ఉపరాష్ట్రపతిగా ఎన్డిఎ అభ్యర్థి వెంకయ్య నాయుడు ఘన విజయం వూహించనిదేమీ కాదు. ఆయనకు 516 ఓట్లు వస్తే ప్రతిపక్ష అభ్యర్థి గోపాలకృష్ణ గాంధీ 244 ఓట్లు పొందారు. వెంకయ్యను ప్రధాని మోడీ, ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, గాంధీ తదితరులు అభినందించారు. ఉషాపతినే గాని ఉపరాష్ట్రపతిని కాదన్న వెంకయ్య విజయం తర్వాత ఆమెనుంచి అభినందనలు అందుకుని మిఠాయి తిని తినిపించారట. ఇదంతా బాగానే వుంది గాని దేశంలోనే వాగ్ధాటికి మరీ ముఖ్యంగా రాజకీయ ఎదురుదాడికి పేరెన్నిక గన్న ఒక నోటినుంచి ఇకపై ఉపదేశాలు తప్ప ఉపన్యాసాలు వచ్చే అవకాశం వుండదు మరి! వాస్తవానికి ఉదయం ఓటింగు ప్రారంభానికి ముందు వెంకయ్యను మీడియా ఇంటర్వ్యూ చేసినప్పుడే ఈ మార్పు గోచరించింది. సాయింత్రానికి స్థిరపడింది. మరీ ముఖ్యంగా తెలుగు మీడియాకు నెలకు రెండు సార్లయినా ఉడుకుమోతు వ్యాఖ్యలు, ఎకసెక్కాలు ప్రసారం చేసే అవకాశం తప్పిపోయింది. అయితే ఇదే అవకాశంగా వెంకయ్య నాయుడు గనక సూక్తులు లంఘించుకుంటే అదీ సమస్యే..చూడాలి ఎలా వ్యవహరిస్తారో!