ఎన్నికల సంఘం చేత నియమింపబడిన ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం.. చేతి వాటాన్ని.. చాలా జోరుగా ప్రదర్శిస్తున్నారన్న విమర్శలు సచివాలయంలో జోరుగా వినిపిస్తున్నాయి. నెల్లూరుకు చెందిన సింహపురి అనే ఆస్పత్రి విషయంలో ఆయన పూర్తిగా.. తన అధికారాన్ని దుర్వినియోగం చేశారు. తప్పు చేసిన ఆ ఆస్పత్రిని రక్షించడానికి నిబంధనల్లాంటివి ఏమీ పట్టించుకోకుండా ఆదేశాలు జారీ చేయడం.. ఇప్పుడు కలకలం రేపుతోంది. నెల్లూరులోని సింహపురి హాస్పిటల్.. రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి నుంచి అవయవాలు తీసుకోవడానికి భారీగా బిల్లు వేసి… బ్లాక్ మెయిల్ చేసింది. బిల్లు మాఫీకి ప్రతిఫలంగా బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి అవయవాలు తీసుకున్నారు. ఈ విషయం బయటకు వచ్చింది. దాంతో.. నెల్లూరు జిల్లా కలెక్టర్, ఇతర వైద్యాధికారులు విచారణ జరిపి.. సింహపురి ఆస్పత్రి దారుణానికి పాల్పడిందని నిర్ధారించి .. చర్యలకు సిఫార్సు చేశారు. కానీ ఎలాంటి సంబంధం లేదని సీఎస్.. ఎల్వీ సుబ్రహ్మణ్యం వెంటనే జోక్యం చేసుకున్నారు.
సింహపురి ఆస్పత్రి యాజమాన్యం తన దగ్గరకు వచ్చిందని.. చెప్పి.. కలెక్టర్ నివేదికను పట్టించుకోకుండా.. డీఎంఈ నేతృత్వంలో మరో విచారణ కమిటీ వేయాలని ఆదేశించారు. అంతా మౌఖికంగా జరిగిపోయింది. సీఎస్ తమను ఇరికిస్తున్నారనుకున్న ఇతర అధికారులు.. రాతపూర్వకంగా ఇస్తేనే చేస్తామని తేల్చి చెప్పేశారు. దాంతో.. ఎల్వీ అతి తెలివిగా ఆదేశాలిచ్చారు. డీఎంఈతో విచారణ చేయించి ఆ నివేదికను కలెక్టర్, ఎస్పీలకు ఇవ్వాలని ఆ ఆదేశాలు. సీఎస్ ఆదేశాలతో.. డీఎంతో విచారణ చేయించి.. అప్పటికే విచారణ చేయించి.. నివేదిక పంపిన కలెక్టర్‌కు ఇవ్వడం ఏమిటో ఎవరికీ అర్థం కాలేదు. డీఎంఈ రాష్ట్ర స్థాయి అధికారి. ఆయన తన నివేదికను సీఎస్‌కు ఇచ్చే అధికారం ఉంది. అయినా.. ఈ వ్యవహారంలో సింహపురి ఆస్పత్రిని కాపాడి… తన చేతికి మట్టి అంటకుండా.. ఏదైనా వివాదాలొస్తే.. దిగువ స్థాయి అధికారుల్ని బలి చేద్దామని ఎల్వీ ప్లాన్ చేశారని సెక్రటేరియట్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
విచిత్రం ఏమిటంటే… విచారణ చేయాలని.. ఎల్వీ ఇచ్చిన ఆదేశాల మేరకు.. డీఎంఈ తన పని పూర్తి చేశారు. ఇందులోనూ సింహపురి ఆస్పత్రి… అవయవాల కోసం దారుణానికి పాల్పడిందని తేల్చారు. దీంతో ఇప్పుడు.. ఎల్వీ సుబ్రహ్మణ్యం కూడా… తాను అమితమైన అనురాగాన్ని చూపించిన సింహపురి ఆస్పత్రిని కాపాడలేని పరిస్థితికి వచ్చారు. తాను ఏరికోరి నియమించిన కమిటీ కూడా.. ఆస్పత్రి తప్పు చేసిందని తేల్చడంతో.. ఆ ఆస్పత్రికి..గుర్తింపును రద్దు చేయాలని మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గుర్తింపు కు.. సిఫార్సు చేయడం మినహా చేయగలిగిందేమీ లేదు. ఆ ఆస్పత్రి విషయంలో జోక్యం చేసుకుని.. అధికార దుర్వినియోగానికి పాల్పడినా… ఫలితం దక్కడం లేదు ఎల్వీకి. ఈ విషయం సెక్రటేరియట్‌లోనే కాదు.. ఏపీ అధికారవర్గాల్లో గుప్పుమనడంతో… ఎల్వీని మళ్లీ అందరూ అనుమానంగా చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.