Maa Nanna Superhero Movie Telugu Review
తెలుగు360 రేటింగ్: 2.5/5
-అన్వర్-
మలయాళ చిత్రాల ఎఫెక్ట్ మన తెలుగు సినిమాపై బాగానే పడింది. ఇది వరకు అక్కడ మాత్రమే పరిమితమైన కథలు… ఇప్పుడు టాలీవుడ్ కూ వస్తున్నాయి. కొన్ని ఎమోషన్స్ ని మన వాళ్లూ చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. ‘మా నాన్న సూపర్ హీరో’ అలాంటి సినిమానే. ఇది సినిమా అనేకంటే… నవల అంటే బెటరేమో. ఎందుకంటే ఓ నవల చదువుతున్న అనుభూతి, ఈ సినిమా చూస్తున్నప్పుడు కలుగుతుంది. సుధీర్‌బాబు తన బ్రాండ్ ఇమేజ్‌ని పూర్తిగా పక్కన పెట్టి చేసిన సినిమా ఇది. మరింతకీ ఈ ప్రయత్నం ఎలా సాగింది? సుధీర్ బాబు కష్టం ఫలించిందా?
ప్రకాష్ (సాయిచంద్) ఓ లారీ డ్రైవర్. భార్య ఓ బిడ్డని చేతిలో పెట్టి చనిపోతుంది. ఆ పిల్లాడి ఆలనా పాలనా ప్రకాష్‌దే. మూడ్రోజుల పని మీద లారీ ఎక్కి బయటూరు వెళ్లాల్సివస్తుంది. ఈ మూడ్రోజుల కోసం అనాథాశ్రమంలో తన బిడ్డని వదిలేసి వెళ్తాడు. అయితే అనుకోకుండా ఓ కేసులో చిక్కుకుపోవడం వల్ల ఇరవై ఏళ్లు జైల్లో ఉండిపోవాల్సివస్తుంది. అనాథ పిల్లాడికి జానీ (సుధీర్ బాబు) అని పేరు పెడుతుంది ఆశ్రమం. ఆ జానీని శ్రీనివాస్ (షాయాజీషిండే) దత్తత తీసుకొంటాడు. మొదట్లో జానీని ప్రేమగానే పెంచుతాడు. కానీ తన జీవితంలో కొని దురదృష్ట ఘటనలు జరుగుతాయి. అది జానీ రాక వల్లే అని భావించి, దత్త పుత్రుడిపై కోపం, ద్వేషం పెంచుకొంటాడు. కానీ జానీకి మాత్రం తన నాన్నే హీరో. తండ్రిని విపరీతంగా ప్రేమిస్తాడు. శ్రీనివాస్ స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టి బాగా నష్టపోతాడు. ఊరంతా అప్పులు చేస్తాడు. ఓ పొలిటీషియన్ దగ్గర కోటి రూపాయలు బాకీ పడిపోతాడు. అతని బారీ నుంచి తండ్రిని కాపాడుకోవడానికి జానీకి కోటి రూపాయలు అవసరమవుతాయి. ఈలోగా… ప్రకాష్ జైలు నుంచి విడుదల అవుతాడు. కానీ తన బిడ్డ ఎక్కడున్నాడో తెలీదు. అతన్ని వెదుక్కొంటూ ప్రయాణం ప్రారంభిస్తాడు. ప్రకాష్‌కు తన బిడ్డ జానీ దొరికాడా? జానీ తండ్రి కాని తండ్రిని కాపాడుకోవడానికి ఎలాంటి ప్రయత్నాలు చేశాడు? అనేది మిగిలిన కథ.
కథలో నావల్టీ ఉంది. కచ్చితంగా బరువున్న పాయింటే. ముందు వాక్యాల్లో చెప్పుకొన్నట్టు ఓ నవల రాయడానికి కావల్సినంత సరంజామా.. ఈ కథలో ఉంది. దాన్ని సినిమాగా తీద్దామనుకొన్నాడు దర్శకుడు. చేయని నేరం నెత్తి మీద వేసుకొని, కొడుక్కు దూరమైన ప్రకాష్ కథతో.. సినిమా మొదలవుతుంది. ఆ తరవాత… శ్రీనివాస్ – జానీ పాత్రలు తెరపైకి వస్తాయి. తన పెంపుడు తండ్రంటే జానీకి ఎంత ఇష్టమో తొలి సన్నివేశాల్లో చూపించేశాడు దర్శకుడు. శ్రీనివాస్ కు తన దత్త పుత్రుడు అంటే ఉండే అయిష్టత కూడా బాగానే తెరపైకి తీసుకొచ్చాడు. నిజానికి ఆవారాగా తిరిగే కొడుకు, బాధ్యతలు చెప్పే తండ్రి… మన కథలు ఇలానే సాగుతాయి. కానీ ‘మా నాన్న సూపర్ హీరో’ కోసం ఈ థీమ్ రివర్స్ చేశారు. అప్పులు చేసే తండ్రి, వాటిని తీర్చే కొడుకు కథ ఇది. తండ్రికి కొడుకు బాధ్యతలు గుర్తు చేస్తుంటాడు. ఆ పాయింట్ వెరైటీగా కనిపిస్తుంది. ఎప్పుడైతే… ప్రకాష్ పాత్ర ఎంటరైందో అప్పట్నుంచి డ్రామా మొదలవుతుంది. కోటిన్నర లాటరీ, దాన్ని లాక్కోవడానికి కొన్ని పాత్రలు చేసే ప్రయత్నాలు, తండ్రిని కాపాడుకోవడానికి కొడుకు పడే తాపత్రయం.. ఇదంతా సెకండాఫ్ కోసం అట్టిపెట్టుకొన్న అంశాలు.
