క్రితం సారి ‘మా’ ఎన్నికలు సాధారణ ఎన్నికల స్థాయిలో వేడి వేడిగా సాగాయి. అందరి ఎజెండా `మా` బిల్డింగే. ఈసారి అత్యాధునిక హంగులతో `మా` బిల్డింగ్ నిర్మిస్తానని మాట ఇచ్చి ఎన్నికల్లో గెలిచాడు విష్ణు. అయితే ఆయన ప్రెసిడెంట్ గా గెలిచి ఇంత కాలమైనా ‘మా’ బిల్డింగ్ సంగతి తేలలేదు. ఆయన పదవీకాలం మరో యేడాది ఉంది. ఈలోగా పూర్తవుతుందన్న గ్యారెంటీ కూడా లేదు. అసలు ‘మా’ బిల్డింగ్ ఉంటుందా? ఉండదా? అనే సంగతి ‘మా’ సభ్యులకు కూడా అంతుపట్టడం లేదు. `మా` బిల్డింగ్ విషయంలో ఇప్పుడు సభ్యుల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నట్టు సమాచారం. కొంతమంది `మా` బిల్డింగ్ కట్టాల్సిందే అని చెబుతుంటే, ఇంకొంతమంది ‘మా’కి బిల్డింగ్ అవసరం లేదని, ఆ డబ్బుతో సంక్షేమ కార్యక్రమాలు చేపడితే బాగుంటుందని సలహాలు ఇస్తున్నార్ట.
మా బిల్డింగ్ కి కనీసం 30 కోట్లు ఖర్చు అవుతుంది. ‘మా’లో మహా అయితే.. 500 మంది సభ్యులు. ప్యానల్ లో 20 కి అటూ ఇటుగా ఉంటారు. `మా` మీటింగ్ జరిగితే వంద మంది కూడా హాజరయ్యే పరిస్థితి లేదు. వాళ్లందరి కోసం రూ.30 కోట్లతో బిల్డింగ్ నిర్మించడం కంటే.. ఆ డబ్బులేవో `మా`లోని నిరుపేదలకు ఉపయోగిస్తే బాగుంటుందన్న ఆలోచన ఉంది. ఇప్పుడున్న ఫిల్మ్ ఛాంబర్ స్థానంలో కొత్త బిల్డింగ్ నిర్మించే ఆలోచన ఉంది. అప్పుడు `మా`కు ఓ ఆఫీసు అందుబాటులో ఉంటుంది. అది మా కార్యకపాలు నిర్వహించుకోవడానికి సరిపోతుందన్నది మరో వాదన. అందుకే ‘మా’ బిల్డింగ్ కి సంబంధించి ఏ నిర్ణయమూ తీసుకోలేకపోతున్నారని తెలుస్తోంది. ఒకవేళ మా బిల్డింగ్ ని పక్కన పెడితే.. అదే ఎజెండాతో గెలిచిన విష్ణు ఇప్పుడు ఏం చెబుతాడన్నది ఆసక్తిగా మారింది.