కరోనా వల్ల అస్తవ్యస్థమైన వ్యవస్థను తమ వంతుగా చెక్కదిద్దేందుకు, పేద వాళ్లకు సహాయం చేసేందుకు, ప్రభుత్వానికి ఉడతాభక్తి సహాయం అందించేందుకు హీరోలు కదిలివస్తున్నారు. విరాళాలు ప్రకటిస్తున్నారు. సినీ కార్మికుల కన్నీళ్లు తుడవడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ.. ఈ విషయంలో ముందుండాల్సిన `మా` మాత్రం ఉందో, లేదో అర్థం కావడం లేదు. పేద కళాకారులకు అండగా నిలబడాల్సిన బాధ్యత ‘మా’పై ఉంది. వ్యక్తిగతంగా ఒకరో, ఇద్దరో ముందుకొచ్చి, నిత్యావసర వస్తువుల్ని అందించడానికి ప్రయత్నిస్తుంటే, ఓ వ్యవస్థగా ఉండి, `మా` ఏమీ చేయలేకపోతోంది
అధ్యక్షుడు నరేష్ సెలవుల్లో ఉంటే, ఆ స్థానంలోకి వచ్చిన బెనర్జీ మాత్రం సందేశాలకు పరిమితమయ్యారు. కరోనా రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వీడియోల రూపంలో చెబుతూ వస్తున్నారు తప్పితే… `మా` తన వంతుగా ఏం చేయబోతోందో? రెక్కాడితే గానీ డొక్కాడని పేద నటీనటుల కోసం ఏం చేయాలనుకుంటుందో చెప్పలేదు. అలాగని `మా` దగ్గర నిధులు లేవా? అంటే ఉన్నాయి. కానీ వాటిని ఎలా వాడాలో, ఎవరి కోసం వాడాలో తెలియడం లేదంతే. `మా` అనే కాదు, ఛాంబర్ పరిస్థితి కూడా ఇంతే. ఛాంబర్ సైతం తన వంతుగా కదిలి రావాల్సిన బాధ్యత ఉంది. లైట్ బోయ్స్ దగ్గర నుంచి జూనియర్ ఆర్టిస్టుల వరకూ అంతా ఈ లాక్ డౌన్లో ఎన్నో సమస్యలు ఎదుర్కుంటున్నారు. వీటిలో చాలామంది తినడానికి తిండి లేక ఇబ్బంది పడుతున్నారు. వీరందరికోసం `మా`, నిర్మాత మండలి కలిసి కట్టుగా ఏదైనా చేస్తే మంచిది.