‘మా’ ఎన్నికల ముహూర్తం దగ్గర పడే కొద్దీ.. అటు నరేష్ వర్గం, ఇటు శివాజీ రాజా వర్గం అమ్ముల పొదిలో దాగున్న ప్రధాన అస్త్రాలను ఒకొక్కటిగా సంధిస్తున్నారు. ‘మా’ కమిటీలో అవకతవకలు జరిగాయని, నిధుల దుర్వినియోగం జరుగుతోందని, ‘మా’ పరువు బజారుకీడ్చేలా కొన్ని ఘటనలు జరిగాయని ఇటీవల జీవిత రాజశేఖర్ ఆరోపించారు. నరేష్ కూడా కొన్ని ఘాటైన విమర్శలు చేస్తున్నాడు.
ఇప్పుడు శివాజీ రాజా వాళ్లందరికీ ఓ కౌంటర్ ఇచ్చాడు. ”మేమంతా స్వచ్ఛమైనవాళ్లం. ఏ తప్పూ చేయలేదు. `మా` అధ్యక్షుడిగా రెండోసారి పోటీ చేయడం నాకేమాత్రం ఇష్టం లేదు. కానీ అందరూ ఈసారికి పోటీ చేయమని బలవంతం చేశారు. అందుకే… నిలబడ్డాను. ఇటీవల కొంతమంది నాపై ఆరోపణలు చేశారు. వాటికి సమాధానం చెప్పకపోతే అవే నిజం అనుకునే ప్రమాదం ఉంది. అందుకే ఇలా మాట్లాడాల్సివస్తోంది. ఎవరైనా మీడియా ముందుకొచ్చేటప్పుడు నిజాలు తెలుసుకుని మాట్లాడితే మంచిది. మేం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చూసి మాకు ఓటేయండి” అన్నారు. అంతేకాదు… నరేష్ వైఖరిపై ఆయన తొలిసారి పెదవి విప్పారు.
చిరంజీవి ఆధ్వర్యంలో `మా` నిధుల కోసం ఓ కార్యక్రమం తలపెట్టినప్పుడు నరేష్ పిలిచినా రాలేదని, అప్పుడు శ్రీకాంత్ ఇచ్చిన ప్రోత్సాహంతో ఆ కార్యక్రమాన్ని పూర్తి చేయగలిగామని గుర్తు చేశాడు శివాజీరాజా. ‘మా’లోని ప్రతి సభ్యుడి పుట్టిన రోజున.. ఆ సభ్యుడ్ని కలిసి, పుష్షగుచ్ఛం ఇచ్చి అభినందించడం ఓ రివాజుగా మార్చామని, అయితే తన పుట్టిన రోజున నరేష్ తనని అవమానించాడని వ్యాఖ్యానించారు శివాజీ రాజా.
”పుట్టిన రోజున ఫోన్ చేసి కలుద్దామన్నాడు నరేష్. తన కోసం ఛాంబర్‌కి వెళ్లి చాలాసేపు ఎదురుచూశా. కానీ నరేష్ రాలేదు. ఈలోగా మరో వ్యక్తికి నరేష్ ఫోన్ చేసి `చూశావా.. పుట్టిన రోజున నా కోసం శివాజీ రాజాని ఎదురు చూసేలా చేశాను. అదీ నా స్థాయి` అని మాట్లాడాడట” అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అవమానాలు భరించలేక.. ఇంట్లోవాళ్లు ఈ ఎన్నికల్లో పోటీ చేయొద్దని చెప్పారని, అయితే కేవలం తాను మొదలెట్టిన కొన్ని అభివృద్ది కార్యక్రమాలు మధ్యలోనే ఆగిపోతాయన్న కారణంతోనే తాను మళ్లీ పోటీ చేయాల్సివచ్చిందని కన్నీటి పర్యంతం అయ్యాడు శివాజీ రాజా.