టాలీవుడ్ లో ఓ విషాదం చోటు చేసుకొంది. ప్రముఖ గీత రచయిత కులశేఖర్ మృతి చెందారు. ఆయన వయసు 56 ఏళ్లు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కులశేఖర్ కొద్దిసేపటి క్రితం హైదరాబాద్లోని గాంధీ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ‘చిత్రం’ సినిమాతో తెరంగేట్రం చేసిన కులశేఖర్ దాదాపు వంద పాటల వరకూ రాశారు. ‘ప్రియతమా తెలుసునా’ (నువ్వు – నేను), ‘నా గుండెలో నువ్వుండిపోవా`'(నువ్వు నేను), ‘అందమైన మనసులో ఇంత అలజడెందుకో’ (జయం), ‘ఎందుకో ఏమిటో’ (జయం)లాంటి పాటలు ఆయన కలం నుంచి వచ్చినవే. తేజ – ఆర్పీ పట్నాయక్ కాంబోలో వచ్చిన సినిమాలు రచయితగా కులశేఖర్కు మంచి పేరు తీసుకొచ్చాయి.
1971 ఆగస్టు 15వ తేదీన సింహచలంలో జన్మించారు కులశేఖర్. జర్నలిస్టుగా ,తన ప్రయాణాన్ని మొదలుపెట్టి, ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఇక్కడ గీత రచయితగా మంచి పేరు కూడా సొంతం చేసుకున్నారు కుల శేఖర్. దర్శకుడిగానూ మారే ప్రయత్నం చేశారు. అయితే అక్కడ్నుంచే ఆయన డౌన్ ఫాల్ ప్రారంభమైంది. అవకాశాలు తగ్గి, మానసికంగా వేదన అనుభవించారు. ఆ తరవాత కొన్ని వివాదాల్లోనూ ఆయన పేరు వినిపించింది. మతిస్థిమితం తప్పడంతో కొంతకాలం అందరికీ దూరంగా గడిపారు. కులశేఖర్కు ఆర్థిక సహాయం చేసి, ఆదుకోవాలని కొంతమంది మిత్రులు ప్రయత్నించారు. కానీ ఆయన ఆరోగ్యం గాడిన పడలేదు. ఇప్పుడు మరణవార్త వినాల్సివచ్చింది.