ఫస్టాఫ్‌లో కథేమిటన్న విషయంలో క్లారిటీ వస్తుంది. కాన్ఫ్లిక్ట్ ఏమిటో అర్థమైపోతుంది. స్లో నేరేషన్ ఇబ్బంది పెట్టినా, ఇలాంటి కథలకు కొన్ని పరిమితులు ఉంటాయి కాబట్టి, అర్థం చేసుకోవొచ్చు. ఈ తరహా చిత్రాలకు సెకండాఫ్ చాలా కీలకం. అయితే కీలకమైన ఈ పార్ట్ దగ్గర దర్శకుడు తడబడ్డాడు. ద్వితీయార్థంలో కథ మొత్తం లాటరీ, దాన్నుంచి వచ్చే కోటిన్నర… దీని చుట్టూనే తిరుగుతుంది. అక్కడ తండ్రీ కొడుకుల ఎమోషన్ మిస్సయి, క్రైమ్ డ్రామాగా టర్న్ తీసుకొంటుంది. డబ్బు కనిపించగానే మనుషుల్లోంచి బయటకు వచ్చే స్వార్థం, కుట్రలూ తెరపై ప్రత్యక్షమవుతాయి. ప్రకాష్ – జానీల ట్రావెల్ లో కొన్ని భావోద్వేగ సంఘటనలు జరిగితే డ్రామా మరింత రక్తి కట్టేది. ఆ ప్రయాణంలో ఎలాంటి మజా ఉండదు. ఎమోషన్ కనిపించదు. మధ్యలో రాజు సుందరం పాత్రని తీసుకొచ్చి, కాస్త ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలని ప్రయత్నించారు. అది కూడా అతకలేదు. అసలు ఆ ఎపిసోడ్ ఉన్నా, లేకపోయినా ఈ కథ మారదు. కేవలం సన్నివేశాల్ని పొడిగించడానికి, ఒక పాట వాడుకోవడానికీ తప్పితే.. ఎందుకూ ఉపయోగపడలేదు. చివరి 20 నిమిషాలూ ఎమోషనల్ పిండేయాలని చూశాడు. కానీ అక్కడా వర్కవుట్ కాలేదు. క్లైమాక్స్ ని సింపుల్ గా తేల్చేసినట్టు అనిపిస్తుంది. అయితే క్లైమాక్స్ కు ముందు సాయిచంద్, సుధీర్ బాబు మధ్య నడిచిన డ్రామా కాస్త బెటర్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. అలాంటి సన్నివేశాలు ఒకట్రెండు పడి ఉంటే… దర్శకుడి లక్ష్యం నెరవేరేది.
సుధీర్ బాబు సినిమాలు చాలామట్టుకు యాక్షన్ ప్రధానంగా సాగుతాయి. అయితే… తొలిసారి ఓ ఎమోషన్ డ్రామాని ఎంచుకొన్నాడు. తన వరకూ ఇది కొత్త తరహా సినిమా. తండ్రి ప్రేమ కోసం ఆరాటపడే తనయుడిగా బాగా నటించాడు. కొన్ని ఎమోషన్ సీన్స్‌లో చక్కగా చేశాడు. షాయాజీషిండేని ఈ తరహా పాత్రలో చూడడం కొత్తగా అనిపిస్తుంది. పాత్రకు కట్టుబడి నటించాడు. అయితే ఈ పాత్ర పరిధిని ఇంకాస్త పెంచి, ఎమోషన్ జోడిస్తే బాగుండేది. సాయిచంద్ పాత్ర కూడా చాలా కీలకం. ఎమోషన్ కంటెంట్ అంతా ఆ పాత్ర చుట్టూనే మేళవించాడు దర్శకుడు. చివర్లో సాయిచంద్ – సుధీర్ ల మధ్య సీన్ ఇంకాస్త బాగా డీల్ చేయాల్సింది. ఆ స్కోప్ కథలో, ఆ పాత్రల్లో ఉంది. కానీ దర్శకుడెందుకో ఆ కోణంలో ఆలోచించలేకపోయాడు. ఈ మూడు పాత్రలే కథకు కీలకం. కథానాయిక ఉన్నా లేనట్టే. అసలు ఆ పాత్రని ఎందుకు ప్రవేశ పెట్టారో, మధ్యలోనే ఎందుకు ముంబై పంపించేశారో అర్థం కాదు.
ఎమోషన్ కంటెంట్ ఉన్న కథ ఇది. అయితే.. దర్శకుడు పేపర్ పై రాసుకొన్న భావోద్వేగాలు తెరపై తర్జుమా చేయడంలో కాస్త తడబడ్డాడు. కాకపోతే.. ఇలాంటి కథ చెప్పాలి, చెప్పొచ్చు అనుకొన్న తన ధైర్యాన్ని, ప్రయత్నాన్నీ మెచ్చుకోవాలి. ఎక్కడా కథ పక్కదారి పట్టలేదు. చెప్పాలనుకొన్న పాయింట్ చెప్పాడు. అసభ్యతకు తావు లేకుండా చూసుకొన్నాడు. మనసునీ, మనిషినీ కదిలించే సన్నివేశాలు కాస్త కొరవడ్డాయి. లేదంటే కచ్చితంగా ‘మా నాన్న సూపర్ హీరో’ ఉత్తమ చిత్రంగా నిలిచేది.
తెలుగు360 రేటింగ్: 2.5/5
-అన్వర్-