Lucky Baskhar Movie Telugu Review
తెలుగు360 రేటింగ్: 3/5
-అన్వర్-
ఇండియన్ స్టాక్ బ్రోకర్ హర్షద్ మెహతా జీవితం ఆధారంగా వచ్చిన ‘స్కామ్ 1992’ వెబ్ సిరిస్ చాలా పాపులర్. ఆనాటి బ్యాంకింగ్ వ్యవస్థలోని లొసుగుల్ని డొల్లతనాన్ని చూపిన ఈ సిరిస్ ఫైనాన్సియల్ క్రైమ్ జోనర్ ఇష్టపడే వారికి ఫేవరేట్. ఇప్పుడు హర్షద్ మెహతా స్కామ్ ని బేస్ చేసుకునే ‘లక్కీ భాస్కర్’ కథ రాసుకున్నాడు డైరెక్టర్ వెంకీ అట్లూరి. మరి ఈ కథలో జరిగిన క్రైమ్ ఏమిటి? హర్షద్ కి భాస్కర్ కి వున్న లింక్ ఏమిటి? ఈ ఫైనాన్షియల్ క్రైమ్ ఆడియన్స్ కి ఎలాంటి థ్రిల్ ఇచ్చింది?
అది1990లో ముంబై. మార్నింగ్ వాక్ చేస్తున్న భాస్కర్ కుమార్ (దుల్కర్ సల్మాన్)ని సిబిఐ అధికారులు అదుపులోకి తీసుకుంటారు. భాస్కర్ మగధ బ్యాంక్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్. ఆ బ్యాంక్ లో జరిగిన ఓ స్కామ్ విచారణలో భాగంగా భాస్కర్ అకౌంట్ చూసి షాక్ అవుతారు. అతడి అకౌంట్ లో రూ.వంద కోట్లు వుంటాయి. రెండేళ్ళ క్రితం ఆరువేల జీతానికి పని చేసే భాస్కర్ కి వందకోట్లు ఎలా వచ్చాయి? మగధ బ్యాంక్ లో జరిగిన స్కామ్ ఏమిటి ? ఈ స్కామ్ కి హర్షద్ మెహ్రా కి వున్న లింక్ ఏమిటి? చివరికి ఈ స్కామ్ నుంచి భాస్కర్ సేఫ్ గా బయటపడ్డాడా లేదా? అనేది తక్కిన కథ.
ఎలాంటి క్యారెక్టర్ గురించి చెప్పినా ఆ క్యారెక్టర్ తో ప్రేక్షకులని కట్టిపడేయడమే సక్సెస్ సీక్రెట్. ‘బ్రేకింగ్ బ్యాడ్’ లో వాల్టర్ వైట్ మెత్ తయారు చేస్తాడు. డ్రగ్స్ సామ్రాజ్యాన్ని గుప్పెట్లో పెట్టుకోవాలని చూస్తాడు. ‘స్కామ్ 1992’లో హర్షద్ మెహతా బ్యాంక్ సొమ్ముని పక్కదారి పట్టించి షేర్స్ రిగ్గింగ్ చేస్తాడు. ‘పుష్ప’ ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తాడు. కేజీఎఫ్ రాకీ గోల్డ్ మైన్ క్రిమినల్… ఇవన్నీ యాంటీ హీరో క్యారెక్టర్లే. కానీ వాళ్ళ కథని చూస్తున్నపుడు ఆ క్యారెక్టర్ గెలవాలని కోరుకుంటారు ఆడియన్స్. లక్కీ భాస్కర్ లో కూడా ఈ మ్యాజిక్ కుదిరింది. ఒక యాంటీ హీరో క్యారెక్టర్ ని ఆడియన్స్ ని అలరించేలా తీర్చిదిద్దడంలో దర్శకుడు వెంకీ అట్లూరి పైచేయి సాధించాడు.
