‘మా’ ఎన్నికల సంగ్రామానికి తెర లేచింది. అధ్యక్షపదవి ఎన్నికలకు ఈసారి పోటీ తప్పడం లేదు. శివాజీరాజా, నరేష్ మధ్య ఈసారి రసవత్తరమైన పోటీ జరగబోతోంది. నరేష్ శనివారం తన నామినేషన్ దాఖలు చేశారు. తన ప్యానెల్ నుంచి రాజశేఖర్ దంపతులని నిలబెట్టారు. మరోవైపు శివాజీ రాజా ప్యానల్ లోనూ పెద్ద పేర్లే కనిపిస్తున్నాయి. శ్రీకాంత్, ఎస్వీ కృష్ణారెడ్డి, పరుచూరి వెంకటేశ్వరరావు, బ్రహ్మాజీ.. ఇలా ఉద్దండులు కనిపిస్తున్నారు.
నిజానికి ఈసారి కూడా అధ్యక్షుడిని ఏకగ్రీవంగా ఎన్నుకోవాలన్నది చిత్రసీమలోని పెద్దల ఉవాచ. గత రెండేళ్లలో శివాజీరాజా పనితీరుని దగ్గరుండి గమనించినవాళ్లంతా…. మరోసారి శివాజీరాజాకే అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు. కానీ.. నరేష్ మాత్రం పోటీకి దిగడానికి సమాయాత్తం అయ్యాడు. చిరంజీవి కూడా నరేష్‌ని పిలిచి.. ‘శివాజీకి మరోసారి అవకాశం ఇద్దాం.. వచ్చే ఎన్నికలలో నిన్ను ఏకగ్రీవంగా ఎంపిక అయ్యేటట్టు నేను చూస్తా’ అని హామీ ఇచ్చినట్టు సమాచారం. కానీ నరేష్ మాత్రం చిరు మాటల్ని పట్టించుకోలేదని తెలుస్తోంది. ‘నాకు అవకాశం ఇస్తే ఇంకా బాగా పని చేసి చూపిస్తా’ అంటూ.. పోటీకి ‘సై’ అన్నాడు. అంతేకాదు. చిరంజీవిపై ఎప్పుడూ పోటీకి సిద్ధపడే జీవిత – రాజశేఖర్‌లను తన ప్యానల్లో చేర్చుకున్నాడు.
అయితే చిరంజీవితో పాటు, తెలుగు సినీ పెద్దల సహకారం పూర్తిగా శివాజీరాజా ప్యానల్‌కే ఉన్నట్టు సమాచారం. ఓ దశలో శివాజీ రాజా కూడా ‘ఈసారి నేను ఎన్నికల్లో పోటీ చేయను..’ అని పక్కకు తప్పుకోవాలని చూస్తే.. చిరంజీవి వారించినట్టు తెలుస్తోంది. ‘ఈ ఒక్కసారికి ఉండు..’ అని సర్దిచెప్పి, ఒప్పించారని.. తీరా చూస్తే నరేష్ పోటీకి దిగి ఓటింగ్ వరకూ తీసుకెళ్లాడు. ఈనెల 10న ‘మా’ ఎన్నికలు జరుగుతున్నాయి. చిరంజీవి సపోర్ట్‌తో శివాజీ టీమ్ గెలుస్తుందా? లేదంటే నరేష్ ప్యానల్ అనూహ్యమైన విజయాన్ని అందుకుంటుందా? అనేది ఆ రోజే తేలిపోనుంది.