‘మా బిల్డింగ్ నేనే కట్టిస్తా’ అనే ప్రతిపాదనతోనే ‘మా’ అధ్యక్షుడు అయ్యాడు మంచు విష్ణు. ఆయన ‘మా’ అధ్యక్షుడిగా ఎన్నికై.. యేడాది అయ్యింది. ఈ సందర్భంగా ‘మా’ బిల్డింగ్‌పై ఓ కీలకమైన నిర్ణయం తీసుకొన్నారు. హైదరాబాద్ లోని ఫిల్మ్ ఛాంబర్ ని త్వరలో రీ మోడలింగ్ చేయబోతున్నారు. ప్రస్తుతం ఉన్న పాత భవనాన్ని తొలగించి.. కొత్త బిల్డింగ్ నిర్మించన్నారు. అందులోనే ‘మా’ బిల్డింగ్ కి స్పేస్ తీసుకొంటానని, అందుకోసం ఎంత ఖర్చయినా తానే భరిస్తానని `మా` సభ్యులకు మాటిచ్చాడు విష్ణు. ”మా బిల్డింగ్ విషయంలో నా దగ్గర రెండు ప్రతిపాదనలు ఉన్నాయి. ఇప్పుడున్న ఫిల్మ్ ఛాంబర్‌కి 30 నిమిషాల ప్రయాణం చేస్తే.. ఓ స్థలం ఉంది. అక్కడ బిల్డింగ్ ఏర్పాటు చేయడానికి ఓ ఆరు నెలల సమయం పడుతుంది. రెండో ఆప్షన్ కూడా ఉంది. ఇప్పుడున్న ఫిల్మ్ ఛాంబర్‌ని పడగొట్టి.. కొత్తగా ఓ బిల్డింగ్ నిర్మించనున్నారు. అక్కడ `మా` కోసం కొంత స్పేస్ నా డబ్బులతో కొంటా. ఈ రెండు ప్రతిపాదనల్ని మా సభ్యుల ముందు ఉంచితే… రెండో దానికే అంతా ఓటేశారు. కాకపోతే… ‘మా’ కొత్త ఛాంబర్ రావడానికి కనీసం మూడు నాలుగేళ్ల సమయం పడుతుంది” అని చెప్పుకొచ్చాడు విష్ణు.
ఫిల్మ్ ఛాంబర్ ఆవరణలో.. ఇప్పటికీ ‘మా’కు కొంత స్పేస్ ఉంది. అది చిన్న ఆఫీస్ అంతే. అది సరిపోవడం లేదనే.. ‘మా’ కోసం ఓ బిల్డింగ్ కావాలని అంతా పట్టుపట్టారు. అదే ఛాంబర్ ని కొత్తగా నిర్మిస్తే… ఓ ఫ్లోరు మొత్తం.. ‘మా’ కోసం తీసుకోవాలన్నది విష్ణు ఆలోచన. మరి..`మా` కోసం స్పేస్ అమ్మడానికి ఛాంబర్ ఒప్పుకొంటుందా? అనేది ఇంకో పెద్ద డిబేటు. బిల్డింగ్ మొత్తం తన సొంత డబ్బుతో కట్టిస్తా అంటే.. అప్పుడు ఛాంబర్ ఒప్పుకోవొచ్చు. దానికి కనీసం రూ.2 నుంచి 3 కోట్ల రూపాయలైనా ఖర్చువుతుంది. కాకపోతే. ఇది మూడేళ్ల తరవాతి మాట. అప్పటిలోగా ఇంకెన్ని రాజకీయాలు జరుగుతాయో..? ఇంకెన్ని మార్పులూ చేర్పులూ వస్తాయో..?