తెలంగాణ ప్రభుత్వం అనధికార లే అవుట్లను క్రమబద్దీకరించేందుకు చేస్తున్న ప్రయత్నాలు వికటిస్తున్నాయి. ప్రక్రియ అత్యంత క్లిష్టంగా ఉండటంతో 90 శాతం మంది కనీసం ఫీజు చెల్లించలేకపోతున్నారు. చెరువుల ఎఫ్టీఎల్కు 200 మీటర్ల పరిధిలోని, ప్రభుత్వ భూములకు ఆనుకుని ఉన్న సర్వే నంబర్లు మినహా మిగతా సర్వే నంబర్లలోని ఎల్ఆర్ఎస్ దరఖాస్తులకు ఆటోమేటెడ్‌గా ఫీజు ఖరారు చేస్తామని ప్రకటించారు. కానీ అలాంటి అవకాశం అందుబాటులోకి రాలేదు.
దరఖాస్తు ఎల్1 అధికారి వద్ద పెండింగ్‌లో ఉన్నట్లు అత్యధిక మందికి చూపిస్తోంది. ఈ సమస్యపై ఎవరిని సంప్రదించాలో తెలియక అయోమయానికి గురవుతున్నారు. ఎల్ఆర్ఎస్ ద్వారా ప్లాట్‌ను సక్రమంగా మార్చుకోవాలంటే లెవల్-1లో అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు చేయాలి. అంతా కరెక్ట్ గా ఉందని నిర్ధారించాలి. ఇది అంత సామాన్యంగా అయ్యే పని కాదు. రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల నుంచి ఎన్వోసీ వచ్చిన తర్వాత హెచ్ఎండీఏలో పీవో లేదా సీపీవో అనంతరం డైరెక్టర్ పరిశీలించి ప్రొసీడింగ్స్ చేస్తారు. ఆ తర్వాత ఆన్లైన్ లేదా నేరుగా రిజిస్ట్రేషన్ కార్యాలయం వద్ద ఎల్ఆర్ఎస్ ఫీజులు చెల్లిస్తే యజమాని పేరుతో ప్లాట్‌ను రిజిస్ట్రేషన్ చేస్తారు.
ఇంత ప్రక్రియ జరగాలంటే.. ఎంత మంది అధికారుల ప్రమేయం ఉండాలో సులువుగా అర్థమైపోతుంది. దీని వల్ల చిన్నచిన్న లోపాలను చూపించి ఉద్యోగులు లంచాలు డిమాండ్ చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో దరఖాస్తుదారులకు అధికారులు చుక్కలు చూపిస్తున్నారు. దీంతో పనులు ముందుకు సాగడం లేదు. ఎల్ఆర్ఎస్ ను ప్రజలకు గుదిబండగా మార్చారన్న అసంతృప్తి పెరిగిపోతోంది. మరింత మెరగైన, సులువైన పద్దతిని.. అందుబాటులోకి తేవాలన్నా డిమాండ్లు వినిపిస్తున్నాయి.