మెరుపు వేగంతో ఈ కథ మొదలౌవ్వడం చాలా అరెస్టింగ్ గా ఉంటుంది. భాస్కర్ ముందు హర్ష మెహ్రా (హర్షద్ మెహతా పేరు మార్చారు)ని, అతని చేసిన క్రైమ్ ని పరిచయం చేసి, తర్వాత తన కథలోకి వెళ్తాడు. మగధ బ్యాంక్ లో ఆరువేల జీతానికి పని చేసే క్యాషియర్ గా భాస్కర్ జీవితం పట్ల ప్రేక్షకుడికి సానుభూతి కలిగించడంలో దర్శకుడు రాసుకున్న సీన్లు భలే కుదిరాయి. భాస్కర్ భార్య సుమతి (మీనాక్షి) కొడుకు కార్తిక్ నేపధ్యంలో వచ్చే సీన్స్ టచ్చింగ్ గా అనిపిస్తాయి. సుమతి అమ్మగారి ఇంట్లో ఎదురయ్యే అవమానం, ఏడాదికి ఒకటే టీషర్టు వాడే కార్తిక్, వడాపావు కొనడానికి సరిపడా డబ్బులు లేని భాస్కర్ పర్స్, ఆశపెట్టి దెబ్బకొట్టిన ప్రమోషన్.. ఈ సీన్లన్నీ దరిద్రానికి బోర్డర్ లైన్ లో బతుకుతున్న భాస్కర్ ఏదైనా చేసి గెలిస్తే బావుండునే సింపతిని ఆడియన్స్ లో క్రియేట్ చేయగలిగాయి.
బ్యాంక్ సొమ్ముతో అంథోని (రాంకీ) భాస్కర్, అతని ఫ్రెండ్ అంజి (కసిరెడ్డి) చేసే బిజినెస్ ఆసక్తికరంగా తీశారు. భాస్కర్ రిస్క్ తీసుకున్న ప్రతిసారి.. అతనికి ఏం కాకూడదనే ఫీలింగ్ ఆడియన్స్ లో కలిగించగలిగారు. ఫారిన్ కార్లతో వేసిన గోవా ట్రిప్ ఎపిసోడ్ మాత్రం అంత బలంగా రాలేదు. పైగా మరీ సినిమాటిక్‌గా అనిపిస్sఉంది. అయితే ఆ సీక్వెన్స్ తర్వాత బ్యాంక్ లో జరిగిన విచారణ, భాస్కర్ డబ్బు మార్చిన సీన్ చాలా ఎక్సయిటింగా వచ్చింది. భాస్కర్ దొరికిపోతాడేమో అనే ఉత్కంఠ కలిగించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. రూ. వందకోట్ల బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా సెకండ్ హాఫ్ పై అంచనాలు పెంచింది.
లక్కీ భాస్కర్ సెకండ్ హాఫ్ ‘స్కామ్ 1992’ వెబ్ సిరీస్ కి ప్రీక్వెల్ గా చెప్పుకోచ్చు. భాస్కర్ క్యారెక్టర్ ని హర్షద్ మెహతా వరల్డ్ లో క్రియేట్ చేశాడు దర్శకుడు. నిజానికి చాలా మంచి ఐడియా ఇది. బ్రేకింగ్ బ్యాండ్ సిరిస్ లో వున్న జిమ్మీ మెక్‌గిల్ క్యారెక్టర్ తో ‘బెటర్ కాల్ సాల్’ సిరిస్ ని నడిపినట్లు.. డైరెక్టర్ వెంకీ అట్లూరి హర్షద్ మెహతా నేపధ్యంలో భాస్కర్ లాంటి ఒరిజినల్ క్యారెక్టర్, స్టొరీ అలోచించగలడం మెచ్చుకోదగ్గ విషయం.
హర్షద్ మెహతా కథ తెలిసన వారికి లక్కీ భాస్కర్ సెకండ్ హాఫ్ బాగా కనెక్ట్ అవుతుంది. ఈ సెకండ్ హాఫ్ అంతా బ్యాంక్ ఫైనాన్సియల్ క్రైమ్. బీఆర్ (బ్యాంక్ రిసీట్) స్టాక్ మార్కెట్, షేర్స్ రిగ్గింగ్, హవాలా.. ఈ కాన్సెప్ట్ లు గురించి తెలిస్తే భాస్కర్ జీవితంలో ఏం జరుగుతుతోందో మరింత లోతుగా తెలుసుకునే ఛాన్స్ వుంటుంది. ఒకవేళ ఆ కాన్సెప్ట్ లు, హర్షద్ మెహతా గురించి పరిచయం లేకపోతే మాత్రం కాస్త డిస్ కనెక్ట్ అయ్యే ఛాన్స్ వుంది. భాస్కర్ అడ్డదారుల్లో డబ్బు సంపాదించే సన్నివేశాలు, తన క్యారెక్టర్ లో వచ్చే మార్పుని ఆసక్తికరంగా చూపించారు. అహంకారాన్ని కొనే సన్నివేశం క్లాప్స్ కొట్టేలా ఉంటుంది. సుమిత హోం ఫుడ్ నేపధ్యంలో వచ్చే సన్నివేశాలు అంతగా బలంగా వుండవు. క్లాస్ సినిమాలో ఎలివేషన్లకు ఛాన్సు ఉండదు. కొన్ని సీన్లు నడిపిన విధానం.. మాస్ సినిమాలకు ఏమాత్రం తీసిపోని విధంగా సాగాయి.
