ఫిబ్రవరి నెలలో విశాఖపట్నంలో లవ్ ఉత్సవ్ నిర్వహించేందుకు చంద్రబాబు సర్కారు సిద్ధమౌతున్న సంగతి తెలిసిందే. పర్యాటకరంగం అభివృద్ధిలో భాగంగానే ఈ ఉత్సావాన్ని ముంబైకి చెందిన ప్రముఖ కన్సల్టెన్సీ ఆధ్వర్యంలో నిర్వహించతలపెట్టారు. విశాఖ బీచ్‌లో లవర్స్ మారథాన్, మిస్టర్ అండ్ మిసెస్ బీచ్ పోటీలు వంటివి నిర్వహించాలనుకున్నారు. అంతేకాదు, ప్రేమికుల జంటలకు బీచ్‌లో టెంట్లు కూడా ఇవ్వబోతున్నారు. విదేశాల నుంచి ఈ ఉత్సవానికి లవర్స్ తరలి వస్తారనీ, విశాఖ బీచ్‌లో సందడి చేస్తారని అనుకున్నారు. అయితే, ఈ లవర్స్ ఉత్సవం చంద్రబాబు సర్కారు పరువు తీసేట్టుగానే ఉంది! ఇప్పటికే ఈ ఉత్సవంపై పలు ప్రజా సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమౌతోంది. భారతీయ సంస్కృతిని మట్టి కలుపుతూ జరుగుతున్న ఈ ఉత్సవాన్ని అడ్డుకుంటామని కొన్ని సంఘాలు ప్రకటనలు చేస్తున్నాయి. బీచ్ లవ్ ఫెస్టివల్ పేరుతో మన సంస్కృతికి చంద్రబాబు సర్కారు తూట్లు పొడుస్తోందనీ, కేవలం ఆర్థిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఇలాంటి ఉత్సవాలు నిర్వహిస్తే… యువతను చెడగొట్టినవారు అవుతారని పలువురు మండిపడుతున్నారు.
తెలుగుదేశం మిత్ర పక్షమైన భాజపా కూడా ఈ ఉత్సవ నిర్వహణను తప్పుబడుతోంది. విశాఖపట్నానికి ఉన్న పేరును దెబ్బతీసేలా ఈ లవ్ ఫెస్టివల్ ఉందని భాజపా ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు. ఇలాంటి ఉత్సవాల వల్ల యువత పెడతోవ పడుతుందనే విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లానని ఆయన చెప్పారు. ఇలాంటి ఫెస్టివల్స్‌కి కేవలం విదేశీ పర్యాటకులను మాత్రమే అనుమతిస్తే కొంత నయం అని కూడా సూచించినట్టు తెలిపారు. ఇక, లవ్ ఉత్సవాన్ని అడ్డుకుంటామంటూ హెచ్చరించింది ప్రగతిశీల మహిళా మండలి. వ్యాపర ప్రయోజాల కోసం మహిళల శరీరాలను ప్రదర్శనకు పెట్టడం, ఆ ప్రదర్శనకు చంద్రబాబు సర్కారు సహకరించడం దుర్మార్గం అంటూ మండిపడ్డారు మండలి రాష్ట్ర కార్యదర్శి ఎమ్. లక్ష్మీ.
గోవాలో మితిమీరిపోతున్న పాశ్చాత్య సంస్కృతిపై ఓ పక్క పోరాటం చేస్తుంటే… ఆ దుష్ట సంస్కృతిని విశాఖపట్నానికి కూడా అంటించే ప్రయత్నం చేస్తే చూస్తూ ఊరుకునేది లేదన్నారు. పర్యాటక రంగం అభివృద్ధి చేయాలంటే ఇంకోరకంగా ఆలోచించాలి, అంతేగానీ ఇలాంటి మితిమీరిన రీతిలో చంద్రబాబు సర్కారు ఆలోచించడం దారుణమని లక్ష్మీ మండిపడ్డారు. ఈ ఫెస్టివల్ నిర్వహణను వ్యతిరేకిస్తూ పలు మహిళా సంఘాలు నిరసన కార్యక్రమాలను కూడా చేపడుతున్నాయి. సామాన్య ప్రజల నుంచి దాదాపు ఇలాంటి అభిప్రాయమే వ్యక్తమౌతోందని చెప్పాలి. మొత్తానికి, ఈ ఉత్సవం చంద్రబాబు సర్కారు పరువు తీసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరి, ఈ వ్యతిరేకతల్ని చంద్రబాబు పట్టించుకుంటారా..?