దీపావళికి వచ్చిన లక్కీ భాస్కర్ మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాకి ఆడియన్స్, క్రిటిక్స్ నుంచి యునానిమిస్ గా సూపర్ హిట్ రెస్పాన్స్ వచ్చింది. ఆర్థిక నేరం జోనర్ లో వచ్చిన ఈ సినిమా నిజానికి తెలుగు స్క్రీన్ కి ఒక కొత్త తరహా ప్రయత్నమే.
ఈ కథ ఎంచుకోవడంలో దర్శకుడు వెంకీ అట్లూరి కథకులకు ఒక కొత్త మార్గాన్ని చూపాడు. నిజానికి ఇది ప్రజా బాహుళ్యంలో వున్న కథే. హర్షద్ మెహతా జీవితం ఆధారంగా స్కామ్ 1992 అనే వెబ్ సిరీస్ వచ్చింది. ఆ వెబ్ సిరీస్ లో హర్షద్ మెహతా చేసిన స్కామ్ ఏంటి? స్టాక్ మార్కెట్లో అతని ప్రభావం ఏంటి? స్టాక్స్ ఎలా రిగ్గింగ్ చేశాడు ? బ్యాంకు సొమ్ముని ఎలా వాడుకున్నాడు ? బ్యాంకులో పనిచేసే ప్రముఖులని ఎలా తన గుప్పెట్లో పెట్టుకున్నాడు? మొత్తం వ్యవస్థని ఎలా అడ్డదారులు తొక్కించాడు ? ఇలాంటి చాలా కోణాలు ఆ వెబ్ సిరీస్ లో ఉంటాయి.
అయితే దర్శకుడు వెంకీ అట్లూరి హర్షద్ మెహతా వరల్డ్ లోకి వెళ్లి అక్కడ నుంచి ఒక ఫిక్షనల్ క్యారెక్టర్ తీసుకుని ఆ ప్రపంచంలో లక్కీ భాస్కర్ కథని చెప్పడం ఒక తెలివైన ప్రయత్నం. కొత్త కథలు ఎప్పుడూ పుట్టవు. ఉన్న కథనే కొత్తగా చెప్పాలని సర్వసాధారణంగా అందరూ చెప్పే మాటే. ఇది వాస్తవం కూడా. ఉన్న కథనే ఒక డిఫరెంట్ స్పిన్ తో ఎంత కొత్తగా చెప్పగలుగుతున్నాం అనే పాయింట్ మీదే సినిమా ఫలితం ఆధారపడి ఉంటుంది.
దర్శకుడు వెంకీ అట్లూరి లక్కీ భాస్కర్ కథ కోసం హర్షద్ మెహతా బ్యాక్ డ్రాప్ ని వాడుకున్న విధానం నిజంగా మెస్మరైజింగ్. ఈ సినిమా సెకండ్ హాఫ్ అంతా హర్షద్ మెహతా కథే. హర్షద్ మెహతా వెబ్ సిరిస్ చూసిన వాళ్ళకి అసలు హర్సద్ చేసిన స్కామ్ ఏంటో చాలా క్లియర్ గా తెలుస్తుంది. అక్కడ ఒక బ్యాంక్ ఎంప్లాయ్ క్యారెక్టర్ ని హీరోగా క్రియేట్ చేసి లక్కీ భాస్కర్ గా మార్చడం అద్భుతంగా కుదిరింది.
లక్కీ భాస్కర్ కథలు ఆలోచించే వాళ్ళకి ఒక కొత్త దారి చూపించింది. నిజానికి ఎక్కడో చూసిన సినిమా నుంచి స్ఫూర్తి పొంది మరో కథను రాస్తుంటారు. కానీ దర్శకుడు వెంకీ అట్లూరి ఒక రిస్క్ తీసుకున్నాడు. ఆల్రెడీ పబ్లిక్ డొమైన్ లో ఉన్న సిరిస్ కి ఒక ఫిక్షనల్ క్యారెక్టర్ ని యాడ్ చేసి ఒక కొత్త కథ చెప్పడం అనేది కొత్త యూఎస్పీలా మారింది.
అలాగే దర్శకుడు ఈ కథని రాసుకున్న విధానం చాలా గొప్పగా కుదిరింది, ఎక్కడ బోర్ కొట్టించకుండా ఒక్క అనవసరమైన సీన్ లేకుండా ఈ కథని ఎంగేజింగ్ చెప్పడంలో వెంకీ చేసిన వర్క్ నిజంగా అభినందించదగ్గదే. మొత్తనికి లక్కీ భాస్కర్ కథల తయారు చేయడంలో ఒక కొత్త డోర్ ని ఓపెన్ చేసింది. పాపులర్ కంటెంట్ నుంచే కొత్త క్యారెక్టర్, కథని ఎంత తెలివిగా రాసుకోవచ్చో చూపించింది.