తెలుగు భాష గురించీ, ఆ భాషని కాపాడుకోవాల్సిన అవసరం గురించీ – పవన్ కల్యాణ్ వీర లెవిల్లో స్పీచులు ఇస్తున్నాడు. పవన్ మాటలు చాలామందిని ఉత్తేజ పరుస్తున్నాయి కూడా. అయితే కొంతమందిని బాధిస్తున్నాయి. నిన్నటికి నిన్న పవన్ తెలుగుపై కాస్త ఆవేశంగానే మాట్లాడాడు. హీరోలకు సైతం తెలుగు రాదని, బూతులు మాట్లాడుతున్నారని, తెలుగు పాటల్లో పాండిత్యం కరువైందని వాపోయాడు. పవన్ మాటల్లో నిజం లేకపోలేదు. ఈ విషయమై.. హీరోలెవరూ రియాక్ట్ అవ్వలేదు. కానీ గీత రచయితలు మాత్రం `మా పాటల్లో పాండిత్యం లేదా` అంటూ భుజాలు తడుముకోవడం మొదలెట్టారు.
గీత రచయిత అనంత శ్రీరామ్…. సోషల్ మీడియా వేదిక చేసుకుని `పాటలకు కావల్సింది పాండిత్యమా? సాహిత్యమా?` అనే ఓ ప్రశ్నని నేరుగానే సంధించాడు. ఇది పవన్‌కే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిజానికి పాటకు కావల్సింది పాండిత్యం కాదు. సాహిత్యం మాత్రమే. కాకపోతే ఆ సాహిత్యానికి అర్థం ఉండాలన్నది పవన్ ఉద్దేశం. ఓ పాటలో పదాలు ప్రజల్ని ఉత్తేజపరిచేలా, చైతన్యవంతుల్ని చేసేలా ఉండాలి. కానీ… అలాంటి పాటలు రాసే అవకాశం ఎంత మందికి వస్తుంది? అలాంటి సందర్భాలు ఎక్కడ దొరుకుతున్నాయి?
పవన్ నటించిన సినిమాలో పాటలన్నీ సాహిత్యానికి (పాండిత్యానికి) పెద్ద పీట వేసినవేనా? సినిమాటిక్ పాటలెన్ని లేవూ..? కాకపోతే ప్రతీ సినిమాలోనూ సమాజానికి అవసరమయ్యే ఓ పాటని విధిగా వాడుకోవడం పవన్ స్టైల్. ఈ విషయంలో పవన్ అంకిత భావాన్ని ఎవరూ ప్రశ్నించలేరు. అందుకే పవన్ నేరుగా సినిమావాళ్లపైనే సెటైర్లు వేయగలిగాడు. ఏది ఏమైనా.. పవన్ టాలీవుడ్లో ఇప్పుడు ఓ అలజడి రేపాడు. అందరి టాపిక్కూ… దీనిపైనే. భవిష్యత్తులో ఎవరు ఎలా స్పందిస్తారో చూడాలి.