Macherla Niyojakavargam movie review telugu
తెలుగు360 రేటింగ్ :1.75/5
పాండమిక్ తర్వాత థియేటర్ సినిమా ఈక్వేషన్ మొత్తం మారిపోయింది. ఎలాంటి సినిమాలకు ప్రేక్షకులు థియేటర్ కి వస్తున్నారో తలపండిన ఇండస్ట్రీ జనాలకు కూడా అర్ధం కావడం లేదు. అయితే గత వారం విడుదలైన సీతారామం, బింబిసార కొత్త ఊపిరిని ఇచ్చాయి. ఒకటి వింటేజ్ రొమాన్స్, మరోటి సోషియో ఫాంటసీ. ఈ రెండిటికి ప్రేక్షకుల ఆదరణ లభించింది. ఇప్పుడు హీరో నితిన్ ‘మాచర్ల నియోజికవర్గం’తో కమర్షియల్ సినిమా వంతు వచ్చింది. టీజర్, ట్రైలర్ తో ఇది పక్కా కమర్షియల్ సినిమానే అనే సంగతి అర్ధమైయింది. ఇక సినిమా యూనిట్ కూడా … మాస్, క్లాస్, ఫ్యామిలీ, కామెడీ, యాక్షన్ ఇలా ఏ ఎలిమెంటు వదలకుండా పక్కా కమర్షియల్ ప్యాకేజీ అంటూ ప్రచారం చేసింది. మరి అన్ని కమర్షియల్ హంగులతో తయారైన ‘మాచర్ల నియోజికవర్గం’లోకి ఎంటరైతే..
రాజప్ప(సముద్రఖని) మాచర్ల నియోజికవర్గ ఎమ్మెల్యే. గత ముఫ్ఫై ఏళ్లుగా రాజప్పనే ఏకీగ్రీవం. ఐతే జన బలంతో కాదు.. తన కండబలంతో, రౌడీయిజంతో మాచర్ల ప్రజలని భయపెట్టి జనాలు ఓటు వేయాలంటే వణికిపోయే భీభత్సం సృష్టిస్తుంటాడు రాజప్ప. సిద్దార్ద్ రెడ్డి (నితిన్) సివిల్స్ లో టాప్ ర్యాంకర్. కలెక్టర్ పోస్టింగ్ కోసం వెయిట్ చేస్తుంటాడు. స్వాతి (కృతిశెట్టి) ఒక పనిమీద వైజాగ్ వస్తుంది. సిద్దు పక్కింట్లోనే దిగుతుంది. స్వాతి ఫస్ట్ సైట్ లోనే సిద్దుకి పిచ్చిపిచ్చిగా నచ్చేస్తుంది. స్వాతినే పెళ్లి చేసుకోవాలని ఫస్ట్ సైట్ లోనే డిసైడైపోతాడు సిద్దు. స్వాతి తను వచ్చిన పని పూర్తి చేసుకొని సొంత ఊరు మాచర్లకి వెళ్ళిపోతుంది. స్వాతి కోసం బయలుదేరిన సిద్దు.. మాచర్లలో అడుగుపెట్టిన సమయంలోనే వీరా (సముద్రఖని) గ్యాంగ్ స్వాతిని చంపడానికి తరుముకువస్తుంటుంది. దాంతో వీరాని చితక్కొడతాడు సిద్దు. అసలు స్వాతిని చంపాలని వీరా ఎందుకు ప్రయత్నించాడు . వీరా ఎవరు ? స్వాతి ఏం పనిమీద వైజాగ్ వచ్చింది? తన కొడుకుని కొట్టిన సిద్దుపై రాజప్ప రియాక్షన్ ఏమిటి ? సిద్దు గుంటూరు కలెక్టర్ గా పోస్టింగ్ తీసుకున్నాక మాచర్ల నియోజక వర్గంలో ఎన్నికలు జరిపాడా లేదా ? అనేది మిగతా కథ.
కమర్షియల్ సినిమా అంటే నాలుగు పాటలు, ఐదు ఫైట్లు, కొన్ని కామెడీ సీన్లు, చివర్లో ఒక సందేశం పడేస్తే చాలనుకునే ఆలోచనతో తీసిన సినిమా… ఈ మాచర్ల నియోజికవర్గం. ఇలాంటి ప్యాకేజీతో వచ్చిన చాలా సినిమాలు అపజయం మూటకట్టుకున్నప్పటికీ మళ్ళీ అదే రొటీన్ రొడ్డకొట్టుడు ఫార్ములాతో సీన్లు అల్లుకొని థియేటర్లో ప్రేక్షకులని నిద్రపుచ్చిన చిత్రమిది. ఒక్క మెతుకుతో అన్నం ఉడికిందో లేదో చెప్పొచ్చు. అలాగే మాచర్లలో హీరో ఎంట్రీ సీన్ తోనే సినిమా జాతకం తెలిసిపోతుంది. అమ్మాయిలని ఏడిపిస్తూ ఒక బ్యాచ్. ఆ బ్యాచ్ ని చావగ్గొట్టి హీరో ఎంట్రీ. వెంటనే ఫస్ట్ సాంగ్.. ”ఏ కాలంలోని సినిమారా బాబు”అని అరవాలనిపిస్తుంది. హీరో ఇందులో సివిల్స్ టాపర్. అతడి ఫస్ట్ డైలాగ్ ఏమిటంటే.. ”నాకు జీబీ ఎక్కువ” అంటాడు. వెంటనే ఒకతను అతని బ్యాక్ కి చూస్తాడు. ”నీవు అనుకుంటున్న జీబీ కాదు.. జీబీ అంటే గర్ల్స్ విషయంలో బాధ్యత” చెప్తాడు హీరో. ఈ డైలాగ్ విన్న వెంటనే ఇతగాడు సివిల్స్ టాపరా ? అని తలపట్టుకోవాలనిపిస్తుంది.
