మా’ అధ్యక్షుడిగా ఈరోజు మంచు విష్ణు ప్రమాణ స్వీకారం చేసేశారు. ఆయనతో పాటు విష్ణు ప్యానల్ నుంచి గెలిచిన సభ్యులంతా ప్రమాణ స్వీకారం చేసి, అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి కొంతమంది సినీ ప్రముఖుల్ని మంచు విష్ణు స్వయంగా ఆహ్వానించాడు. నందమూరి బాలకృష్ణ ఇంటికి వెళ్లి.. ఆహ్వాన పత్రం అందించాడు. ప్రకాష్ రాజ్నీ పిలిచాడు. చిరంజీవికి కూడా ఆహ్వానం అందుతుందని అంతా ఆశించారు. కానీ.. చిరుని ఈ కార్యక్రమానికి పిలవలేదు. దాంతో ఆయన కనిపించలేదు. పిలిచినా.. బాలయ్య రాలేదు. ప్రకాష్‌రాజ్ తో పాటు, ప్రకాష్ రాజ్ ప్యానల్ లో గెలిచినవాళ్లెవరూ ఈ కార్యక్రమంలో కనిపించచలేదు.
ఈ కార్యక్రమానికి తెలంగాణ మాత్రం శ్రీనివాసయాదవ్ అధ్యక్షత వహించారు. ఆయన ఈ సందర్భంగా చిత్రసీమకు వరాలు ప్రకటిస్తారేమో అని అంతా అనుకున్నారు. `మా` బిల్డింగ్ స్థలం కోసం ఆయన నుంచి ఏదైనా మాట వస్తుందని ఆశించారు. కానీ అదీ లేదు. పైపెచ్చు ”ఇండ్రస్ట్రీలో ఉన్న హీరోలంతా ముందుకొచ్చి, తలా కొంత వేసుకుంటే సమస్య సమసిపోతుంది” అనే టైపులో మాట్లాడారు. అంటే.. `మా` బిల్డింగ్ కోసం ప్రభుత్వం ఏమీ ఇవ్వదన్నమాట. హీరోలే చేసుకోవాలన్నమాట. ప్రస్తుతానికి ఇంతే. మంచు విష్ణు.. చొరవ, ఉత్సాహం చూపి, ప్రభుత్వాన్ని, పెద్దల్నీ కదిలించగలిగితే తప్ప – `మా` బిల్డింగ్ కి అటు నుంచి సాయం అందదు.