివరికి ఏప్రిల్ 16న ఫిక్స్ చేశారు. కరోనా ఉధృతిని దృష్టిలో ఉంచుకుని, తెలంగాణ ప్రభుత్వం నిబంధనల్ని కఠినతరం చేయనున్న నేపథ్యంలో… ఈ సినిమాని వాయిదా వేయక తప్పలేదు. ఈ ఎఫెక్ట్ ఇప్పుడు మిగిలిన సినిమాలపైనా పడబోతోంది. ఈ నెలలోనే విరాటపర్వం లాంటి సినిమాలు విడుదలకు రెడీ అయ్యాయి. ఇప్పుడు అవి కూడా కొత్త డేట్లు ప్రకటించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.