రజనీ కాంత్ సినిమా వస్తుందంటే ముందే పూనకాలు వచ్చేస్తాయి. ఆయన సినిమా గురించి కథలు కథలుగా చెప్పుకోవడం మొదలెడతారు. రజనీ సినిమా ఎన్ని రికార్డులు సృష్టించబోతోంది? దాని హవా ఏ మేరకు ఉంటుంది? అనే విషయాల పట్ల ఆసక్తి మొదలవుతుంది. ఆ కథకు సంబంధించిన విషయాలో, అందులో రజనీ చేయబోతున్న విన్యాసాలో ఒకటో అరో బయటకు వస్తాయి. కానీ.. ‘దర్బార్’కి సంబంధించి అలాంటి హడావుడి ఏమీ కనిపించడం లేదు. 2 రోజుల్లో దర్బార్ విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే.. ఈ సినిమాపై, ముఖ్యంగా తెలుగు వెర్షన్ విషయంలో ఎలాంటి బజ్ లేదు. మురుగదాస్ – రజనీ కాంబో అంటే మామూలుగా ఉండదు. ఈ కాంబో గురించి ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. అలాంటి కాంబినేషన్ సెట్ అయినా సరే – దర్బార్ టాక్ ఆఫ్ ది ఇండ్రస్ట్రీ కాలేకపోయింది.
దర్బార్ ఆడియో ఫంక్షన్ హైదరాబాద్లో ఘనంగా జరిగినా, ఈ సినిమాపై ఎలాంటి హైపూ లేదు. రోబో 2, కాలా, కబాలీ.. ఇలా వరుసగా రజనీ సినిమాలు ఫ్లాపులు అవుతూ వచ్చాయి. తెలుగులో ఏమాత్రం వాటి ప్రభావం చూపించలేదు. పైగా ఇది సంక్రాంతి సీజన్. బన్నీ సినిమా గురించో, మహేష్ సినిమా గురించో మాట్లాడుకున్నంతగా రజనీ సినిమా గురించి తెలుగువాళ్లు ఎందుకు మాట్లాడుకుంటారు? వాళ్లందరి దృష్టీ ఆ రెండు సినిమాలపైనే ఉంది. రజనీ సోలోగా వస్తే తప్పకుండా బజ్ ఉండేది. ఇప్పుడు గుంపులో వస్తున్నాడు కాబట్టి అదేం లేకుండా పోయింది. ఈ సినిమా సోసోగా ఉందంటే.. పట్టించుకునేవాడే ఉండడు.