MAD Square Movie Review
తెలుగు360 రేటింగ్: 2.5/5
చిన్న సినిమాల్లో మంచి విజయం సాధించింది మ్యాడ్. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన కాలేజ్ కుర్రాళ్ళ కథ కావాల్సినంత కామెడీని పంచింది. దీంతో మ్యాడ్ 2పై ఆసక్తి ఏర్పడింది. ప్రమోషనల్ కంటెంట్ కూడా మంచి బజ్ క్రియేట్ చేసింది. మరి అన్ని రకాలుగా పాజిటివ్ వైబ్ తో విడుదలైన మ్యాడ్ 2 అంచనాలు అందుకుందా? ఈ క్రేజీ ఫ్రెండ్షిప్ ఈసారి ఎలాంటి నవ్వులు పంచింది?
మనోజ్(రామ్ నితిన్), అశోక్ (నార్నె నితిన్), దామోదర్(సంగీత్ శోభన్). కాలేజీ రోజుల్లో ‘మ్యాడ్’ బ్యాచ్ గా అల్లరి చేసిన ఈ ముగ్గురు దోస్తులు మరో దోస్త్ లడ్డు(విష్ణు) పెళ్లికి వెళ్తారు. లడ్డుని పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయి హ్యాండ్ ఇస్తుంది. ఆ బాధ నుంచి బయటపడటానికి ఫ్రెండ్స్ అందరూ గోవా ట్రిప్ కి వెళ్తారు. గోవా మ్యుజియంలో జరిగిన ఓ చోరీ ఈ మ్యాడ్ బ్యాచ్ మెడకి చుట్టుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందనే మిగతా కథ.
‘మ్యాడ్’ సిల్లీ స్మార్ట్ టైం పాస్ మూవీ. చెప్పుకోవడానికి కథ, కథనం అంటూ ఏమీ వుండదు కానీ స్నేహితుల మధ్య జరిగే సరదా సన్నివేశాలు, కాలేజ్ నేపధ్యం, అక్కడ చిన్ని చిన్ని ప్రేమ కథలు.. కావల్సినంత కాలక్షేపాన్ని పంచాయి. మ్యాడ్ 2ని కూడా దర్శకుడు కళ్యాణ్ శంకర్ అదే ఫార్ములాతో అల్లుకున్నాడు. ఒక చిన్న లైన్ చుట్టూ సరదా సన్నివేశాలు డిజైన్ చేసి నవ్వించే ప్రయత్నం చేశాడు. అయితే మ్యాడ్ లో ఉన్నంత సహజమైన వినోదం ఇందులో కొరవడిన భావన కలుగుతుంది. నవ్వులు వున్నాయి కానీ చాలా చోట్ల బలవంతంగా అతికించినట్లుగా అనిపిస్తాయి.
తీహార్ జైల్లో కథని ఓపెన్ చేసి లడ్డు పాత్ర తన ఫ్రెండ్స్, పెళ్లి గురించి చెప్పే ఆరంభ సన్నివేశాలు మరీ అంత హిలేరియస్ గా వుండవు. దామోదర్ సర్పంచ్ ట్రాక్ పండలేదు. కోర్ట్ లో అశోక్, మనోజ్ బ్యారర్ ఎంట్రీలు కూడా సోసోగానే వుంటాయి. అయితే ఈ ముగ్గురు లడ్డు పెళ్లికి వచ్చాక ఫన్ అందుకుంటుంది. ఆ ఎపిసోడ్ అంతా లడ్డుని కార్నర్ చేసి ఆటపట్టించేలా వుంటుంది. ముఖ్యంగా అమ్మాయి హ్యాండ్ ఇచ్చే విధానం, తర్వాత లడ్డుకి ఎదురయ్యే పరిస్థతి గమ్మత్తుగా వుంటుంది.
కథ గోవాకి షిఫ్ట్ అయిన తర్వాత సత్యం రాజేష్ పాత్ర ఎంటర్ కావడంతో ఫన్ మరింత ఆశిస్తాడు ప్రేక్షకుడు. అయితే ఆ పాత్ర చుట్టూ అల్లుకున్న కామెడీ మాత్రం అంత నేచురల్ గా రాలేదు. లైలా (ప్రియాంక జావల్కర్) ట్రాక్ కూడా అంతగా నప్పలేదు. భాయ్ గా చేసిన సునీల్ పాత్రని మాత్రం ఆసక్తికరంగానే రాసుకున్నారు. మురళీధర్ గౌడ్, సునీల్ కి మధ్య వచ్చే సన్నివేశాలు నవ్వులు పంచుతాయి.
