హైదరాబాద్: తెలుగు మీడియా ఇటీవలి కాలంలో అనేకసార్లు అస్వస్థతగా ఉన్న వ్యక్తుల గురించి మరణించారంటూ అత్యుత్సాహంతో తప్పుడు వార్తలు ఇవ్వటం, తర్వాత నాలిక్కరుచుకోవటం తెలిసిందే. తాజాగా సీనియర్ నటుడు, మాడా వెంకటేశ్వరరావు విషయంలోకూడా అదే రిపీటయింది. చిల్లరకొట్టు చిట్టెమ్మ, ప్రేమాభిషేకం వంటి సినిమాలలో ‘తేడా’ పాత్రలతో ప్రఖ్యాతిగాంచిన మాడా వెంకటేశ్వరరావు తీవ్ర అస్వస్థతకు గురవటంతో కుటుంబ సభ్యులు అపోలో ఆసుపత్రిలో చేర్పించారు. ఆయన బ్రెయిన్ స్ట్రోక్‌కు గురయ్యారని వైద్యులు నిర్ధారించి చికిత్స అందిస్తున్నారు. ఈలోపు ఇవాళ తెలుగు మీడియాలోని 95% సంస్థలు మాడా చనిపోయాడంటూ వార్తలు ఇచ్చేశాయి. చివరికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయంకూడా సంతాప ప్రకటన విడుదల చేసేసింది. తీరా చూస్తే మాడా బ్రతికే ఉన్నారు. ఈ వార్తలను మాడా కుటుంబ సభ్యులు ఖండించటమే కాకుండా అభ్యంతరం వ్యక్తంచేశారు. మళ్ళీ చచ్చినట్లు ఆ మీడియా సంస్థలన్నీ సారీ చెప్పి మాడా బ్రతికే ఉన్నారని వార్తలు ఇచ్చాయి.