లే ఔట్ రెగ్యులరైజేషన్ స్కీమ్స్ ముందుకు సాగడం లేదు. హైదరాబాద్లోని ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్న లే ఔట్లు చాలా ఉన్నాయి. అనుమతి లేని లేఅవుట్ల క్రమబద్దీకరణకు గత ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ పథకాన్ని తీసుకొచ్చింది. 2020లో ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు చిన్న, మద్యతరగతి ప్రజల నుంచి మొదలుకుని రియల్టర్ల వరకు పోటీ పడ్డారు. రాష్ట్రంలో అన్ని పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల నుంచి దాదాపు 25.44 లక్షల మంది అప్లికేషన్లు సమర్పించారు.
కార్పొరేషన్లలో 4.13 లక్షలు, మున్సిపాలిటీల్లో 10.54 లక్షలు, పంచాయతీల్లో 10.76 లక్షల దరఖాస్తులు వచ్చాయి. అయితే ఈ అంశంపై పలువురు న్యాయస్థానాన్ని అశ్రయించడంతో పథకానికి బ్రేకులు పడ్డాయి. క్షేత్ర స్థాయిలో పరిశీలన చేశారు. మొదటి దశలో దరఖాస్తుల పరిశీలన, రెండవ దశలో స్థలాల క్రమబద్ధీకరణ అర్హత గుర్తించి సిఫారసు చేయడం, మూడో దశలో సంబంధిత అధికారి నిబంధనల మేరకు ఫీజు చెల్లించాలని నోటీసులు జారీ చేశారు.
అయితే ఈ ప్రక్రియ పూర్తయినప్పటికి ప్రభుత్వం మారినా ఎలాంటి పురోగతి కన్పించలేదు. అధికారం చేపట్టిన కాంగ్రెస్ ఎల్ఆర్ఎస్ పథకాన్ని తిరిగి పట్టాలెక్కించేందుకు నిర్ణయం తీసుకుంది. దేవాదాయ, వక్ఫ్, ప్రభుత్వ భూములు, కోర్టు ఆదేశాలు ఉన్న భూములను తప్ప ఇతర లే-అవుట్ లను క్రమబద్ధీకరించాలని అనుకున్నారు. కానీ హఠాత్తుగా హైడ్రాను తెరపైకి తేవడంతో మొత్తం ఆగిపోయింది. ఇప్పటికీ ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. ఈ సమస్యను పరిష్కరిస్తే.. రియల్టర్లకు.. ఇల్లు క్రయవిక్రయాలు చేయాలనుకునేవారికి ఎంతో మేలు జరుగుతుంది.