`మా` అధ్యక్ష పదవికి ఇటీవల కాలంలోనే గట్టి డిమాండ్ ఏర్పడింది. రెండు మూడు దఫాలుగా… ఈ పీఠం కోసం పోరు గట్టిగా సాగుతోంది. అసెంబ్లీ ఎన్నికలను తలపించే రేంజులో.. వాగ్దానాలు, పొత్తులు, కుమ్ములాటలు. అసలు మామూలుగా లేదు వ్యవహారం. ఈసారీ అదే సీన్ రిపీట్ కానుంది. ప్రకాష్‌రాజ్, విష్ణు, జీవిత.. ముగ్గురూ పోటీకి సై అంటున్నారు. నిజానికి `మా` ఎన్నికలు ఇప్పట్లో లేవు. అక్టోబరులో `మా` ఎన్నికలు జరుగుతాయి. అంటే ఇంకా 4 నెలలుందన్నమాట. దాని కోసం ఇప్పటి నుంచే… `మా` లో రాజకీయాలు మొదలైపోవడం విడ్డూరంగా మారింది. ఇది వరకు ఎలక్షన్ షెడ్యూల్ వచ్చే ముందు మాత్రమే ఈ హడావుడి ఉండేది. ఇప్పుడు ఏకంగా… 4 నెలల ముందే తొందరపడుతున్నారంటే… `మా` ఎన్నికలను సినిమా వాళ్లు ఎంత సీరియస్ గా తీసుకుంటున్నారో అర్థం అవుతోంది.
ఈసారి `మా` ఎన్నికలలో నేను పోటీ చేస్తా అని ప్రకాష్ రాజ్ ఎప్పుడో ప్రకటించేశాడు. నిజానికి.. ఈ పోరు ప్రకాష్ రాజ్ ప్రకటనతోనే మొదలైంది. గత ఎన్నికలలో జరిగిన రభస అంతా ఇంతా కాదు. దాన్ని దృష్టిలో ఉంచుకునే ఈ సారి ఎన్నికల సెక్షనే ఉండకూడదని, అధ్యక్షుడిని ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని సినీ పెద్దలు అనుకున్నారు. ప్రకాష్ రాజ్ కి చిరు కాంపౌండ్ నుంచి మద్దతు ఉన్న నేపథ్యంలో.. ప్రకాష్ రాజ్ నే ఏకగ్రీవంగా ఎన్నుకుంటారన్న ప్రచారం జరిగింది. అయితే విష్ణు రంగంలోకి దిగి సీన్ మొత్తం మార్చేశాడు. ఎన్నికల హడావుడి ఇంకా మొదలు కాకుండానే.. విష్ణు తన మద్దతు కూడగట్టుకునే ప్రయత్నాలు మొదలెట్టాడు. ఇటీవల సూపర్ స్టార్ కృష్ణని కలుసుకున్నాడు. దానికి కారణం.. మా ఎన్నికలే. అసలు ఎలక్షన్ షెడ్యూలే లేదు.. అప్పుడే మంతనాలేంటి? అంటూ ఆశ్చర్యపోవడం సినీ జనాల వంతు అయ్యింది.
ఇంతలో జీవిత మేల్కోంది. తన పీఆర్ టీమ్ తో ఓ ఫీలర్ వదిలేటట్టు చేశారామె. `జీవిత కూడా మా ఎన్నికలలో నిలబడుతున్నారు` అంటూ.. ఓ వార్త బయటకు వచ్చింది. అది నిజం కూడా. జీవిత సైతం ఈసారి ఎన్నికలలో పాల్గొనడానికి డిసైడ్ అయ్యారు. మంచు ఫ్యామిలీ – జీవిత ఈసారి ఎన్నికలలో కలిసే పో్టీ చేస్తారని, విష్ణు ప్రెసిడెంట్ అయితే, జీవిత ఉపాధ్యక్షురాలిగా ఉంటారని మరో ప్రచారం జరుగుతోంది. నిజానికి ఈసారి ఎన్నికలే ఉండకూడదన్నది చిత్రసీమ ఉద్దేశ్యం. అటు విష్ణునీ, ఇటు ప్రకాష్‌రాజ్ నీ పిలిపించి మాట్లాడితే సమస్య తీరిపోతుందనుకున్నారు. కానీ మధ్యలో జీవిత కూడా.. పోటీకి సై అనడంతో.. ఈసారి కూడా ఎన్నికలు తప్పేట్టు లేవు. ఎన్నికలు జరిగి అధ్యక్షుడిని ప్రజాస్వామ్య పద్ధతిలో ఎంచుకోవడంలో తప్పులేదు. ఆ పేరుతో.. `మా`లో కొట్లాట మొదలైతేనే ప్రమాదం.