ప్రత్యేక హోదా అంశంపై అందరి కంటే ఎక్కువగా విమర్శలు ఎదుర్కొంటున్న వ్యక్తి కేంద్రమంత్రి వెంకయ్య నాయుడేనని అందరికీ తెలుసు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆయన చాలా సార్లు రాష్ట్రానికి తప్పకుండా ప్రత్యేక హోదా ఇస్తామని హామీలు ఇచ్చారు. కానీ, ఆ తరువాత అది సాధ్యం కాదన్నట్లు మాట్లాడి ప్రజలు, ప్రతిపక్షాల నుండి తీవ్ర విమర్శలు మూటగట్టుకొన్నారు. ఆ కారణంగా ఆయన చాలా రోజులుగా ప్రత్యేక హోదా గురించి మాట్లాడటం మానుకొన్నారు. మొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశం అయిన తరువాత నుండి మళ్ళీ దాని గురించి మాట్లాడటం మొదలుపెట్టారు.
నెల్లూరులో ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రత్యేక హోదా హామీపై కేంద్రప్రభుత్వం వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని అన్నారు. విభజన చట్టంలో ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చిన హామీలను, ప్రత్యేక ప్యాకేజి, హోదా మంజూరు చేయడం కోసం అధ్యయనం చేసి వీలయినంత త్వరలో నివేదిక సమర్పించాలని ప్రధాని నరేంద్ర మోడీ నీతి ఆయోగ్ ని కోరినట్లు తెలిపారు. తను కూడా స్వయంగా నీతి అయోగ్ అధికారులతో సమావేశమయ్యి రాష్ట్రానికి ఆదుకొనే విధంగా వీలయినంత త్వరగా నివేదికను తయారు చేయమని కోరినట్లు తెలిపారు. అంటే ప్రత్యేక హోదా వస్తుందని ఆయన మళ్ళీ హామీ ఇస్తున్నారా? అనే అనుమానం కలుగుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశమయిన తరువాత ఇక ప్రత్యేక హోదా వచ్చే అవకాశం లేదు…కనుక ప్రత్యేక ప్యాకేజీతో సర్దుకుపోకతప్పదు అన్నట్లుగా మాట్లాడారు. అంతే కాదు ప్రత్యేక హోదా కంటే ఆర్ధిక ప్యాకేజీ వలననే రాష్ట్రానికి ఎక్కువ ప్రయోజనం ఉంటుందని వాదించారు. రూ.2.25 లక్షల కోట్ల ప్యాకేజి కోసం కేంద్రానికి అభ్యర్ధన, ప్రతిపాదనలు కూడా అందజేశారు. మరి అటువంటప్పుడు కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు మళ్ళీ ప్రత్యేక హోదాపై వెనక్కు తగ్గలేదని చెప్పడానికి అర్ధం ఏమిటో ? కానీ ఈ ప్రత్యేక హోదా అంశంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇంకా ఎంత కాలం నాన్చితే దాని వలన వారికే అంత నష్టం జరిగే అవకాశం ఉంది.