ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీగా.. ఎల్వీ సుబ్రహ్మణ్యం కొనసాగడం ఖాయమయింది. వైసీపీ గెలిచిన విషయం తెలిసిన వెంటనే.. ఎల్వీ సుబ్రహ్మణ్యం.. వెళ్లి జగన్మోహన్ రెడ్డిని కలిశారు. ఘనవిజయం సాధించడంపై జగన్‌ను అభినందించారు. 30వ తేదీన ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు చేయాలని.. ఎల్వీ సుబ్రహ్మణ్యానికి సూచించారు. తనను సీఎస్‌గా నియమించింది కేంద్ర ఎన్నికల సంఘం కాబట్టి… జగన్‌కు ఏమైనా ఆప్షన్ ఉందా.. అని అడిగారు.. ఎల్వీ. రిటైర్మెంట్కు ఇంకా ఏడాది ఉందని తెలుసుకున్నాను.. మా ప్రభుత్వంలో కూడా మీరే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అని జగన్ ఎల్వీకి హామీ ఇచ్చారు. ఉన్నతాధికారులతో… సమావేశాన్ని ఎల్వీ ఏర్పాటు చేశారు. నీతి వంతమైన పాలన అందించడమే తమ లక్ష్యమని.. ఎల్వీకి జగన్ స్పష్టం చేశారు.
ఏపీ ప్రభుత్వ సలహాదారుగా అజేయకల్లాం..!
చంద్రబాబునాయుడు హయాంలో.. ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీగా .. స్వల్పకాలం పని చేసి రిటైర్ అయిన కల్లాం అజేయరెడ్డి అలియాస్ అజేయకల్లాం.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుగా నియమితులవడం లాంఛనమే. ఆయన ఆధ్వర్యంలో పని చేయాలని.. ఎల్వీ సుబ్రహ్మణ్యానికి జగన్మోహన్ రెడ్డి సూచించారు. సీఎంగా జగన్ ప్రమాణం చేసిన తర్వాత.. నియామకాల ప్రక్రియలో మొదటగా అజేయకల్లాం పేరు ఉండే అవకాశం ఉంది. సీఎస్‌గా పదవీ విరమణ చేసిన తర్వాత అజేయకల్లాం.. పూర్తి స్థాయిలో.. వైసీపీకి మద్దతుగా పని చేయడం ప్రారంభించారు. టీడీపీ ప్రభుత్వంపై అనేక ఆరోపణలు చేస్తూ.. అవినీతి ముద్ర వేస్తూ.. అనేక వర్క్ షాపులు నిర్వహించారు. దానికి ప్రతిఫలంగా ప్రభుత్వ సలహాదారు పదవి లభించే అవకాశం ఉంది.
డీజీపీగా సవాంగ్‌ను నియమిస్తారా..?
ప్రతిపక్షంలో ఉండగా.. వైసీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన అధికారుల్లో.. డీజీపీ ఒకరు. డీజీపీ ఠాకూర్‌పై… వైసీపీ నేతలకు చాలా మందికి కోపం ఉంది. ఆళ్ల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్లు… డీజీపీపై వ్యక్తిగత విమర్శలు కూడా చేశారు. అంతా.. జగన్ ప్రొత్సాహంతోనే జరిగిందని ఆయన చెబుతూ ఉంటారు. ఆ కారణంగా చూస్తే… డీజీపీగా ఠాకూర్‌ను కొనసాగించే అవకాశం లేదు. ఆయనను తప్పిస్తారని అంటున్నారు. అయితే.. ఇలా డీజీపీ లాంటి అత్యున్నత అధికారిని.. మధ్యలో తప్పించడం సంప్రదాయం కాదు. డీజీపీ ఎలాగూ ప్రభుత్వ ఆదేశాలకే కట్టుబడతారు కాబట్టి… కక్ష సాధింపుగా భావించకపోతే తప్ప.. ఆయననే కొనసాగిస్తారు. లేపోతే.. గౌతం సవాంగ్‌ను నియమిస్తారని చెబుతున్నారు. వాస్తవానికి .. డీజీపీ నియామకం సమయంలో.. సవాంగ్, ఠాకూర్ ఇద్దరూ పోటీ పడ్డారు. చంద్రబాబు ఠాకూర్ వైపే మొగ్గారు.
జగన్ ప్రాపకం కోసం ఉన్నతాధికారుల హడావుడి..!
నిజానికి ఎన్నికలు ముగిసిన తర్వాత.. వైసీపీ గెలుస్తుందనే మౌత్ టాక్ ప్రారంభం కావడంతో… చాలా మంది అధికారులు… జగన్ క్యాంప్‌నకు దగ్గరయ్యే ప్రయత్నం చేశారు. అధికారిక రహస్యాలు… పంపడం దగ్గర్నుంచి… టీడీపీ నేతలను పట్టించుకోకపోవడం వరకూ.. చాలా అంశాలపై అతిగా స్పందించారు. ఇదంతా.. మంచి పోస్టింగ్‌ల కోసమేనన్న ప్రచారం జరిగింది. ఇప్పుడు ఆ పోస్టింగ్‌ల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.