‘జాక్’ డిజాస్టర్‌గా తేలిపోయింది. ఈ రెండు రోజుల వసూళ్లు పరిస్థితికి అద్దం పడుతున్నాయి. కనీస ఓపెనింగ్స్ లేకపోవడం ట్రేడ్ వర్గాల్ని సైతం విస్మయపరుస్తోంది. దర్శకుడిగా బొమ్మరిల్లు భాస్కర్‌కి ఇటీవల విజయాలు లేకపోవొచ్చు. కానీ ఆయనకంటూ ఓ మార్క్ వుంది. టిల్లు, టిల్లు స్క్వేర్తో వరుసగా రెండు హిట్లు కొట్టి యూత్ ని ఆకట్టుకొన్నాడు సిద్దు జొన్నలగడ్డ. కనీసం సిద్దు కోసమైనా జనాలు థియేటర్లకు రావాలి. అదీ జరగలేదు. వచ్చిన వాళ్లు ‘ఇదేం సినిమారా బాబూ’ అని పెదవి విరుస్తున్నారు.
ఓ సినిమా ఫ్లాప్ అయ్యిందంటే అందరి వేళ్లూ దర్శకుడినే చూపిస్తాయి. కానీ ఇక్కడి పరిస్థితి వేరు. సిద్దు అన్ని విషయాల్లోనూ జోక్యం చేసుకొన్నాడన్నది ఇన్ సైడ్ వర్గాల వాదన. రెండు, మూడు రోజుల షూట్ దర్శకుడు లేకుండానే జరిగిపోయిందని కూడా ఓ వార్త బయటకు వచ్చింది. దర్శకుడు భాస్కర్ కూడా ఈ కామెంట్లకు బలం చేకూర్చేలా మాట్లాడాడు. ‘సిద్దు చాలా టాలెంటెడ్. తనకు అన్ని విషయాలూ తెలుసు. అలాంటప్పుడు ఇన్ పుట్స్ ఇవ్వడంలో తప్పులేదు’ అని ఇన్‌డైరెక్ట్ గానే ఇన్వాల్వ్మెంట్ ని ఒప్పుకొన్నాడు. సిద్దూ కూడా అదే మాట అన్నాడు. ‘ఇది నా సినిమా, నేను జోక్యం చేసుకొంటే తప్పేంటి’ అని నిలదీశాడు. సినిమా హిట్టయితే క్రెడిట్ ఇద్దరికీ వెళ్లేదే. ఫ్లాప్ కాబట్టి, ఇప్పుడు ఇద్దరూ పంచుకోవాల్సివస్తుంది. కాకపోతే.. ఈ క్రెడిట్ లో ఇంకొంచెం ఎక్కువ శాతం సిద్దుకి వెళ్తుంది. ఏ హీరో అయినా దర్శకుడికి తన పని తాను చేసేంత స్వేచ్ఛ ఇవ్వాలి. ఓవర్ ఇన్వాల్వ్మెంట్ ఇన్పుట్ పై ఇంపాక్ట్ చూపిస్తుంది. ‘జాక్’ విషయంలో ఇదే జరిగింది. భాస్కర్ కథని, క్యాపబులిటీని నమ్మి సిద్దు వదిలేయాల్సింది. అప్పుడు ఫలితం అటూ ఇటూ అయితే సిద్దు ఇమేజ్‌ని క్యాష్ చేసుకోలేకపోయాడు అంటూ భాస్కర్ని నిందించేవారు. ఇప్పుడు సిద్దు ఇన్వాల్వ్మెంట్ వల్ల భాస్కర్ని ఎవరూ ఏం అనడం లేదు. కర్త,కర్మ,క్రియ అంతా సిద్దూనే అని తేల్చేస్తున్నారు.