ఎన్నికల సంఘం నియమించినందున .. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధానాధికారి… బరువు బాధ్యతలు కూడా తనవేనని… ఏపీ చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యం అనుకుంటున్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత… సీఎస్ కు అధికారాలు ఉండవు. పూర్తిగా సీఈవో దగ్గరే ఉంటాయి. ఇంకా చెప్పాలంటే.. ఎన్నికలకు సంబంధించి.. ఎలాంటి నిర్ణయం అయినా… సీఈవోనో తీసుకోవాలి. ఎలాంటి ఆదేశాలు అయినా… సీఈవో అయిన ద్వివేదీనే ఇవ్వాలి. కానీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం మాత్రం.. చెలరేగిపోతున్నారు. తనను నేరుగా ఈసీనే నియమించినందున.. తనకు అన్ని వ్యవస్థలపై అధికారం ఉందన్నట్లుగా హవా కొనసాగిస్తున్నారు. విజయసాయిరెడ్డి సిఫార్సుతోనే… ఎల్వీ సుబ్రహ్మణ్యంను సీఎస్‌గా నియమించారని.. ఎన్నికల్లో అక్రమాల కోసమే ఈ నియామకం జరిగిందని… టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. దీనికి తగ్గట్లుగానే ఎల్వీ నేరుగా ఎన్నికల విధుల్లో జోక్యం చేసుకుంటున్నారు.
ఎల్వీ సుబ్రహ్మణ్యం సీఎస్ అయినప్పటి నుంచి సీఈవో ద్వివేదీ పరిస్థితి మారిపోయింది. ఆయనకు నేరుగా ఎల్వీ ఆదేశాలు జారీ చేస్తున్నారు. తన వద్దకు పిలిపించుకుని మరీ… సమీక్షలు చేస్తున్నారు. అసలు ఎన్నికల సమయంలో.. సీఈవో పిలిస్తే… చీఫ్ సెక్రటరీ రావాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు ఏపీలో జరుగుతోంది వేరు. పైగా.. ద్వివేదీ కూడా.. తనకు పై నుంచి ఆదేశాలు వచ్చాయో.. మరో కారణమో తెలియదు కానీ.. తన అధికారాలన్నింటినీ సీఎస్‌కు దఖలు పర్చి ఆయన ఏం చేయమంటే.. అది చేస్తున్నారు. తాజాగా.. కౌంటింగ్ ఏర్పాట్లు, ఇతర అంశాలపై.. వీడియో కాన్ఫరెన్స్ ఉందంటూ…. ద్వివేదీ కలెక్టర్లందరికీ.. సమాచారం పంపారు. అయితే.. అది.. ద్వివేదీతో కాదు.. సీఎస్తోనట. కౌంటింగ్‌కు… సీఎస్‌కు సంబంధం ఏమిటో తెలియక రిటర్నింగ్ ఆఫీసర్లయిన కలెక్టర్లు… ఆశ్చర్యపోతున్నారు. సీఈవో ద్వివేదీ కూడా ఇలా లొంగిపోవడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది.
ఎల్వీ సుబ్రహ్మణ్యం తీరు మొదటి నుంచి వివాదాస్పదంగానే ఉంది. ఈసీ ఓ సీఎస్‌ను బదిలీ చేసి ..మరో సీఎస్‌ను నియమించారంటే… వాళ్లు… పరిపాలన చేయమని కాదు. కేవలం ఎన్నికలను ప్రభావితం చేయకూడని పరిణామాలు జరగకుండా చూసుకోవడం. కానీ ఎల్వీ మాత్రం… కోడ్ ఉంది కాబట్టి.. తానే సర్వాధికారిని అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. వివాదాస్పదంగా వ్యవహరిస్తున్నారు. పోలింగ్ రోజు.. సాయంత్రం… ఎన్నికల గొడవలు జరుగుతున్న సమయంలో.. డీజీపీ ఆఫీసుకు వెళ్లారు. ఆ సమయంలో… గొడవలు జరుగుతున్న చోట్ల పరిస్థితుల్ని అదుపులో పెట్టే విషయంలో… ఉన్నతాధికారులకు సూచనలిస్తూ… డీజీపీ బిజీగా ఉన్నారు. కానీ సీఎస్ వెళ్లి ఆయన పనిని చెడగొట్టి.. మొక్కలు నాటేందుకు తీసుకెళ్లారు. దీనిపై నేరుగా సీఎం విమర్శలు చేశారు. కానీ ఆయన తీరు మాత్రం మారలేదు.