మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల కోసం టాలీవుడ్లో హడావుడి ప్రారంభమయింది. గెట్ టు గెదర్ లాంటిపార్టీలు రెండు వర్గాలు ఇవ్వడం ప్రారంభించాయి. మొదటి నుంచి మా అధ్యక్ష పదవి కోసం గట్టిగా పోటీ పడుతున్న ప్రకాష్ రాజ్ సభ్యులందరికీ పార్టీ ఏర్పాటు చేసింది. భోజనాలు చేస్తూ మాట్లాడుకుందాం రమ్మని సభ్యులకుభారీ ఎత్తున ఆహ్వానాలు పంపారు. నిజానికి రెండు రోజుల ముందుగా ప్రకాష్ రాజ్ మా ప్రస్తుత అధ్యక్షుడు నరేష్ ఏర్పాటు చేసిన ఓ పార్టీపై విమర్శలు గుప్పించారు. తాగుతారు.. తింటారు అందులో తప్పేముందని వెటకారంగా మాట్లాడారు.
ఇప్పుడు ఆయనే అలాంటి పార్టీని ఏర్పాటు చేశారు. ఇదంతా రాజకీయం అనుకునేంతలో వీరికి పోటిగా బండ్ల గణేష్ కూడా రంగంలోకి దిగారు. అయితే ఇలా పార్టీలు ఇవ్వడం ఖర్చుతో కూడుకున్న పని అనుకున్నారేమో కానీ అసలు పార్టీ కల్చర్పైనే విమర్శలు ప్రారంభిచారు. కరోనా టైంలో అందర్నీ ఒక దగ్గరకు చేర్చడం మంచిది కాదని ఓట్లు అడగాలనుకుంటే ఫోన్లలో అడగాలని పిలుపునిచ్చారు. బండ్ల గణేష్ మొదట ప్రకాష్ రాజ్ ప్యానల్లో ఉన్నారు. తర్వాత ఆయనను తొలగించి జీవితా రాజశేఖర్ కు చోటిచ్చారు.
దీనిపై బండ్ల గణేష్ అసంతృప్తికి గురై తాను ఇండిపెండెంట్గా పోటీ చేస్తానని ప్రకటించారు. ఎవరేమన్నా పోటీ చేస్తానని సభ్యులకు డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇస్తానని చెబుతున్నారు. ఇలాంటి సమయంలో విందులపై తన వ్యతిరేకతను నేరుగా వ్యక్తం చేశారు. వచ్చే నెల పదో తేదీన మా ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఇంకా మంచు విష్ణు ప్యానెల్ ను ప్రకటించలేదు. అయితే ఆ వర్గం తరపున ప్రస్తుత అధ్యక్షుడు నరేష్ ఎక్కువ లీడ్ తీసుకుంటున్నట్లుగా కనిపిస్తోంది.