మ్యాడ్1 లో గుర్తుపెట్టుకునే పాత్రలు అంటోనీ, శివ(డార్క్). ఈ రెండు పాత్రలకు సెకండ్ పార్ట్ లో మళ్ళీ స్కోప్ ఇచ్చారు. అంటోనీ రూపంలో ఓ రెండు జోకులు పేలాయి. ముఖ్యంగా పోకిరి ట్విస్ట్ సీన్ హిలేరియస్ గా వచ్చింది. అది అశోక్ క్యారెక్టర్ కి షిఫ్ట్ అవ్వడం మాత్రం అంతగా అతకలేదు. డార్క్ క్యారెక్టర్ కి గోవాలో మరిన్ని మంచి సీన్స్ పడాల్సింది. ఆ బ్యాచ్ తో ట్రావెల్ చేస్తుంటాడు కానీ నవ్వించే సిచువేషన్ డైరెక్టర్ క్రియేట్ చేయలేకపోయారు. క్లైమాక్స్ లో ఫ్రెండ్స్ అందరూ సునీల్ తో ఆటాడుకుంటారు. ఆ సీన్స్ నవ్వుకునేలానే వచ్చాయి.
సినిమా మొత్తంలో చాలావరకు నవ్వించే ప్రయత్నం చేశాడు డైరెక్టర్. ఆ ప్రయత్నాన్ని మెచ్చుకోవాల్సిందే కానీ.. నవ్వించే క్రమంలో కొన్నిచోట్ల హద్దు దాటిన ఫీలింగ్ కనిపిస్తుంది. కాసర్ల శ్యామ్ పెళ్లి పాటలో కనిపించి ఓ అమ్మాయి వైపు తన చేయి చూపించి ఓ మోటు మాట అంటాడు. ఆ వెంటనే ఒక బాటిల్ తీస్తాడు. ఆడిటోరియంని నవ్వించడానికి ఇంతకంటే సంస్కారవంతమైన మార్గం మరొకటి లేదా? దర్శక నిర్మాతలు… ముఖ్యంగా రచయితలు ఆలోచించుకోవాలి. ఇదే కాదు కొన్ని చోట్ల ఇబ్బంది కలిగించే పద ప్రయోగాలు, హావ భావాలు, వ్యక్తికరణలు వుంటాయి. ‘చిరికిపోయిన ప్యాంట్ జేబు’ లాంటి సీన్స్ తో ఇంకెంత కాలం నెట్టుకోస్తారో దర్శక రచయితలే తేల్చుకోవాలి.
సంగీత్ శోభన్, నార్నె నితిన్, రామ్ నితిన్ ముగ్గురూ ఎనర్జిటిక్ గా కనిపించారు. నార్నె నితిన్ గతంలో కంటే హుషారుగా నటించాడు. మ్యాడ్ లో సంగీత్ శోభన్ టైమింగ్ అదిరిపోతుంది. కానీ పార్ట్ 2లో అతని క్యారెక్టర్ రైటింగ్ లో ఎక్కడో వెలితి కనిపించింది. లడ్డు పాత్రలో విష్ణుకి చాలా స్కోప్ దొరికింది. జోకులన్నీ లడ్డు పాత్రపైనే పేలాయి. సత్యం రాజేష్, సునీల్, మురళీధర్ గౌడ్ పాత్రలు నవ్విస్తాయి. అనుదీప్ ఓ సీన్ లో కనిపిస్తాడు కానీ మరీ నవ్వించే డైలాగులు లేవు. శుభలేఖ సుధాకర్ ది రొటీన్ కి భిన్నమైన పాత్ర. ప్రియాంక, రెబ్బామోనికా పాటల్లో మెరిశారు.
నేపధ్య సంగీతం తమన్ ఇచ్చారు. అయితే తమన్ మార్క్ అంటూ చెప్పుకోవడానికి ఏమీ లేదు. భీమ్స్ ఇచ్చిన లడ్డు గానీ పెళ్లి పాట హుషారు గా వుంది. స్వాతిరెడ్డి పాట కూడా ఎనర్జీ పంచింది కానీ అది రాంగ్ ప్లేస్ మెంట్. కెమెరా వర్క్ కమర్షియల్ సినిమాకి తగ్గట్టుగా వుంది. నిర్మాణంలో సితార సంస్థ యధావిధిగా తన క్యాలిటీ చూపించింది. సినిమాని కలర్ ఫుల్ గా తీశారు. తొలి సినిమా ఇచ్చిన కాన్ఫిడెన్స్ ఏమో కానీ మ్యాడ్ 2 కథపై ఏ మాత్రం దృష్టి పెట్టలేదు దర్శకుడు. కామెడీ పండితే చాలనుకున్నాడు. టైటిల్ లో స్క్వేర్ పెట్టారు కానీ వినోదంలో మాత్రం మ్యాడ్ ని మించలేకపోయింది.
తెలుగు360 రేటింగ్: 2.5/5