హీరో పరిచయం ఎంత రొటీన్ గా ఉంటుందో తర్వాత వచ్చే సీన్స్ కూడా అంతే పరమ రొటీన్ అనిపిస్తాయి. ఇదంతా టైం పాస్ వ్యవహారమని ప్రేక్షకుడికి అర్ధమైపోతుంది. పోనీ ఆ టైం పాస్ అయినా పాసైపోయిందా అంటే అదీ లేదు. లవ్ కామెడీ, లవ్ ట్రాక్ పండలేదు. ఫస్ట్ హాఫ్ అంతా అనవసరమైన వ్యవహారం అనిపిస్తుంది. హీరో మాచర్ల వచ్చిన తర్వాత కొత్తగా ఏదైనా చూపిస్తారా అంటే అక్కడ కూడా నిరాశే . రొటీన్ హీరో విలన్ వార్ లా అడుగుకో ఫైట్ అన్నట్టు ముగించేశారు. ఒక కలెక్టర్ చొరవ తీసుకొని ఎన్నికలు జరపడం అనే పాయింట్ బావుంది. కానీ దాన్ని తెరపైకి తీసుకొచ్చిన విధానం ఏ మాత్రం ఆకట్టుకోదు. కలెక్టర్ని కాస్త మాస్ హీరోలా వీధిలోకి తీసుకొచ్చి.. ఫైటింగులు చేయించేస్తే ఇక ఈ సినిమాలో హీరో కలెక్టర్ అయినా, కాకపోయినా పెద్ద తేడా ఉండదు. ఆ స్థానంలో హీరో తన తెలివి తేటల్ని ఉపయోగించి, విలన్ ని చిత్తు చేస్తే.. కాస్త డీసెంట్ సినిమా అయ్యుండేది.
నితిన్ ఎనర్జిటిక్ గా వున్నాడు. ఐతే అతడి పాత్రకి బాడీ లాంగ్వేజ్ కి అస్సలు మ్యాచ్ కాలేదు . డ్యాన్సులు ఫైట్లు జోష్ గా చేశాడు. కృతి శెట్టి అందంగా వుంది కానీ ఆ పాత్ర బాడీ లాంగ్వేజ్ ఏమిటో కానీ హాస్పిటల్ బెడ్ మీద సెలైన్ ఎక్కించుకుంటున్నట్లు నీరసంగా వుంది. కేథరిన్ పాత్ర అయోమయంగా వుంటుంది. ఆ పాత్ర కేవలం ఎక్స్ట్రా లగేజీ మాత్రమే. సముద్రఖని తన అనుభవం చూపించారు. డీసెంట్ విలన్ గా ఆకట్టుకున్నారు. వెన్నెల కిషోర్, శ్యామల ట్రాక్ వర్క్ అవుట్ కాలేదు. పైగా కాస్త ఇన్ డీసెంట్ గా వుంది. మురళీ శర్మ, రాజేంద్ర ప్రసాద్ పాత్రలు ప్రభావాన్ని చూపలేదు. మిగతా వారి కోసం పెద్దగా చెప్పుకోవాడానికి ఏమీ లేదు.
నిర్మాణ విలువలు డీసెంట్ గా వున్నాయి. ప్రసాద్ మూరేళ్ళ కెమెరాపనితనం నీట్ గా వుంది. ఫైట్ మాస్టర్ బాగానే కష్టపడ్డారు. దర్శకుడే ఎడిటర్. ఫస్ట్ హాఫ్ లో చాలా బాగం ట్రిమ్ చేసే అవకాశం వుంది. సాగర్ అందించిన నేపధ్య సంగీతం బావుంది కానీ పాటలు ఆకట్టుకోవు. రారా రెడ్డి పాటలో రానురాను బిట్ ఊపుతెచ్చింది. కొన్ని డైలాగ్స్ నాసిరంగా వున్నాయి. దర్శకుడు రాజశేఖర్ రెడ్డి తన తొలి సినిమాతోనే కమర్షియల్ డైరెక్టర్ అవ్వాలని రెగ్యులర్ కొలతలు వేసుకుని మరీ ఓ రొటీన్ సినిమా తీశాడు. అయితే ఒక కమర్షియల్ సినిమా ఎలా వుండకూడదో అనడానికి ఉదాహరణగా మిగిలిపోయింది మాచర్ల నియోజక వర్గం.
ఫినిషింగ్ టచ్: ప్రేక్షకులు గల్లంతు
తెలుగు360 రేటింగ్ :1.75/5