విద్యుత్ కొనుగోళ్లు , పవర్ ప్లాంట్ల నిర్మాణాలపై ఏర్పాటు చేసిన పవర్ కమిషన్ కు కొత్త చైర్మన్ ను నియమించింది తెలంగాణ సర్కార్. జస్టిస్ మదన్ బీ లోకూర్ ను నియమిస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. మదన్ బీ లోకూర్ గతంలో ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా.. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా విధులు నిర్వర్తించారు.
విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాలపై జస్టిస్ నరసింహా రెడ్డి సారధ్యంలో తెలంగాణ సర్కార్ ఏర్పాటు చేసిన పవర్ కమిషన్ చట్ట విరుద్దమని మాజీ సీఎం కేసీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కేసీఆర్ తరఫున ముకుల్ రోహాత్గీ , ప్రభుత్వం తరఫున సిద్దార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు. అనంతరం సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం..జస్టిస్ నరసింహా రెడ్డి నేతృత్వంలోని పవర్ కమిషన్ విచారణ పూర్తి కాకముందే మీడియా సమావేశం ఏర్పాటు చేసి..విచారణ జరగకుండానే ఓ అభిప్రాయానికి రావడాన్ని తప్పుబట్టింది.
నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించిన జస్టిస్ నరసింహారెడ్డి స్థానంలో మరొకరిని నియమించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ క్రమంలోనే రేవంత్ సర్కార్ పవర్ కమిషన్ చైర్మన్ గా మదన్ బీ లోకూర్ నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో త్వరలోనే మళ్లీ ఈ విద్యుత్ కొనుగోళ్ల, ఒప్పందాలపై విచారణ పునః ప్రారంభం కానుంది.
కేసీఆర్ ను విద్యుత్ కొనుగోళ్లపై మొదట జస్టిస్ లోకూర్ లిఖితపూర్వక సమాధానం కోరుతారా? లేక ప్రత్యక్షంగా పవర్ కమిషన్ ఎదుట హాజరు కావాలని కోరుతారా..? ఇందుకోసం ఆయనకు ఎన్ని రోజుల సమయం ఇస్తారు..? అనేది ఆసక్తికరంగా మారింది.