మిగతా యాంటీ హీరోల కథలకి భాస్కర్ కథ ఓ తేడా వుంది. జూదంలో ఎంత గెలిచామన్నది కాదు ఎప్పుడు ఆపామన్నదే ముఖ్యం. ఇక్కడే తెలివైన ఆటగాడు అనిపించుకుంటాడు భాస్కర్. తనదగ్గర వున్న మొత్తం డబ్బుని తిరిగి ఇచ్చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు అది అన్యాయంగా సంపాదించిన డబ్బు అయినప్పటికీ భాస్కర్ దగ్గరవుంటే బాగుంటుందన్న ఫీలింగ్ లోకి ప్రతి ప్రేక్షకుడు వెళ్తాడు. అక్కడే భాస్కర్ గెలిచేస్తాడు. ఈ కథకు దర్శకుడు ఇచ్చిన తెలివైన క్లైమాక్స్ మరో సర్ప్రైజ్.
ఏ పాత్రలోనైనా ఇమిడిపోయే నటుడు దుల్కర్ సల్మాన్. ఇందులో భాస్కర్ పాత్రలో ఒదిగిపోయాడు. సినిమా మొత్తం క్యారెక్టర్ దాటి రాలేదు. బ్యాంక్ లో మేనేజర్ కాళ్ళమీద పడి సారీ చెప్పే సీన్ లో దుల్కర్ నటన మరో ఎత్తులో కనిపిస్తుంది. తన గెటప్, మాట తీరు, పెర్ఫార్మెన్స్ అన్నీ నేచురల్ గా కుదిరాయి. మీనాక్షి హోమ్లీగా కనిపించింది. రెగ్యులర్ హీరోయిన్ పాత్ర కాదు. నటనకు స్కోప్ వుండే క్యారెక్టర్. కొడుకు క్యారెక్టర్ లో చేసిన పిల్లాడు చలాకీగా నటించాడు. బర్త్ డే సీన్ లో ఆ బాబు నటన హత్తుకునేలా వుంటుంది. చాలా మంచి సీన్ అది. రాజ్ కుమార్ కసిరెడ్డికి కూడా కాస్త భిన్నమైన పాత్ర పడింది. రాంకీ ది పాజిటివ్ రోల్. ఆ పాత్రకు హుందాతనం తీసుకొచ్చారు. సచిన్ కేడ్కర్, సాయి కుమార్, హైపర్ ఆది పాత్రలు కథ మేరకు వున్నాయి.
టెక్నికల్ గా సినిమా బావుంది. జీవి నేపధ్య సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సస్పెన్స్, థ్రిల్ ని మెంటైన్ చేస్తూ ఆయన ఇచ్చిన ఆర్ఆర్ బాగా కుదిరింది. నిమిష్ రవి కెమెరా వర్క్ డీసెంట్ గా వుంది. ఆర్ట్ వర్క్ లో మంచి పని తీరు కనిపించింది. 1990 ముంబైని చూపించగలిగారు. ఎడిటింగ్ షార్ప్ గా వుంది. కొన్ని సీన్లు బాగా కట్ చేశారు. ముందుకూ వెనక్కి వెళ్లడం వల్ల, సీన్లో ఉత్కంఠత పెరిగింది. అనవసరమైన సీన్స్ కనిపించవు. ”ఒక రోజులో అరగంట నాకు నచ్చినట్లు గడవలేదని దాని కోసం సంవత్సరం అంతా బాధపడలేను`, ‘వేగంగా వచ్చే బండి, డబ్బు ఎప్పుడో ఒకప్పుడు మనల్ని పడేస్తాయి’, ‘జూదం ఎప్పుడు ఆపమన్నదే ముఖ్యం’ ఇలా కథకు తగిన అర్ధవంతమైన డైలాగులు చాలానే వున్నాయి. డైరెక్టర్ వెంకీ అట్లూరి ఈ కథని చాలా సెన్సిబుల్ గా డీల్ చేశాడు. బ్యాంక్‌లో జరిగే స్కామ్ అంటే చాలామందికి అర్థం కాదేమో అనే భయం అక్కర్లెద్దు. దాన్ని అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినంత అందంగా చెప్పాడు దర్శకుడు. డబ్బు కోసం భాస్కర్ ఆడిన తెలివైన ఆటని ఓసారి నిరభ్యంతరంగా చూడొచ్చు.
తెలుగు360 రేటింగ్: 3/5
-అన్వర్-