ఈసారి కూడా `మా` ఎన్నికలు తప్పేట్టు లేవు. గతంలో కంటే ఈసారి మరింత ప్రతిష్టాత్మకంగా మారిపోయాయి కూడా. మూడు నెలల ముందే…. `మా`లో ఎన్నికల హడావుడి కనిపిస్తోంది. ఎవరెవరు పోటీ చేస్తున్నారన్న విషయంలో స్పష్టత వచ్చేసింది. అయితే ప్రధానంగా విష్ణు, ప్రకాష్ రాజ్ ల మధ్యే పోటీ ఉంది. వీరిద్దరూ ఏ చిన్న అవకాశాన్నీ వదలుకోవడం లేదు. ఇప్పటికే… లోపాయికారిగా `మా` ప్రచారం కూడా మొదలైపోయిందని టాక్. ఓ అభ్యర్థి… `మా` సభ్యుల్ని గ్రూపులు గ్రూపులుగా కలుస్తున్నాడట. వాళ్లకి చిన్న చిన్న పార్టీలు కూడా ఇస్తున్నాడట. మరొకరైతే.. `మా` లోని నిరుపేద సభ్యుల ఎకౌంట్లోకి డబ్బులు వేసి `కరోనా టైమ్ కదా.. ఎందుకైనా పనికొస్తుంది.. ఉంచండి` అంటూ ఫోన్లు చేసి మరీ చెబుతున్నాడట. అంటే… ఎవరి బ్యాచుని వాళ్లు కాపాడుకోవడానికి ప్రయత్నాలు మొదలెట్టేశారన్నమాట. సినీ పెద్దలు కృష్ణంరాజు, చిరంజీవి లాంటివాళ్లైతే.. ఈసారి `మా` అధ్యక్షుడ్ని ఏకగ్రీవంగానే ఎంచుకోవాలనే భావిస్తున్నారు. కానీ.. ఆ వాతావరణం కనిపించడం లేదు. ఇది వరకు కూడా.. మా లో ఇలాంటి పోటీ కనిపించినప్పుడు.. అభ్యర్థుల్ని పిలిపించి మాట్లాడి – ఎన్నికల నుంచి తప్పుకోవాలని సూచించారు. కానీ వర్కవుట్ అవ్వలేదు. ఈసారి కూడా అలాంటి వాతావరణమే కనిపిస్తోంది.