శేఖర్ కమ్ముల నుంచి రాబోతున్న మరో సినిమా `లవ్ స్టోరీ`. నాగచైతన్య – సాయిపల్లవి జంటగా నటిస్తున్నారు. సారంగ దరియా పాటతో.. ఈ సినిమాకి కావల్సిన దానికంటే ఎక్కువ మైలేజీ వచ్చేసింది. ట్రైలర్ రాకపోయినా – హైప్ మాత్రం ఓ రేంజులో ఉంది. ఈనెల 16న ఈ సినిమా విడుదల కావాలి. అయితే.. ఈ సినిమాపై సందిగ్థం నెలకొంది. కొన్ని అనివార్య కారణాల వల్ల `లవ్ స్టోరీ` వాయిదా పడబోతోందన్న టాక్ వినిపిస్తోంది.
తెలుగు రాష్ట్రాలలో కరోనా కేసులు రోజు రోజుకీ పెరుగుతున్నాయి. మంగళవారం ఒక్క రోజు ఏకంగా 2 వేల కొత్త కేసులు నమోదయ్యాయి. ఈ విషయంపై తెలంగాణ హైకోర్టు సీరియస్ అయ్యింది. కేసులు ఇలా పెరుగుతూపోతుంటే, ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించింది. పాఠశాలలూ, కాలేజీలూ మూసేసినప్పుడు.. బార్లు, థియేటర్ల విషయంలో ఎందుకు ఉదాశీనంగా వ్యవహరిస్తున్నారంటూ.. సీరియస్గా ప్రశ్నించింది. దాంతో తెలంగాణ ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు పూనుకోబోతోందని సమాచారం. థియేటర్లు పూర్తిగా మూసివేయకపోయినా కనీసం 50 శాతం ఆక్యుపెన్సీ నిబంధన విధించే అవకాశం ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏప్రిల్ 15 నుంచి ఈ నిబంధన అమలులోకి రావొచ్చు. అందుకే ఆ తరవాత రాబోయే సినిమాలు అప్రమత్తం అవుతున్నాయి. అందులో భాగంగా కొన్ని సినిమాలు వాయిదా పడబోతున్నాయని టాక్. ఈ రోజు సాయింత్రంలోగా… సినిమా విడుదల తేదీ విషయంలో `లవ్ స్టోరీ` టీమ్ ఓ నిర్ణయానికి వస్తుందని తెలుస్తోంది.