హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా ఇవాళ ప్రేమికులందరూ వ్యాలంటైన్స్డే జరుపుకుంటుంటే తెలుగు రాష్ట్రాలలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. భజరంగదళ్ వంటి సంఘ్ పరివార్ సంస్థల భయంతో ప్రేమికులు భయం భయంగా ప్రేమికుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. వారికి కనబడితే ఎక్కడ పెళ్ళి చేసేస్తారోనన్న భయంతో ప్రేమికులు చాటు చాటుగా కలుసుకుంటున్నారు. పార్కులకు మాత్రం వెళ్ళటంలేదు. దీనితో పార్కులన్నీ వెలవెల పోతున్నాయి. మరోవైపు పూల వ్యాపారులు, గిఫ్ట్ షాపుల యజమానులు భజరంగ్ దళ్ కార్యకర్తలపై తిట్లు లంకించుకుంటున్నారు. వారివలన తమ వ్యాపారాలన్నీ పోతున్నాయని మండిపడుతున్నారు.
మరోవైపు భజరంగదళ్ కార్యకర్తలు మాత్రం ఈ వ్యాలంటైన్స్డే అనేది భారతీయ సంస్కృతిపై బహుళజాతి సంస్థలు జరిపే దాడిగా అభివర్ణిస్తున్నారు. యువత ఇలాంటి పాశ్యాత్య ధోరణుల వ్యామోహంలో పడి తమ కెరీర్ను పాడుచేసుకుంటున్నారని, పెడదోవ పడుతున్నారని అంటున్నారు. అమెరికా, చైనా వంటి దేశాలు తమ ఉత్పత్తులను అమ్ముకోవటంకోసం ఈ వ్యాలంటైన్స్డేకు ఇండియాలో కూడా విస్తృత ప్రాధాన్యం కల్పిస్తున్నాయని ఆరోపిస్తున్నారు. హైదరాబాద్లో కోఠి, ఆబిడ్స్, వైఎంసీఏ సర్కిల్ వంటి ప్రాంతాలలో వ్యాలంటైన్స్ డే గ్రీటింగులను, వైలంటైన్ దిష్టిబొమ్మలను తగలబెట్టారు. ఇదిలాఉంటే ఎస్ఎఫ్ఐ వంటి కొన్ని విద్యార్థి సంఘాలు భజరంగదళ్ కార్యకర్తలనుంచి తాము రక్షిస్తున్నామని, ప్రేమికులు బయటకొచ్చి ప్రేమించుకోవాలని పిలుపునివ్వటం విశేషం.