తమిళంలో శింబు చేసిన సినిమా `మానాడు`. తెలుగులో `లూప్` పేరుతో డబ్ చేశారు. కానీ కొన్ని కారణాల వల్ల అది విడుదల కాలేదు. అయితే… `మానాడు` తమిళంలో మంచి ఆదరణ చొరగొంది. శింబుకి చాలా కాలం తరవాత ఓ హిట్టు అందించింది. ఇప్పుడు ఈ సినిమాని గీతా ఆర్ట్స్ తెలుగులో రీమేక్ చేయాలనుకుంటోంది. అల్లు శిరీష్ కోసం. తమిళంలో ఎస్.జె.సూర్య విలన్ గా నటించాడు. ఆ పాత్ర కోసం ఓ వెటరన్ హీరో కోసం ట్రై చేస్తున్నారు. ఆ హీరో దొరగ్గానే… ఈ సినిమా రీమేక్ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తారు. అయితే దర్శకత్వ బాధ్యతలు ఎవరికి అప్పగించాలన్నదే పెద్ద ప్రశ్న. తమిళంలో ఈ చిత్రానికి వెంకట్ ప్రభు దర్శకుడు. తనతోనే తెలుగులోనూ రీమేక్ చేయించాలని గీతా ఆర్ట్స్ చూస్తోంది. ఎందుకంటే… ఇది చాలా క్లిష్టమైన సబ్జెక్ట్. టైమ్ లూప్ నేపథ్యంలో సాగుతుంది. టైమ్ లూప్ కోణంలో కొన్ని కథలొచ్చినా. వెంకట్ ప్రభు ఇందులోని విశ్వరూపం మొత్తం చూపించేశాడు. కాబట్టి.. తను మాత్రమే ఈ కథకు న్యాయం చేయగలడు అనిపిస్తోంది. మరి వెంకట్ ప్రభు ఏమంటాడో?