గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పోలింగ్ శాతం 40 శాతం కంటే తక్కువగానే నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది. సాయంత్రం ఆరు గంటలకు పోలింగ్ సమయం ముగిస సమయానికి 30 శాతానికి కొద్దిగా ఎక్కువగానే పోలింగ్ జరిగినట్లుగా అధికారులు చెబుతున్నారు. ఆరు గంటల వరకు లైన్లలో ఉండే వారికి ఓటు వేసేందుకు పర్మిషన్ ఇస్తారు. మొత్తంగా బ్యాలెట్ లు వాడటం వల్ల.. పోలింగ్ పర్సంటేజీ పక్కాగా తెలియడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. నిజానికి పోలింగ్ సందర్భంగా గ్రేటర్లో అసలు ఎన్నికల వాతావరణమే కనిపించలేదు. ఎవరి పనుల్లో వారు మునిగిపోయారు. రాజకీయ పార్టీలు కూడా.. ప్రచారంలో చూపించినంత దూకుడు.. ఓటింగ్ కోసం చూపించలేక పోయారు. దిగువ మధ్యతరగతి వర్గం ఎక్కువగా నివాసం ఉండే కాలనీల వారిని వివిధ రాజకీయ పార్టీలు ఎలాగోలా పోలింగ్ బూత్‌ల వరకూ తరలించినా.. మధ్యతరగతి ప్రజలు.. ఉన్నత వర్గాల ప్రజలు అసలు ఓటింగ్ వైపు చూడలేదు.
వారిని పోలింగ్ బూత్‌ల వైపు రప్పించడానికి చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. అదే సమయంలో.. నగరంలో ఓటర్లుగా నమోదైన వాళ్లు చాలా మంది స్వస్థలాలకు కుటుంబాలతో సహా వెళ్లిపోయారు. వరుసగా సెలవులు రావడమే కాదు… సాఫ్ట్ వేర్ సంస్థల వర్క్ ఫ్రం హోం కొనసాగుతూండటంతో వారెవరూ.. సిటీలో లేరు. ఈ కారణంగా కూడా పోలింగ్ శాతం తగ్గింది. ప్రతీ సారి పెద్ద పెద్ద లైన్లు కనిపించే.. అమీర్ పేట లాంటి ప్రాంతాల్లోనూ.. ఓటర్లు పెద్దగా పోలింగ్ బూత్‌ల వైపు రాలేదు. ఎంఐఎంకు పట్టున్న పాతబస్తీలోనూ.. అదే పరిస్థితి. రాజకీయ పార్టీలన్నీ తమ ఓటర్లను తొమ్మిది.. పది లోపు తీసుకొచ్చి ఓట్లు వేయించుకున్నాయి. తర్వాత అంతా ఖాళీనే. చాలా చోట్ల పోలింగ్ సిబ్బంది నిద్రపోతూ కనిపించారు. 2016 గ్రేటర్ ఎన్నికల్లో 45 శాతానికిపైగా పోలింగ్ జరిగింది. ఈ సారి 30, 40 మధ్యనే పోలింగ్ శాతం^ఉండనుంది.
సాధారణగా అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో జోరుగా ఓటింగ్ సాగితే.. దాదాపుగా యాభై శాతం నమోదవుతుంది. అంత నమోదయితేనే… బాగా పోలింగ్ జరిగినట్లు. మొత్తానికి ఎన్నికలైతే ప్రశాంతంగా ముగిశాయి. కల్లోలాలు ఉద్రిక్తతలు లాంటివేమీ చోటు చేసుకోలేదు. కానీ.. ఓల్డ్ మలక్‌పేటలో కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థి గుర్తు తారుమారవడంతో పోలింగ్ నిలిపివేశారు. బ్యాలెట్ పేపర్లు మళ్లీ ముద్రించి… గురువారం పోలింగ్ నిర్వహిస్తారు. ఈ కారణంగా.. ఎగ్జిట్ పోల్స్ ప్రకటన కూడా వాయిదా పడింది. గురువారం సాయంత్రం ఆరు గంటల తర్వాతే ఎగ్జిట్ పోల్స్‌కు అనుమతి ఉంటుంది. శుక్రవారం.. కౌంటింగ్ జరుగుతుంది.