మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ముందస్తు బెయిల్ వచ్చినా బయటకు రాలేదు. కనీసం తమ మీడియాతోనూ ఆయన మాట్లాడలేదు. దీంతో ఆయన దేశం దాటిపోయింది నిజమేనేమో అన్న అనుమానంతో ఆయన వర్గీయులు ఉన్నారు. ఈవీఎం ధ్వంసం కేసును ఈసీ చాలా సీరియస్ గా తీసుకుంది. అరెస్టు తప్పదనుకున్న సమయంలో పోలీసులతో కలిసి ఆడిన గేమ్ ను రెండు రోజుల పాటు సాగించి హైకోర్టులో ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. ఈ క్రమంలో ఆయన లొంగిపోతారన్న ప్రచారాన్ని కూడా చేసుకున్నారు. కానీ అంతా స్క్రిప్ట్ ప్రకారం జరిగినట్లుగా ఆయనకు బెయిల్ వచ్చేసింది. కానీ ఆయన బయట కనిపించడం లేదు.
హైకోర్టు బెయిల్ మంజూరు చేస్తూ కీలక షరతులు పెట్టింది. అందులో అసలు మాచర్ల వెళ్లకూడదన్న షరతులు ఉంది. కౌంటింగ్ రోజున.. కౌంటింగ్ కేంద్రానికి మాత్రం వెళ్లే అవకాశం కల్పించింది. అలాగే కేసుల్లో ఉన్న సాక్షులతో మాట్లాడటం, బెదిరించడం వంటివి చేయకూడదని స్పష్టం చేసింది. అన్నింటికి మించి కేసు విషయంపై మీడియాకు ఇంటర్యూలు ఇవ్వవొద్దని కూడా షరతులు పెట్టింది. అందుకే ఆయన మీడియాతో మాట్లాడటం లేదన్న చర్చ నడుస్తోంది. అయితే పిన్నెల్లి దేశంలో ఉంటే.. ఆయనతో ఆ కేసు గురించి కాకుండా చంద్రబాబు, బ్రహ్మారెడ్డిలను తిట్టించేందుకైనా మైక్‌ను తీసుకుని ఆయన దగ్గరకు పోయే వారన్న వాదన ఉంది.
పిన్నెల్లికి తాత్కలిక ఊరట మాత్రమే లభించింది. పదిహేనో తేదీ ఉదయం పది గంటల వరకు మాత్రమే అరెస్టు నుంచి మినహాయింపు ఇచ్చింది. తదుపరి విచారణ పదహారో తేదీకి వాయిదా వేసింది. పదిహేనో తేదీ ఉదయం పది గంటల తర్వాత ఆయనను అరెస్టు చేసుకునే వెసులుబాటు ఉందని లాయర్లు చెబుతున్నారు. ఏపీలో ప్రభుత్వం మారకపోతే ఆయన ఎన్ని అరచకాలు చేసుకున్నా ఏ వ్యవస్థా కాపాడలేదు.. కానీ ప్రభుత్వం మారితే మాత్రం.. ఆయన తనను తాను కాపాడుకోవాడనికి .. జైళ్ల నుంచి తప్పించుకోవడానికి చాలా కాలం పరారీలో ఉండాల్సి రావొచ్చన్న అభిప్రాయం వినిపిస్తోంది.