పవన్ కల్యాణ్‌లో చాలా కళలున్నాయి. దర్శకుడు, కొరియోగ్రాఫర్, రచయిత, గాయకుడు. పవన్‌కి జానపదాలంటే చాలా ఇష్టం. తన సినిమాల ద్వారా జానపద గేయాల్ని అభిమానుల్లోకి తీసుకెళ్తుంటాడు. తన గొంతుకు సూటయ్యే పాటల్నే ఎంచుకొంటూ, గాయకుడిగా తనని తాను సంతృప్తి పరచుకొంటాడు. పవన్ పాడిన పాటలన్నీ దాదాపుగా హిట్టే. ఇప్పుడు పవన్ నుంచి మరో గీతం వచ్చింది. అదే.. ‘మాట వినాలి’. హరి హర వీరమల్లు కోసం ఈ గీతాన్ని పవన్ ఆలపించారు. కీరవాణి స్వర పరచిన ఈ గీతాన్ని పెంచెల దాస్ రాశారు.
ట్యూన్ సింపుల్ గా ఉంది. ఎవరైనా పాడుకొనేలా ఈ గీతాన్ని ట్యూన్ చేశారు కీరవాణి. వాయిద్యాల హోరు లేకుండా సింపుల్ గా సాగిపోయిన పాట ఇది.
”మాట వినాలి. గురుడా మాట వినాలి
మాట వినాలి మంచి మాట వినాలి
ఉత్తది గాదూ మాట తత్తర పడకా
చిత్తములోనా చిన్న ఒద్దికుండాలి” ఇలా మొదలైన గీతమిది.
”ఈతమాను ఇల్లు గాదు
తాటి మాను తావు గాదు
తగిలినోడు మొగుడు గాదు
తగరమూ బంగారుగాదు” అంటూ తత్వం బోధించాడు వీరమల్లు.
మాట దాటిపోతే
మర్మము తెలియకపోతే
పోగరుబోతు తగురుపోయి
కొండను తాకీనట్టు – అనే చరణంలో వెతుక్కుంటూ చాలా చాలా అర్థాలు వినిపిస్తాయి, కనిపిస్తాయి.
ఈ చిత్రానికి దాదాపు 80 శాతం క్రిష్ దర్శకుడు. మిగిలిన 20 శాతాన్ని జ్యోతికృష్ణ పూర్తి చేస్తున్నారు. ఏప్రిల్ లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం హైదరాబాద్ లో చిత్రీకరణ జరుగుతోంది. బాబీ డియోల్ పై కొన్ని సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. మరో 25 రోజుల వరకూ షూటింగ్ బాకీ వుంది.