హైదరాబాద్ రియల్ ఎస్టేట్ విస్తరణలో భారీగా విలువలు పెరిగిన ప్రాంతం బౌరంపేట. హైదరాబాద్‌లోని ఐటీ హబ్‌లు, వాణిజ్య కేంద్రాలకు సమీపంలో ఉండటం అవుటర్ రింగ్ రోడ్ సౌకర్యం వల్ల సొంత ఇల్లు కొనాలనుకునేవారికి, పెట్టుబడిదారులకు ఆకర్షణీయమైన ప్రాంతంగా మారింది. బౌరంపేట పదేళ్ల కిందట వరకు పంట పొలాలతో గ్రామీణ వాతావరణంగా ఉండేది, ఇప్పుడు రెసిడెన్షియల్, కమర్షియల్ ప్రాజెక్టులతో వేగంగా మారిపోతోంది. మేడ్చల్‌కు సమీపంలో ఉండే బౌరంపేటలో అన్ని మౌలిక సదుపాయాలు ఏర్పడ్డాయి.
మల్లంపేట నుంచి దుండిగల్ వరకు ORR విస్తరణ ఈ ప్రాంతానికి మరింత విలువ జోడిస్తోంది. బౌరంపేటలో స్థలాల ధరలు గత కొన్ని సంవత్సరాలుగా స్థిరంగా పెరుగుతున్నాయి. సగటున, ఒక చదరపు అడుగు ధర రూ. 3,000 నుంచి రూ. 5,000 వరకు ఉంటుంది, అయితే ఇది ప్రాజెక్టు స్థలం , సౌకర్యాలపై ఆధారపడి మారుతుంది. అపార్ట్మెంట్ల ధరలు రూ. 50 లక్షల నుంచి రూ. 1 కోటి వరకు ఉంటాయి. ORR సమీపంలో ఉండటం వల్ల బౌరంపేట నుంచి హైదరాబాద్‌లోని గచ్చిబౌలి, హైటెక్ సిటీ, శంషాబాద్ విమానాశ్రయం వంటి ప్రాంతాలకు సులభంగా చేరుకోవచ్చు. స్కూళ్లు ఆసుపత్రులు, షాపింగ్ కాంప్లెక్స్‌లు, రిటైల్ స్టోర్లు ఈ ప్రాంతంలో వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. సమీపంలోని కొంపల్లి, మేడ్చల్ ప్రాంతాల్లో అనేక ఇంటర్నేషనల్ పాఠశాలలు, కాలేజీలు ఉన్నాయి.
బౌరంపేటలో రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టడం వల్ల స్థిరమైన రెంటల్ ఆదాయం , ఆస్తి విలువ పెరుగుదల, దీర్ఘకాలిక సంపద సృష్టి ఉంటుందని రియల్ వర్గాలు చెబుతున్నాయి. ఈ ప్రాంతంలో స్థలాలు, గృహాల విలువ గత 5-7 సంవత్సరాల్లో సగటున పదిహేను శాతం వరకూ పెరిగింది. బౌరంపేటలో పలు స్థానిక, జాతీయ స్థాయి డెవలపర్స్ ప్రాజెక్టులు చేపట్టారు. బౌరంపేట రియల్ ఎస్టేట్ మార్కెట్ హైదరాబాద్ శివారులలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో ఒకటిగా ఉంది. ORR సౌకర్యం, ఐటీ హబ్‌లకు సామీప్యత, మౌలిక సదుపాయాల అభివృద్ధి ఈ ప్రాంతాన్ని రెసిడెన్షియల్ , పెట్టుబడికి ఆకర్షణీయంగా మారుస్తున్నాయి.
ప్రస్తుతం హైడ్రాతో పాటు వివిధ రకాల సమస్యల వల్ల రియల్ ఎస్టేట్ స్తబ్దుగా ఉంది. అందుకే ధరలు అందుబాటులో ఉన్నాయి. పరిస్థితులు సానుకూలంగా మారితే ఊహించని విధంగా పెరిగే అవకాశం ఉంది.