కరోనా పరీక్షల విషయంలో ఆంధ్రప్రదేశ్ కీలకమైన ముందడుగు వేసింది. ఇప్పటి వరకూ వైరస్ టెస్టింగ్ కిట్స్ కోసం… దిగుమతులపైనే ఆధారపడాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు.. ఏపీలోనే టెస్టింగ్ కిట్స్ తయారవుతున్నాయి. విశాఖ మెడ్‌టెక్ జోన్లో తయారైన కరోనా టెస్టింగ్ కిట్స్ అందుబాటులోకి వచ్చాయి. వీటిని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరించారు. ర్యాపిడ్ టెస్టింగ్ కిట్ల ద్వారా యాభై నిమిషాల్లోనే ఫలితం తెలుసుకోవచ్చు. ప్రస్తుతం.. దాదాపుగా ఒక్కో టెస్టు ఫలితం రావడానికి రెండు రోజుల వరకూ సమయం పడుతోంది. విశాఖ మెడ్‌టెక్ జోన్లో కిట్లను తయారు చేస్తున్నారు. ప్రస్తుతం వెయ్యి కిట్లు అందుబాటులోకి వచ్చాయి. ఒక్క కిట్‌తో రోజుకు 20 టెస్టులు చేయవచ్చు.
మొత్తంగా ఇరవై వేల టెస్టులు ఈ కిట్ల ద్వారా చేసే అవకాశం ఉంది. ఇంకో వారం రోజుల్లో 10వేల కొవిడ్-19 టెస్టింగ్ కిట్లు అందుబాటులోకి రానున్నాయి. వీటిని ఏపీతోపాటు ఇతర రాష్ట్రాలకు పంపనున్నారు. వైరస్ సామాజిక వ్యాప్తికి దారి తీస్తోందని గుర్తించిన ఏపీ సర్కార్… రాపిడ్ టెస్టులు నిర్వహించాలని నిర్ణయించుకుంది ఈ మేరకు.. ఈ మెడ్‌టెక్ జోన్ కిట్ల వల్ల… టెస్టుల్లో వేగం పెరుగుతుంది. విశాఖ మెడ్‌టెక్ జోన్లో వెంటిలేటర్లను కూడా తయారు చేస్తున్నారు. ప్రస్తుతం వెంటిలేటర్స్ కోసం ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉంది. దేశంలో.. చాలా పరిమిత సంఖ్యలోనే ఇవి ఉన్నాయి.
కోవిడ్ -19 .. శ్వాస సమస్యను సృష్టిస్తుంది కాబట్టి.. ఎక్కువ మందికి వెంటిలేటర్స్ అవసరం ఉంటుంది. ఇప్పటి వరకూ… ఏపీలోనే కాదు.. ఇండియాలోనే… వీటి ఉత్పత్తి చాలా పరిమితం. పూర్తిగా దిగుమతులపైనే ఆధారపడాల్సి ఉంది. నెలాఖరు కల్లా మెడ్‌టెక్ జోన్లో వెంటిలేటర్స్ కూడా రెడీ అవుతాయి. దీంతో.. ఏపీకి చాలా వరకు వైద్య అవసరాలు తీరుతాయి. దేశానికి కావాల్సిన వైద్య అవసరాలు కూడా.. మెడ్‌టెక్ జోన్ తీర్చే అవకాశం ఉంది.